పేదలకు మంచి జరుగుతుంటే అడ్డుకుంటారా?

CM YS Jagan Fires On Chandrababu In Legislative Assembly - Sakshi

మీకెందుకింత కడుపు మంట బాబూ?

శాసనసభలో సీఎం వైఎస్‌ జగన్‌ ధ్వజం

పేదలకు ఇళ్లు కట్టిస్తాం... సామాజిక హోదా పెంచుతాం

వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ కలిసొచ్చిన వేళ పట్టాల పంపిణీ

ఈ నెల 25న 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలు

ఆ వెంటనే మొదటి దశ ఇళ్ల నిర్మాణం ప్రారంభం

పట్టాల పంపిణీ అడ్డుకుంటున్న చంద్రబాబు అండ్‌ కో 

ఎల్లో మీడియాలో రాయిస్తారు.. కోర్టుకెళ్లి స్టే తెస్తారు కోర్టులో కేసులు వేసిన టీడీపీ నేతల ఫొటోలు సహా వివరణ 300 చదరపు అడుగుల ‘టిడ్కో’ ఇంటిని ఒక్క రూపాయికే ఇస్తాం

365 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లకు రూ.25వేలు,430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లకు రూ.50 వేలు రాయితీ

డిసెంబర్‌ 25న 27 లక్షల మందికి పట్టాలు ఇచ్చేటప్పుడే మొత్తం 175 నియోజకవర్గాల్లోని 17,436 లేఅవుట్లకు గాను 8,494 లేఅవుట్లలో తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టబోతున్నాం. 15 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రతి ఊరు తిరిగి ఇళ్ల స్థలాలు ఇస్తారు.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టి రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతోపాటు ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి కలిసి వచ్చిన అరుదైన ముహుర్తమైన ఈ నెల 25న ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. దేశ చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా ఒకేసారి 30.66 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వబోతుంటే ప్రతిపక్షం కోర్టులో కేసులు వేయించి, దుర్మార్గంగా వ్యవహరిస్తూ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. మేనిఫెస్టో అన్నది స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా చంద్రబాబు ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతుండటం దారుణం అని, ఎందుకింత కడుపు మంట అని ధ్వజమెత్తారు. క్లారిటీ లేకుండా వక్రీకరిస్తూ మాట్లాడుతున్న చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల (టిడ్కో)పై మంగళవారం సభలో చర్చ సందర్భంగా చంద్రబాబు అసత్య ఆరోపణలు చేయడంపై జగన్‌ జోక్యం చేసుకుంటూ వాస్తవాలేమిటో వివరించారు. అవేమిటంటే..

దేశ చరిత్రలోనే ప్రథమం
దేశ చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా ఒకేసారి 30.66 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించాం. అయితే చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేయించి, స్టేలు తెచ్చి 3,65,680 ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. దీంతో ఈ నెల 25న 27 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఆ రోజు క్రిస్మస్‌ పండగ, వైకుంఠ ఏకాదశి. అంత మంచి ముహూర్తం అరుదుగా వస్తుంది. 11 వేలకు పైగా పంచాయతీల్లో 17,436 వైఎస్సార్‌ – జగనన్న కాలనీలు కనిపించబోతున్నాయి.
– ప్రతి పేద వాడికి సెంటున్నర స్థలం. పట్టణాల్లో అయితే సెంటు స్థలం. ఇప్పుడు మనం 68,677 ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. ఇందులో 25,359 ఎకరాల ప్రైవేట్‌ భూములను రూ.10,150 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలినవి ప్రభుత్వ భూములు. మొత్తంగా ఈ భూముల మార్కెట్‌ విలువ రూ.23,535 కోట్లు. అంత విలువ చేసే భూములను 30.66 లక్షల మంది పేదలకు పంచుతున్నాం.  

