రాహుల్‌ అంటే బీజేపీకి భయం

Congress Party Revanth Reddy Fires On BJP - Sakshi

అందుకే కుట్ర చేసి అనర్హత వేటు వేశారు 

ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలు 

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అంటే బీజేపీకి భయమని, అందుకే కుట్రతో ఆయనపై అనర్హత వేటు వేశారని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు. పదవులను త్యజించే కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ గాంధీ విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, రాహుల్‌ గాంధీకి అండగా నిలబడాలని వారు పిలుపునిచ్చారు.

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ పార్లమెంట్‌ సెక్రటేరియట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వ ర్యంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’నిర్వహించారు. దీక్షలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారిఖ్‌ అన్వర్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావేద్, రోహిత్‌చౌదరి, సీనియర్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంతప్, చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లురవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఇతర నేతలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, వేం నరేందర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   దీక్షలో కాంగ్రెస్‌ నేతలు ఏమన్నారంటే.. 

కాంగ్రెస్‌ కుటుంబం అండగా ఉంటుంది: ఠాక్రే 
జోడో యాత్రతో రాహుల్‌  అంటే ఏంటో దేశానికి అర్థం అయింది. బీజేపీకి భయం మొదలయింది. అందుకే ఆయనపై కుట్ర చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ కుటుంబం ఆయనకు అండగా ఉంటుంది. మన సత్తా ఏంటో చూపించే సమయం ఆసన్నమయింది. 

అప్పటి నుంచే కుట్ర: ఎంపీ కోమటిరెడ్డి 
అదానీ వ్యవహారం గురించి పార్లమెంటులో మాట్లాడినప్పటి నుంచే రాహుల్‌పై కుట్ర చేశారు. పరువు నష్టం కేసులో శిక్ష పడేట్టు చేసి ఆగమేఘాల మీద అనర్హత వేటు వేశారు. అవసరమైతే కాంగ్రెస్‌ ఎంపీలమంతా రాజీనామా చేస్తాం. అనర్హత వేటు ఎత్తివేసేంతవరకు కాంగ్రెస్‌ శ్రేణులు పోరాడుతాయి. 

అణచివేత చర్య: జానారెడ్డి 
రాహుల్‌పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామిక చర్య. ఆయనను అణచివేయాలన్న కుట్రతోనే ఈ చర్యకు పాల్పడ్డారు. బీజేపీ కేవలం అధికారం కోసమే బీజేపీ పనిచేస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తుంది.  

కోలార్‌లో మాట్లాడితే గుజరాత్‌లో కేసు: ఉత్తమ్‌ 
దేశసంపదను అదానీకి ధారాదత్తం చేస్తున్న ప్రధాని మోదీ తీరును ఆధారాలతో సహా రాహుల్‌ బయటపెట్టారు. అందుకే ఆయనను అప్రజాస్వామికంగా బయటకు పంపే ప్రయత్నం చేశారు. కోలార్‌లో రాహుల్‌ మాట్లాడితే గుజరాత్‌లో కేసు వేశారు.  

బీజేపీ అంటే బ్రిటిష్‌ జనతా పార్టీ: రేవంత్‌ 
బీజేపీ అంటే బ్రిటిష్‌ జనతా పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  వ్యాపా రం ముసుగులో బ్రిటిషర్లు దేశంలో అడుగుపెట్టింది కూడా సూరత్‌లోనేనని, అదే సూరత్‌ నుంచే అదానీ కంపెనీలు కూడా వచ్చాయన్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో మోదీ, అదానీ బండారం బయటపడిందని చెప్పారు.

మోదీ, అదానీ అక్రమాలపై చర్చించాలని పార్లమెంటులో రాహుల్‌ పట్టుపట్టడంతోనే ఆయనపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై అనర్హత వేటు ఎందుకు వేయలేదని రేవంత్‌ ప్రశ్నించారు.

రాహుల్‌ని పప్పు అని అవహేళన చేసిన వారే ఇప్పుడు ఆయన నిప్పు అని తెలుసుకున్నారని, ఆ నిప్పును అడ్డుతొలగించుకునేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నాడు భగత్‌సింగ్‌  బ్రిటిషర్లకు లొంగిపోలేదని, అదే విధంగా రాహుల్‌ గాంధీ కూడా ఎవరికీ తలవంచరని అన్నారు. బీజేపీ సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి సాధించడానికి మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్‌ పిలుపునిచ్చారు.    

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top