త్వరలో నూతన అధ్యక్షుడి ఎన్నిక

Congress Says Sonia Gandhi To Remain Interim President Till Then - Sakshi

రాహుల్‌ వైపే పార్టీ శ్రేణుల మొగ్గు

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ పదవీకాలాన్ని మరికొంత పొడిగిస్తారనే ప్రచారంపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ముగిసేవరకూ ఆమె ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా అధ్యక్షుడి ఎంపిక ఇంకా పూర్తికానందున పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఆమె పదవీకాలం పొడిగింపు సాంకేతిక అనివార్యం మాత్రమేనని తెలిపింది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు తమ పార్టీ సమాచారం అందించిందని వెల్లడించింది. కరోనా కట్టడికి మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు విఘాతం ఏర్పడిందని కాంగ్రెస్‌ చెబుతూవస్తోంది. 2019 సార్వ్తత్రిక ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో పార్టీ చీఫ్‌గా రాహుల్‌ గాంధీ వైదొలగిన సంగతి తెలిసిందే.

పార్టీ చీఫ్‌గా కొనసాగాలని కాంగ్రెస్‌ శ్రేణులు కోరినా రాహుల్‌ దిగిరాకపోవడంతో సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్ట్‌ 9న తాత్కాలిక చీఫ్‌ బాధ్యతలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కట్టబెట్టింది. సోమవారంతో తాత్కాలిక చీఫ్‌గా సోనియా గడువు ముగుస్తుండటంతో గడువు పొడిగింపు అనివార్యమైంది. సోనియా నియామకం అనంతరం మహారాష్ట్ర, హరియాణ, జార్ఖండ్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అనంతరం కోవిడ్‌-19 వ్యాప్తితో నూతన అధ్యక్షుడి ఎన్నికలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నూతన అధ్యక్షుడి ఎంపిక త్వరలో పూర్తవుతుందని, అప్పటివరకూ సోనియా గాంధీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతారని ఆ పార్టీ నేత అభిషేక్‌ సింఘ్వి తెలిపారు. మరోవైపు పార్టీని ముందుకునడిపేందుకు రాహుల్‌ గాంధీయే సరైన నేతని ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.

చదవండి : ఆ పదవికి రాహులైతేనే బెస్ట్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top