చంద్రబాబు కుటిల రాజకీయాలు
– ఇల్లు ఇవ్వడం అంటే హ్యూమన్‌ డిగ్నిటీకి సంబంధించిన విషయం. ఎకనామిక్, హెల్త్‌ పారామీటర్స్‌లో ఒక మెట్టు ఎక్కినట్లు లెక్క. ప్రతి ఇంట్లో నలుగురు ఉంటారనుకుంటే, దాదాపు 1.20 కోట్ల మందికి.. రాష్ట్రంలో నాలుగో వంతు ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు రకరకాల పద్ధతుల్లో కోర్టులో కేసులు వేయిస్తున్నందుకు బాధ కలుగుతోంది.  
– ప్రకాశం జిల్లాకు చెందిన మక్కెన శ్రీనివాసులు (ఫోటో చూపుతూ) ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్ధన నాయుడి శిష్యుడు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌గా పని చేశాడు. 24 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్న ఒంగోలులో స్టే తెచ్చారు. అక్కడ మైనింగ్‌ వద్దని, ట్రిపుల్‌ ఐటీ పెట్టాలని కోరిన వారే ఇప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని కోర్టుల్లో కేసు వేశారు.  
– తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 110 ఎకరాల్లో పోర్టు పక్కనే 4,800 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకున్నాం. నిజానికి ఆ స్థలం పక్కనే చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు మొదలు పెట్టారు. సగం కట్టారు. ఇప్పుడు అక్కడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు సతీష్‌ (ఫొటో చూపుతూ)   కోర్టుకు పోయి, అవి మడ భూములని చెప్పారు. నిజానికి అవి మడ భూములు కాకపోయినా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కలవడం.. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం, కోర్టుల ద్వారా స్టే రావడం జరిగింది.
– ఇదే రాజధాని ప్రాంతంలోని సీఆర్డీఏ పరిధిలో 54 వేల ఇళ్లు పేదలకు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడితే, కోర్టులో కేసు వేశారు. అమరావతిలోని ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇస్తే, భౌగోళికంగా అసమానతలు ఏర్పడతాయని (డెమోగ్రఫిక్‌ ఇమ్‌బ్యాలెన్స్‌– కులాలు, వర్గాల సమీకరణలు మారిపోతాయని) పేర్కొన్నారు. దాన్ని చూసి కూడా కోర్టు స్టే ఇచ్చింది అంటే పరిస్థితి ఏమిటి?  

బాబుకు కమ్యూనిస్టుల తోడు
– చంద్రబాబుకు ఈ మధ్య కమ్యూనిస్టులు తోడయ్యారు. సీపీఐని చూస్తే, వారు కమ్యూనిస్టులని మర్చిపోవాలి. వారు కమ్యూనలిస్టులు అయిపోయారు. విశాఖలో సీపీఐ జిల్లా కార్యదర్శి లోకనాథమ్‌ పిల్‌ వేశాడు. అక్కడ అక్షరాలా 1.52 లక్షల మందికి 5,364 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం. నిజానికి ఆ ల్యాండ్‌ పూలింగ్‌లో ఏ సమస్యా లేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినా పిల్‌ వేశారు. స్టే తెచ్చారు.
– అనంతపురానికి చెందిన గోకంటి సాయినాథరెడ్డి పరిటాల సునీతకు బాగా దగ్గరగా ఉంటాడు. చెట్లు కొట్టేస్తున్నారని ఆయన అక్కడ కోర్టులో కేసు వేయగా, స్టే వచ్చింది. 
– కర్నూలు జిల్లాలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌ రెడ్డి సొంత పీఏ మురళీమోహన్‌రెడ్డి కోర్టులో కేసు వేశాడు. ఇక్కడ ప్రభుత్వ భూమి. అది వాటర్‌ బాడీ అని కేసు వేసి, వ్యవస్థలను మేనేజ్‌ చేసి, స్టే తీసుకు వచ్చారు. 
– విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో జీవీ రమణ అనే వ్యక్తి కేసు వేశాడు. ప్రభుత్వ భూమిని గ్రేజింగ్‌ ల్యాండ్‌ అని ఆయనంతట ఆయనే ఊహించుకుని కేసు వేసి, స్టే తెచ్చాడు. 

