కాంగ్రెస్‌ ప్రేమ దుకాణాల్లో ఫేక్‌ వీడియోలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రేమ దుకాణాల్లో ఫేక్‌ వీడియోలు

Published Wed, May 1 2024 2:57 AM

Congress and problems are like twin brothers says PM Modi

నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.. నకిలీ వీడియోలు సృష్టిస్తున్నారు  

ప్రతిపక్షంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం 

మహారాష్ట్రలో మోదీ ఎన్నికల ప్రచారం 

షోలాపూర్‌:  విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, సమస్యలు.. కవల పిల్లలు అని విమర్శించారు. దశాబ్దాలపాటు పరిపాలించిన కాంగ్రెస్‌ మన దేశానికి ఇచ్చింది పేదరికాన్ని తప్ప ఇంకేమీ లేదని ధ్వజమెత్తారు. మంగళవారం మహారాష్ట్రలోని లాతూర్, ధారాశివ్, షోలాపూర్‌ జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష కూటమి బీజేపీకి వ్యతిరేకంగా కృత్రిమ మేధ సాయంతో ఫేక్‌ వీడియోలు సృష్టించి, సోషల్‌ మీడియాలో వ్యాప్తిలోకి తీసుకొస్తోందని ఆరోపించారు. 

తన రూపాన్ని, గొంతును అనుకరిస్తూ.. తాను అనని మాటలు అన్నట్లుగా, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారని, సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్‌ వీడియోలను కాంగ్రెస్‌ ప్రేమ దుకాణంలో అమ్మకానికి పెట్టారని అన్నారు. ఎన్నికల పోరాటంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేక విపక్షాలు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రజలెవరూ నమ్మడం లేదని, అందుకే తప్పుడు దారులు ఎంచుకుందని విమర్శించారు. కాంగ్రెస్‌ అబద్ధాల దుకాణం మూతపడక తప్పదని తేచ్చిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే..  

పాకిస్తాన్‌కు విజ్ఞాపన పత్రాలు బంద్‌  
‘‘కాంగ్రెస్‌ పాలనలో మన దేశంలో ఉగ్రవాద దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్‌కు విజ్ఞాపనలు పంపించే పరిస్థితి ఉండేది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్‌కు విజ్ఞప్తులు చేసేవారు. అది చూసి మీడియాలో కొందరు మిత్రులు కాంగ్రెస్‌ను పొగుడుతూ చప్పట్లు కొడుతూ ఉండేవారు. అప్పట్లో ఇలాంటి వినతిపత్రాలపై పత్రికల్లో నిత్యం పతాక శీర్షికలతో వార్తలు వస్తుండేవి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ముష్కరుల దాడులు ఆగిపోయాయి.

విజ్ఞాపన పత్రాలను మనం నమ్ముకోవడం లేదు. శత్రువుల భూభాగంలోకి అడుగుపెట్టి మరీ గట్టిగా బుద్ధిచెబుతున్నాం. దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించాం. నవభారత్‌ ప్రగతికి ఇదొక సూచిక. ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉండే బలహీన ప్రభుత్వం బలమైన దేశాన్ని నిర్మించలేదు. ఈ ఎన్నికల్లో మన దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. ప్రపంచ అభివృద్ధికి నేడు భారత్‌ వేగాన్ని అందిస్తోంది. గత పదేళ్లలో మనం ఎన్నో ఘనతలు సాధించాం. బలమైన ప్రభుత్వంతోనే అనుకున్నది  సాధించగలం. 

ఓటు వృథా చేసుకోవద్దు  
దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్‌ నాశనం చేసింది. నేను ఏక్‌ భారత్, శ్రేష్ట భారత్‌ గురించి మాట్లాడితే కాంగ్రెస్‌ యువరాజుకు జ్వరం వచ్చేస్తోంది. దేశాన్ని దోచుకున్న నేతలు ఇప్పుడు జైల్లో ఉన్నారు. జనం సొమ్ము మింగేసినవారు తిరిగి కక్కాల్సిందే. అవినీతిపరుల నుంచి డబ్బు తిరిగి వసూలు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్‌కు ఒక్క కుటుంబమే ముఖ్యం. మాకు దేశంలోని ప్రతి కుటుంబం ముఖ్యమే. 2014, 2019లో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మేలు చేయడానికే ఉపయోగించాం. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్‌ విష ప్రచారం చేస్తోంది.

