
విజయవాడ: చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒక రకంగా ఉంటాడు.. అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోతాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అసలు చంద్రబాబుకి ఆర్టీసీ స్థలం లూలుకి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందని ప్రశ్నించారాయన.
ఈరోజు(ఆదివారం, ఆగస్టు 3వ తేదీ) విజయవాడ నుంచి మాట్లాడిన రామకృష్ణ.. ‘వందల కోట్ల ఆర్టీసీ భూమి 99 ఏళ్లు లీజుకివ్వడమేంటి?, విశాఖలోనూ వందల కోట్ల భూమి లూలుకి కట్టబెట్టారు. విదేశాల్లో మూతబడిన లూలుకి ఇక్కడ ప్రభుత్వ భూములివ్వడం దేనికి?, కనీసం చర్చ కూడా లేకుండా చంద్రబాబు, నారాయణ లూలుకు ఆర్టీసి భూములిచ్చేశారు.
గన్నవరంలో విమానాశ్రయం ఉంటే మళ్లీ అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పెట్టాల్సిన అవసరం ఏముంది?, విమానాశ్రయాలు కడితే సరిపోదు...విమానాలు నడవాలి కదా. అమరావతిలో 1500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ పెడతాననడం హాస్యాస్పదం. ప్రపంచంలో ఎక్కడైనా రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో ఉందా? అని ప్రశ్నించారు రామకృష్ణ.