తూర్పులో ‘పచ్చ’రచ్చ

Conflicts In East Godavari District TDP - Sakshi

కాకినాడ రూరల్‌ ‘దేశం’లో ఆధిపత్య పంచాయితీ

టీడీపీ పదవులకు ‘పిల్లి’ దంపతులు గుడ్‌బై

చినరాజప్ప తీరే కారణమని ఆరోపణ

కాదంటున్న నిమ్మకాయల

అధికారంలో ఉన్నప్పుడు సామ్రాజ్యాలను విస్తరించుకుపోయారు తెలుగు తమ్ముళ్లు. అప్పుడు ఒకరంటే ఒకరికి పడకున్నా చేతిలో పవర్‌ ఉండటంతో కిమ్మనకుండా ఉన్నారు. తీరా గత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిని, అధికారానికి దూరమయ్యేసరికి వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికలకు వెళ్లడమంటే డబ్బుతో కూడుకున్న పని. అందుకు ముఖం చాటేస్తున్న నేతలు ఆ నిందను ఒకరిపై మరొకరు నెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల తరువాత జరిగే రాజకీయ పరిణామాలకు ఇప్పటి నుంచే వ్యూహాల కత్తులకు పదును పెడుతున్నారు.

సాక్షి ప్రతినిధి,రాజమహేంద్రవరం: జిల్లా టీడీపీ నేతల మధ్య చాప కింద నీరులా ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు.. ప్రస్తుత పంచాయతీ పోరు పుణ్యమా అని రచ్చకెక్కాయి. ఆ పార్టీ పదవులకు, కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, పార్టీ సీనియర్‌ నాయకుడు వీర వెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) శుక్రవారం గుడ్‌బై చెప్పారు. మీడియా ముందు రాజీనామా ప్రకటన వేళ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కంట తడి పెట్టారు. తమ రాజీనామాలకు మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కారణమని సత్తిబాబు ఆరోపించారు. (చదవండి: టీడీపీ పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా)

అయితే సత్తిబాబు దంపతుల మీడియా సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే చినరాజప్ప మాట్లాడుతూ, ఇందులో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. ఏడాది కాలంగా అనంతలక్ష్మి దంపతులు పార్టీ బాధ్యతల నుంచి వైదొలగుతామంటూ చెబుతూ వచ్చి, ఇప్పుడు హఠాత్తుగా తనపై నింద వేస్తున్నారని అన్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, బరువు మోయాల్సిన సమయంలో సత్తిబాబు కాడి వదిలేస్తున్నారని వైరి వర్గం ఆరోపిస్తోంది. ఈ వివాదానికి ఇరుపక్షాల నుంచి వినిపిస్తున్న వాదనలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ పచ్చ రచ్చకు అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. (చదవండి: చిత్తూరు జిల్లాలో టీడీపీ హైడ్రామా

భాస్కర రామారావును తీసుకువచ్చేందుకు.. 
ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును పార్టీలోకి క్రియాశీలకంగా తీసుకు రావాలనేది సత్తిబాబు వ్యూహం. పార్టీ ఆవిర్భావం నుంచి సత్తిబాబుకు భాస్కర రామారావు ప్రధాన అనుచరుడనే ముద్ర ఉంది. తాను త్యాగం చేసిన కాకినాడ రూరల్‌ స్థానానికి భాస్కర రామారావును తీసుకువచ్చి, చినరాజప్ప భవిష్యత్తు వ్యూహానికి చెక్‌ పెట్టాలనేది సత్తిబాబు ఎత్తుగడగా ఉంది. ఎక్కడో కోనసీమ నుంచి వచ్చి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి, తమ నియోజకవర్గంలో వేలు పెడితే తమ వ్యూహం తమకు ఉండదా అని సత్తిబాబు వర్గం ప్రశి్నస్తోంది. ఆర్థిక స్తోమతతో దూకుడుగా వ్యవహరించే భాస్కర రామారావును కాకినాడ రూరల్‌కు తీసుకువస్తే పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించినట్టవుతుందని సత్తిబాబు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని ఇటీవల ఆయన వద్ద ప్రతిపాదించారు. ఈ విషయాన్ని సత్తిబాబే స్వయంగా మీడియాకు చెప్పడం గమనార్హం. అయితే భాస్కర రామారావును తీసుకు రావాలనుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదని చినరాజప్ప వర్గం పేర్కొంటోంది. భాస్కర రామారావును తీసుకురావాలనే సత్తిబాబు వ్యూహం బయటకు పొక్కడంతో తప్పు తమ నాయకుడిపై నెట్టేందుకు ప్రయతి్నస్తున్నారని చినరాజప్ప వర్గీయులు అంటున్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, పవర్‌ పోయేసరికి పార్టీని వదిలేసిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం తప్పేమిటని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఎంపీటీసీ ఎన్నికల నుంచి నేటి పంచాయతీ ఎన్నికల వరకూ నియోజకవర్గ ఇన్‌చార్జిగా సత్తిబాబు అభ్యర్థులను నిలబెట్టకుండా పార్టీని నిరీ్వర్యం చేయడం వాస్తవం కాదా అని రాజప్ప వర్గీయులు ప్రశి్నస్తున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు పయనిస్తుందో వేచి చూడాల్సిందే. ఈలోగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇరు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. 

మా కుటుంబంపై మీకేమైనా గౌరవం ఉంటే, మాజీ శాసన సభ్యురాలిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే ఉద్దేశం ఉంటే నేను, నా భార్య అనంతలక్ష్మి చనిపోయిన తరువాత తెలుగుదేశం జెండా కప్పి శ్మశానానికి తీసుకువెళ్లండి. మీతో అభిప్రాయ భేదాలు కాదు.. నేను మనస్తాపం చెందాను. నా కుటుంబం ఇబ్బంది పాలయింది. నా కుర్రాళ్లు ‘తిరం’ కాదు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. అర్హత ఉన్న వారిని పెట్టుకోమని చెబుతున్నాను. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు ఇబ్బందులు వచ్చాయి. నెల కిత్రం చంద్రబాబుతో జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాను. ఆయన సమస్య రెక్టిఫై చేస్తానన్నారు. కానీ రానురానూ జిల్లా పార్టీ యంత్రాంగంలో నాకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కొంతమంది నాయకులకు నేనంటే ఇష్టం లేదు. ఇష్టం ఉన్న నాయకుడిని పెట్టుకోండి. నాకు ఇబ్బంది లేదు. బొడ్డు భాస్కర రామారావు వద్దకు వెళ్లి, కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో పోటీ చేయాలని, నీ వద్ద ఉన్న డబ్బు, సత్తా, ఎప్పియరెన్స్‌కు కచ్చితంగా నెగ్గుతావని అన్నాను. చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయి. బొడ్డు భాస్కర రామారావును రమ్మనడం వలన ఇబ్బందులు పెడుతున్నారేమో అర్థం కాలేదు. 
– పిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి 

రూరల్‌పై రాజప్ప కన్ను వేయడమే కారణమా! 
టీడీపీలో రగిలిన ఈ రచ్చకు కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కేంద్ర బిందువనే చర్చ నడుస్తోంది. రెండుసార్లుగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప వచ్చే ఎన్నికలకు కాకినాడ రూరల్‌పై కన్ను వేశారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో చినరాజప్ప కాకినాడ రూరల్‌ నుంచి పోటీకి దిగుతారని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో చినరాజప్పను పెద్దాపురం నుంచే రెండోసారి బరిలోకి దింపారు. పెద్దాపురంలో పార్టీ శ్రేణులు చెల్లాచెదురై ఆదరణ తగ్గిపోవడంతో మూడేళ్లు ముందే కొత్త స్థానం కోసం చినరాజప్ప వెతుకులాడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో తాను ఆశించిన కాకినాడ రూరల్‌ నియోజకవర్గంపై ఆయన కన్ను వేశారని అంటున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి కాకినాడ రూరల్‌లో లైన్‌ క్లియర్‌ చేసుకునే లక్ష్యంతోనే చినరాజప్ప ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి సత్తిబాబు దంపతులపై ఏడాది కాలంగా అధిష్టానానికి వ్యూహాత్మకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేశారని చినరాజప్ప పార్టీ అధినేత చంద్రబాబుకు పదేపదే ఫిర్యాదులు చేస్తూ, తమను తక్కువ చేస్తున్నారని సత్తిబాబు వర్గీయులు మండిపడుతున్నారు. అనంతలక్ష్మి దంపతులను కాకినాడ రూరల్‌ నుంచి పొమ్మనకుండానే పొగ పెట్టేందుకే రాజప్ప ఈవిధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాజకీయ వేధింపులకు తోడు ఇటీవల కుటుంబ పరంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలోనే పార్టీ పదవులు, ఇన్‌చార్జి బాధ్యతల నుంచి వైదొలగాల్సి వస్తోందని సత్తిబాబు చెబుతున్నారు. 

ఆ ప్రకటన బాధాకరం..
మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి నా కారణంగా బయటకు వెళ్తున్నట్టు శుక్రవారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. వీరిద్దరూ గత ఏడాది కాలంగా ఇంటి నుంచి బయటకు రాలేదు. అనంతరం చంద్రబాబు, యనమల రామకృష్ణుడితో పాటు నా వద్దకు కూడా వచ్చి తాను ఇన్‌చార్జ్‌గా ఉండలేనని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టాలని రామకృష్ణుడు చెప్పారు. ఆవిధంగానే గ్రామాల్లో అభ్యర్థులను ఏర్పాటు చేశారు. ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు నా కారణంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం బాధాకరం. నేను పార్టీ కోసం పని చేస్తాను. పార్టీకి నష్టం కలిగించే పని చేయను. 
– నిమ్మకాయల రాజప్ప, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే, పెద్దాపురం  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top