27 లక్షల స్థలాల పంపిణీ
– మిగిలిన 27 లక్షలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు.. వాటిలో 2.62 లక్షలు టిడ్కోకు సంబంధించినవి ఉన్నాయి. మరో 4.86 లక్షల స్థలాలు పొజిషన్‌ సర్టిఫికెట్లు, ఎన్‌క్రోచ్‌మెంట్లకు సంబంధించినవి ఉన్నాయి. వారందరికీ ఈ నెల 25న ఇంటి స్థలాలు ఇవ్వబోతున్నాం. 17 వేలకు పైగా ఉన్న ఇళ్ల స్థలాల లేఅవుట్లలో 13 లక్షల మొక్కలు కూడా నాటుతున్నాం. 

ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు
– గతంలో కట్టిన ఇళ్లకు, ఇప్పుడు కడుతున్న ఇళ్లకు తేడా చూడాలి. పేదలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రూ.1.80 లక్షలతో కడుతున్న ఇల్లు ఎలా ఉంటుందన్నది చూద్దాం. (వీడియో చూపారు)
– ఆ ఇళ్ల నిర్మాణంలో మెటీరియల్‌ ప్రభుత్వమే సేకరిస్తోంది. లబ్ధిదారుడు కోరితే ఇస్తాం. లేబర్‌ ఖర్చు కూడా ఇస్తాం. సిమెంట్, స్టీల్‌ రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువ ధరకు సేకరిస్తున్నాం. ఇసుక ఫ్రీ. మెటల్‌ సేకరణ బాధ్యత కలెక్టర్లకు ఇచ్చాం. లబ్ధిదారుడు స్వయంగా కట్టుకుంటామంటే నిర్మాణ పురోగతికి అనుగుణంగా డబ్బు ఇస్తాం.  
– గతంలో కేవలం 224 చదరపు అడుగుల ఇల్లు ఇవ్వగా, మనం 340 ఎస్‌ఎఫ్‌టీ ఇల్లు కడుతున్నాం. గతంలో లివింగ్‌ రూమ్‌ కమ్‌ కిచెన్, బెడ్రూమ్, టాయిలెట్‌ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కిచెన్, లివింగ్‌ రూమ్, బెడ్రూమ్, వరండా, టాయిలెట్, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, నాలుగు లైట్లు, పైన సింటెక్స్‌ ట్యాంక్‌ కూడా ఏర్పాటు చేసి ఇస్తున్నాం.
– తొలి దశలో కట్టే 15.60 లక్షల ఇళ్ల వల్ల దాదాపు రూ.28,084 కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. కూలీలకు ప్రత్యక్షంగా 21.70 కోట్ల పని దినాలు, పరోక్షంగా 10 కోట్ల పని దినాలు లభిస్తాయి. 
– ఈ పెద్ద మనిషి (చంద్రబాబు) రూ.1,410 కోట్లు బకాయి పెట్టాడు. ఇందులో రూ.430 కోట్లు ఇప్పటికే కట్టాం. ఇంకొక రూ.908 కోట్లు ఈ నెల 25న లబ్ధిదారులకు అందజేస్తాం. 

చంద్రబాబు హయాంలో ఎన్ని ఇళ్లు? 
– చంద్రబాబు నాయుడు హయాంలో..  అంటే, 2019 మే 31 నాటికి ఎన్టీఆర్‌ రూరల్‌ హౌజింగ్‌ కింద 4.56,929 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్‌ కింద 47,120 ఇళ్లు, పీఎంఏవై అర్బన్‌ కింద 91,120 ఇళ్లు, విశాఖలో హుద్‌హుద్‌ తుపాను స్పెషల్‌ హౌజింగ్‌ కింద 8,817 ఇళ్లు కట్టారు. మొత్తం 6,03,986 ఇళ్లు కట్టారు.
– చంద్రబాబు అ«ధికారంలోకి రావడానికి ముందు, అంటే 2014కు ముందు 4,76,509 ఇళ్లు మంజూరు చేస్తే, 2,00,867 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. 

టిడ్కో ఇళ్లు – వాస్తవాలు 
– శాంక్షన్‌ అయిన టిడ్కో ఇళ్లలో ఎన్ని గ్రౌండింగ్‌ అయ్యాయన్నది చాలా ముఖ్యం. 300 చదరపు అడుగుల టిడ్కో ఇంటినే తీసుకుంటే, శాంక్షన్‌ అంటే కేంద్రం ఇచ్చేది కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే. దానికి రూ.2.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. మరో రూ.2.65 లక్షల రుణం లబ్ధిదారుడి పేరుతో బ్యాంక్‌ రుణం మంజూరు చేయించాలి. అవన్నీ జరిగితేనే ఒక ఇల్లు గ్రౌండ్‌ అవుతుంది. పనులు జరుగుతాయి. 
– అప్పుడు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు 7 లక్షలు. వాటిలో గ్రౌండ్‌ అయినవి కేవలం 2.62 లక్షలు మాత్రమే. ఈ 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు సంబంధించి దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యే స్థాయిలో ఉన్నవి దాదాపు 77 వేల ఇళ్లు మాత్రమే. 
– వాటిలో ఏ విధమైన మౌలిక వసతులు లేవు. టాయిలెట్లు, డ్రైనేజీ లేదు. కరెంటు, నీళ్లు లేవు. వాటన్నింటినీ పూర్తి చేయడానికి రూ.3 వేల కోట్లు ఇచ్చాం. వాటితో ఈ నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయమని చెప్పాం. ఎందుకంటే అవన్నీ చేస్తే తప్ప, ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి. ఆ పనులు చేయాలని ఏనాడూ చంద్రబాబు అనుకోలేదు.
– మరోవైపు రూ.3,200 కోట్లు బకాయి పెట్టాడు. ఇంకా శ్లాబ్‌లు వేసి వదిలేసిన ఇళ్లు 38 వేలు. సగంలో ఆగిపోయిన ఇళ్లు 71 వేలు. పునాదులు కూడా పూర్తి కానివి 1.20 లక్షల ఇళ్లు. ఆ రూ.3200 కోట్ల బకాయిలు తీర్చే బాధ్యత తీసుకోవడమే కాకుండా రూ.1,250 కోట్లు విడుదల చేశాం. పనులు సాగుతున్నాయి. పనులు పూర్తి కావాలంటే ఇంకా రూ.9,500 కోట్లు కావాలి. ఆ మేరకు ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది నిధులు మంజూరు చేసి ఇళ్లన్నీ పూర్తి చేస్తాం. టిడ్కో ఇళ్ల స్థలాలు కూడా నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చినవే. మరి ఈ పెద్ద మనిషి (చంద్రబాబు) క్రెడిట్‌ ఎలా తీసుకుంటాడు? 

వారికి కూడా మేలు..
– 365 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు కట్టాల్సిన రూ.50 వేలకు గాను రూ.25 వేలు, 430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల లబ్ధిదారులు కట్టాల్సిన రూ.లక్షకు గాను రూ.50 వేలు కడితే చాలు. మిగతాది ప్రభుత్వం భరిస్తుంది. 
– గతంలో చంద్రబాబు హయాంలో చేపట్టిన 2.62 లక్షల ఫ్లాట్లలో 63,744 ఫ్లాట్లకు సంబంధించి 2019 డిసెంబర్‌లో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి రూ.392 కోట్లు ఆదా చేశాం. అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఆలోచించండి. మిగిలిన 1.90 లక్షలకు పైగా ఫ్లాట్ల నిర్మాణంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో, చంద్రబాబు జేబులోకి ఎంత పోయిందో ఆలోచించండి.  

చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలి
మేనిఫెస్టో అన్నది స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతుండటం దారుణం. క్లారిటీ లేకుండా వక్రీకరిస్తూ మాట్లాడుతున్న చంద్రబాబును ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చించకపోతే సమాజానికి, రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. 
– మా మేనిఫెస్టో మాకు  భగవద్గీత, బైబిల్, ఖురాన్‌. నేను పాదయాత్రలో ఏం మాట్లాడాను.. మేనిఫెస్టోలో ఏం రాశాము అన్నది చెబుతాను (వీడియో చూపారు, చదివి వినిపించారు). ‘పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఒక్కొక్క ఇల్లు 300 అడుగులట. అడుగు రూ.2 వేలకు అమ్మారు. రూ.3 లక్షలను కేంద్ర, రాష్ట్రాలు ఇస్తాయి,. మరో 3 లక్షల రూపాయలను పేదవాడి పేరుతో అప్పుగా రాసుకుంటారు. 20 ఏళ్ల పాటు నెల నెలా రూ.3 వేలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి. ఈ అప్పు భారం రద్దు చేసి ఆ భారాన్ని పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది’ అని నేను సరిగ్గా ఏది మాట్లాడానో అదే మేనిఫెస్టోలో పెట్టాము.
– అంత క్లియర్‌ కట్‌గా మేము చెబితే చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు. మేనిఫెస్టోలో మేము చెప్పిన దాంట్లో ఒక లైన్‌ తీసేసి, ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఎక్కడికక్కడ వక్రీకరిస్తున్నారు.  

స్వాగతిస్తున్నామంటూనే రాజకీయాలా?
టీడీపీ ద్వంద్వ వైఖరిపై సీఎం జగన్‌ ధ్వజం
ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి బిల్లును స్వాగతిస్తున్నట్లు ఒకవైపు చెబుతూ మరోవైపు రాజకీయంగా మెలిక పెట్టాలనే ప్రతిపక్ష టీడీపీ వైఖరి ఏమాత్రం సరికాదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇంటర్నెట్, ఆన్‌లైన్‌ గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబు గత ఐదేళ్లలో ఆన్‌లైన్‌ జూదాన్ని నియంత్రించడానికి చట్టం ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు. గత సర్కారు ఈ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు.

స్వాగతిస్తున్నాం కానీ..
రాష్ట్రంలో ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ (సవరణ)–2020 బిల్లుపై శాసనసభలో మంగళవారం చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ దీన్ని స్వాగతిస్తున్నామని.. కానీ రాష్ట్రంలో కొందరు అధికార పార్టీ నేతలు ఆఫ్‌లైన్‌ జూదాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు క్లబ్‌ను మూసివేసి నిజాంపట్నంలో జూదాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేయడంపై అధికారపార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జూదాలు ఎక్కడ, ఎవరు నిర్వహిస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ దశలో హోంమంత్రి మేకతోటి సుచరిత జోక్యం చేసుకుంటూ టీడీపీ సభ్యులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ  అభ్యంతరం వ్యక్తం చేశారు. గేమింగ్‌ యాక్ట్‌–1974 ప్రకారం పేకాట లాంటి జూదాలను మాత్రమే నియంత్రించే అవకాశం ఉందని, ఆన్‌లైన్‌ జూదం, బెట్టింగ్‌లను వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా నిర్వహిస్తుండటం వల్ల నియంత్రణలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అందుకే ఆన్‌లైన్‌ జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ గేమింగ్‌ యాక్ట్‌–1974కు సవరణ తెస్తూ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. 

మంత్రి బంధువైనా వదల్లేదు..
పేకాట శిబారాలపై చర్యలు తీసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులను అధికారపార్టీ నేతలు నియంత్రిస్తున్నారంటూ టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ మరోసారి ఆరోపణలు చేయడంతో ముఖ్యమంత్రి జగన్‌ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘కర్నూలు జిల్లాలో మంత్రి జయరాం దూరపు బంధువు ఒకరు గ్రామంలో పేకాట నిర్వహిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి బంధువు అని వదిలేయకుండా కేసు నమోదు చేశారు’ అని గుర్తు చేశారు. ఆన్‌లైన్‌ జూదానికి యువత బానిసలు కారాదనే ఉద్దేశంతో వీటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘జూదం, ఆన్‌లైన్‌ జూదానికి అడుకట్ట వేసేందుకు వెంటనే ప్రత్యేక టోల్‌ ప్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే నిర్వాహకులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. అనంతరం ఏపీ గేమింగ్‌(సవరణ)–2020 బిల్లును శాసనసభ ఆమోదించింది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top