ఇప్పుడు సాక్షాత్తూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వచ్చినా రిజర్వేషన్లను రద్దు చేయలేరు. విద్య, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. వాటిని రద్దు చేయడం ఎవరివల్లా కాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత వేసి, ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టాలన్నదే కాంగ్రెస్‌ కుట్ర. ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్‌ ఎదగనివ్వలేదు. గత పదేళ్లలో పార్లమెంట్‌లో, అసెంబ్లీల్లో అడుగుపెట్టిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం బీజేపీ, ఎన్డీయేకు చెందినవారే.

ఈ ఎన్నికల్లో కనీసం 275 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితితో కాంగ్రెస్‌ ఉంది. అలాంటి పారీ్టకి ఎన్నికల్లో మద్దతు పలికి ఎవరూ ఓటు వృథా చేసుకోవద్దు. మహారాష్ట్రలో సంచరించే ఆత్మ(శరద్‌ పవార్‌) ఒకటి ఉంది. ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు చేసింది సున్నా. ఎన్నికల సమరంలో ప్రజలు ఆయనను ఓటుతో శిక్షించే సమయం వచ్చింది.  

ప్రధాని పదవిని ముక్కలు చేస్తారట!  
దేశ ప్రజలను, రైతులను కాంగ్రెస్‌ దగా చేసింది. వారి కలలను విచ్చిన్నం చేసింది. కాంగ్రెస్‌ హయాంలో రైతన్నలకు దక్కాల్సిన నిధులను, ఎరువులను కూడా లూటీ చేశారు. సాగునీటి వసతి కల్పించలేదు. ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. ప్రతిభావంతులైన మన దేశ యువతకు కాంగ్రెస్‌ వల్ల అన్యాయం జరిగింది. మన దేశం ముక్కలు కావడాన్ని కళ్లారా చూసినవారు ఇప్పుడు ప్రధానమంత్రి పదవిని ముక్కలు చేయాలని అనుకుంటున్నారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఇన్‌స్టాల్‌మెంట్లలో పంచుకుంటారట! ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు అనేది దేశాన్ని దోచుకొనే పథకమే. కాంగ్రెస్‌ పార్టీ ప్రమాదకరమైన ఆట ఆడుతోంది’’ అని ప్రధాని మోదీ ఆరోపించారు.  

కాంగ్రెస్‌ ఎజెండాపై ఓటర్లను అప్రమత్తం చేయండి
ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ  
విపక్ష కాంగ్రెస్‌ దురుద్దేశాలు, ఎజెండాపై ఓటర్లను అప్రమత్తం చేయాలని ప్రధానమంత్రి మోదీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని, ఓటు బ్యాంక్‌కు మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆ పార్టీ ఎత్తుగడ అని పేర్కొన్నారు. వారసత్వ పన్ను విధించి, ప్రజల ఆస్తులను లాక్కొని ఓటు బ్యాంక్‌కు అప్పగించాలన్నదే కాంగ్రెస్‌ ఎజెండా అని విమర్శించారు. 

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విభజన, వివక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రమాదకరమైన కాంగ్రెస్‌ ఎజెండాను ఓటర్లకు వివరించి, అప్రమత్తం చేయాలని ఎన్డీయే అభ్యర్థులను మోదీ కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బీజేపీకి ఒక విలువైన కార్యకర్త అని ఆయన రాసిన లేఖలో ప్రధాని ప్రశంసించారు. గతంలో గుజరాత్‌ మంత్రిగా, ఇప్పుడు కేంద్రమంత్రిగా అమిత్‌ షా చక్కటి పనితీరు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement