AP Assembly: మనది సంక్షేమ బ్రాండ్‌.. నారా వారిది సారా బ్రాండ్‌   

CM YS Jagan Comments On Chandrababu In AP Assembly Sessions - Sakshi

శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం మరెన్నో పథకాలతో అక్కచెల్లెమ్మలకు లబ్ధి 

మోసాలు చేసే చంద్రబాబు.. ఈ మంచి చూడలేకపోతున్నారు 

మన ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీకి, బ్రూవరీకి అనుమతివ్వలేదు 

ఇప్పుడున్న డిస్టిలరీల్లో సగానికిపైగా చంద్రబాబు అనుమతిచ్చినవే 

ఈ మద్యం బ్రాండ్లన్నీ ఆ డిస్టిలరీలు తయారు చేస్తున్నవే.. తయారీ కంపెనీ ఒకటే అయినపుడు పేర్లపై యాగీ ఎందుకు? 

254 బ్రాండ్లు.. శ్రీమాన్‌ మద్య మహా చక్రవర్తి చంద్రబాబు చేతి చలవే 

దత్తపుత్రుడు పేరుతో పవర్‌స్టార్‌ 999.. బావమరిది పేరుతో లెజెండ్‌  

వీటన్నింటినీ వాళ్లబ్బాయి పేర ‘ఎల్‌’ బ్రాండ్స్‌గా ఎందుకు పిలవకూడదు?  

ప్రెసిడెంట్‌ మెడల్‌కు అనుమతిచ్చింది బాబే కాబట్టి.. అది టీడీపీ ప్రెసిడెంట్‌ మెడల్‌ 

బాబు ఇంటి పేరును నారా బదులు సారా అని మార్చుకోవాలి 

ఇదే లిక్కర్‌ నాడు హెల్త్‌ డ్రింక్‌ అట.. నేడు మాత్రం విషమట! 

బాబు హయాంలో నాటు సారా లేదా? సమస్య సారాది కాదు.. నారాది  

జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ జగనన్న ఇళ్లు, దిశ.. ఇవన్నీ మన బ్రాండ్స్‌ అయితే.. ఇప్పుడు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్న ప్రతి బ్రాండ్‌ చంద్రబాబుదే. బూమ్‌ బూమ్‌ బీర్, ప్రెసిడెంట్‌ మెడల్, గవర్నర్స్‌ ఛాయిస్, హెవెన్స్‌ డోర్, క్రేజీ డాళ్, క్లిఫ్‌ హేంగర్, రష్యన్‌ రోమనోవా, ఏసీబీ ఇలాంటివి దాదాపు 254 బ్రాండ్లు చంద్రబాబు తెచ్చినవే. 

సొంత మామకు వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైన ఇదే చంద్రబాబు.. ఎన్నికలు వచ్చినప్పుడు అదే ఎన్టీఆర్‌ విగ్రహానికి దండ వేస్తాడు. ఇది చంద్రబాబు ట్రేడ్‌ మార్క్‌. అలాగే తన హయాంలో ఇప్పుడున్న మద్యం బ్రాండ్లకు, డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ తానే ప్రెస్‌మీట్‌ పెట్టి ఇవెక్కడి బ్రాండ్స్‌? అని ప్రశ్నిస్తాడు. మనిషిగా చంద్రబాబు, పార్టీపరంగా టీడీపీ, మీడియా పరంగా ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ప్రవర్తన ఏపీలో చీప్‌గా ఉంది. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన రెండున్నరేళ్లల్లో ఒక్క మద్యం డిస్టిలరీకిగాని, బ్రూవరీకి గాని అనుమతివ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు బాబు హయాంలో అనుమతులు పొందినవేనని, పైగా టీడీపీ నాయకులు, వారి బంధువులవే ఎక్కువగా ఉన్నాయన్నారు. మనది సంక్షేమ బ్రాండ్‌ అని.. నారా వారిది సారా బ్రాండ్‌ అని అభివర్ణించారు. రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానం, చంద్రబాబు తీరుపై బుధవారం ఆయన అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం గురించి రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే పరమావధిగా పని చేస్తోందని, ముఖ్యంగా అక్క చెల్లెమ్మల ప్రగతికి పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వారికి మరింత రక్షణ చేకూర్చడంలో భాగంగా ఇవాళ 163 దిశ వాహనాలను, 18 రెస్ట్‌ రూమ్స్, వాష్‌రూమ్స్‌తో కూడిన క్యారవేన్స్‌ను ప్రారంభించామన్నారు. దిశ యాప్‌ ద్వారా రాష్ట్రంలో 900కు పైగా ఘటనల్లో అక్కచెల్లెమ్మలను పోలీసులు ఆదుకున్నారన్నారు. ఈ 34 నెలల కాలంలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకున్నామని చెప్పారు. కానీ టీడీపీ నాయకులకు, చంద్రబాబుకు, అతనికి వంత పాడే మీడియాకు మాత్రం ఇవన్నీ కనిపించడం లేదన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఇవన్నీ మన పథకాలు..
► అమ్మ ఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. 84 లక్షల మంది పిల్లల మంచి కోసం రూ.13,023 కోట్లు ఇచ్చాం.  
► వైఎస్సార్‌ ఆసరా ద్వారా 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ.12,758 కోట్లు ఇచ్చి అండగా నిలిచాం. చేయూత పథకం ద్వారా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.9,180 కోట్లు, కాపునేస్తం ద్వారా మరో రూ.980 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా మరో రూ.589 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించాం. 
► ఈ కార్యక్రమాల పేర్లు విన్నప్పుడు సాధికారిత గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆ స్థలాల్లో మొదటి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. తద్వారా అక్కచెల్లెమ్మలకు చేకూరే లబ్ధి దాదాపు రూ.2 – 3 లక్షల కోట్లు ఉంటుంది. 
► జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఇలా ఏ డబ్బయినా నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వివక్ష లేకుండా జమ చేస్తున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అక్కచెల్లెమ్మలకు రాజకీయ పదవులిచ్చి మంచి చేశాం. ఇవన్నీ మన కార్యక్రమాలని, పథకాలని గర్వంగా చెప్పుకుంటాం. 

మంచిని చూసి ఓర్వలేని బాబు 
► చంద్రబాబు హయాంలో ఇవేవీ లేవు. మనం మంచి చేసినందుకు అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఆ బాధ చంద్రబాబు తట్టుకోలేడు. అందుకే రకరకాల రూపాల్లో వికృతంగా బయట పెడుతున్నాడు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలంటూ, రాష్ట్రంలో చీప్‌ లిక్కర్‌ అమ్ముతున్నారంటూ, ఎప్పుడూ వినని పేర్లుతో బ్రాండ్లు వచ్చాయని విషం చిమ్ముతున్నారు. 
► చంద్రబాబుకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో రోజూ అదే పనిగా క«థనాలు రాస్తున్నారు.. చూపిస్తున్నారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేసే ఒక్క పథకం ఆయన చరిత్రలో లేదు. 

మద్య మహాన్‌ చక్రవర్తి చంద్రబాబు
► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఫిబ్రవరి 6న ప్రెసిడెంట్‌ మెడల్‌కు అనుమతిచ్చారు. కాబట్టి దాన్ని టీడీపీ ప్రెసిడెంట్‌ మెడల్‌ అనాలి. దానికి మనం అనుమతి ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 
► ఇక గవర్నర్స్‌ రిజర్వ్‌.. దీనికి 2018 నవంబర్‌ 5న బాబు అనుమతిచ్చారు. కానీ, మేం రాష్ట్రపతిని, గవర్నర్‌ను అవమానించామని బురద చల్లుతున్నారు. ఇవేగాకుండా నెపోలియన్, ఆక్టన్, సెవెన్త్‌ హెవెన్‌ అన్న బ్రాండ్స్‌ కూడా ఆయనే తీసుకొచ్చారు. వాటన్నింటికి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ 2018 అక్టోబరు 26న అనుమతి లభించింది. 

వాటన్నింటిపై దృష్టి పెట్టాం
► నాటు సారా తయారీ, అమ్మకాలపై గట్టి నిఘా పెట్టాం. ఎస్‌ఈబీ ఏర్పాటు చేశాం. మద్యం అలవాటును మానిపించాలని ధరలు పెంచాం. ఆ పని చేస్తే ఎందుకు ధరలు పెంచారని వారే విమర్శించారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా పెరుగుతోందని ఎస్‌ఈబీతో పాటు, ఆ శాఖ నుంచి ఫీడ్‌బ్యాక్‌ రావడంతో ఆ ధరలను తగ్గించాం.
► మరోవైపు 43 వేలకు పైగా బెల్టుషాపులను, మద్యం షాపులకు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశాం. మద్యం షాపులను 4,380 నుంచి 2,934కు తగ్గించాం. నిర్ణీత వేళల్లో ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు ప్రభుత్వమే స్వయంగా మద్యం అమ్మకాలు చేపట్టింది. 
► కఠినంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే ఈ రెండేళ్లలో 14.32 లక్షల లీటర్ల సారా నిల్వలను ధ్వంసం చేశాం. ఈ ప్రభుత్వ హయాంలోనే సారా తయారు చేస్తున్నట్లు చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం చేస్తుండటం దారుణం. టీడీపీ హయాంలో సారా లేదా? టీడీపీ హయాంలో సారా కట్టడి కోసం ఐదేళ్లల్లో 1,42,228 కేసులు పెడితే, మన ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 1,09,983 కేసులు నమోదు చేశాం. సమస్య నాటు సారాది కాదు. నాటు నారాది. కల్తీ అయినా, విషమైనా వారి మనసులోనే ఉంది. అధికారం లేదన్న కడుపు మంట.  

బాబు చెప్పినట్టు మద్యం హెల్త్‌ డ్రింక్‌ కాదు
► బీరు, లిక్కర్‌ ఏదైనా ఒక ప్రొసీజర్‌ ప్రకారం అనుమతి ఇచ్చిన ఆల్కహాల్‌ శాతంతో, లైసెన్స్‌డ్‌ డిస్టిలరీలు మాత్రమే తయారు చేస్తాయి. అందుకే ఇక్కడ బ్రాండ్‌ ముఖ్యం కాదు. ప్రాసెస్‌ విధానమే ప్రధానం. ఏ ప్రాసెస్‌ లేకుండా తయారు చేసే మద్యం చాలా ప్రమాదకరం.
► డిస్టిలరీలు, బ్రూవరీల్లో తయారయ్యే మద్యం తక్కువ ప్రమాదకరం. బాబు హయాంలో చెప్పినట్లు ఇవేవీ హెల్త్‌ డ్రింక్స్‌ కాదు. అవి తాగితే మంచిది అని ఆయన ఉద్బోధించారు. నాటుసారా తాగితే ఎక్కువ ప్రమాదం. లిక్కర్‌ తాగితే తక్కువ ప్రమాదం. అందుకే ఏదైనా కూడా తక్కువ ప్రమాదకరమా? ఎక్కువ ప్రమాదకరమా? అన్నది చూడాలి. ప్రభుత్వం ఎవరిదున్నా.. బ్రాండ్ల మద్యం తయారీ ఒక్కలాగే ఉంటుంది. ప్రాసెస్‌లో మార్పులు ఉండవు. 

రాష్ట్రంలో చీప్‌ లిక్కర్‌ లేదు 
జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను కల్తీ మద్యం మరణాలని చిత్రీకరించడానికి చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే పచ్చ మీడియా చేయని ప్రయత్నం లేదు. అక్కడ కల్తీ సారా తాగి చనిపోయారంటూ కొన్ని పేర్లతో ఈనాడులో కథనం రాశారు. జరగనిది జరిగినట్లు చూపించాలని విషపూరితమైన కుట్ర మనస్తత్వంతో చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెస్‌ చేసిన, లైసెన్స్‌డ్‌ డిస్టలరీస్‌ నుంచి వచ్చే లిక్కర్‌ తప్ప చీప్‌ లిక్కర్‌ అనేది లేదు. తమ వాళ్లవి సాధారణ మరణాలే అని సంబంధిత కుటుంబాల వారే చెబుతుండగా (వీడియో ప్రదర్శించారు), కాదు కాదంటూ టీడీపీ, ఎల్లో మీడియా శవ రాజకీయం చేస్తోంది.

దుర్బుద్ధితో దుష్ప్రచారం 
► లిక్కర్‌ తయారీ విధానంలో 2019 తర్వాత మనందరి ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. తయారీ సంస్థలన్నీ పెద్ద లైసెన్స్‌డ్‌ డిస్టిలరీలే. ఇవి జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లిక్కర్‌ను తయారు చేస్తాయి. ప్రతి దశలోనూ క్వాలిటీ కంట్రోల్‌ ఉంటుంది. 
► కంపెనీల నుంచి బాటిల్స్‌ను బయటకు ఇచ్చేటప్పుడు కూడా పరీక్షిస్తారు. మన అధికారులు చాలా టెస్టులు చేస్తారు. అలాగే ప్రభుత్వం ఫలానా బ్రాండ్‌కు అనుకూలం అనో, మరో బ్రాండ్‌కు వ్యతిరేకం అనో ఉండదు. ఇక్కడ బ్రాండ్‌ పేరు ప్రధానం కాదు. మద్యం నిర్ధారించిన ప్రమాణాలతో, లైసెన్స్‌డ్‌ డిస్టిలరీల నుంచి వస్తుందా.. లేదా అనేదే ముఖ్యం. ఆ ప్రోడక్టుకు పవర్‌ స్టార్‌ 99 పేరు పెడతారా? లెజెండ్‌ 999 అని పెడతారా? బూమ్‌బూమ్‌ అని పెడతారా.. అన్నది మాకు సంబంధించిన అంశం కాదు.
► ఈ విషయాలన్నీ తెలిసీ కూడా బాబు దుర్బుద్ధితో కొత్త తతంగానికి తెర లేపారు. లిక్కర్‌లో ప్రమాదకర పదార్థాలు ఉన్నాయని, ఎస్‌జీఎస్‌ ల్యాబ్స్‌ ఈ విషయాలు చెప్పిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. ఐఎంఎఫ్‌ఎల్‌ బ్రాండ్లను చీప్‌ లిక్కర్‌ అని, నాటు సారా అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. 
► రాష్ట్రానికి లిక్కర్‌ ద్వారా ఆదాయం రాకూడదని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాలనే దుర్బిద్ధితో, దురాలోచనతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి, ఆ ల్యాబ్‌ను సంప్రదిస్తే, వారు లిఖిత పూర్వకంగా అలాంటివేవీ లేవని సమాధానమిచ్చారు.
► బీఐఎస్‌ స్టాండర్డ్స్‌లోని ఐఎస్‌ 4449 విస్కీ, ఐఎస్‌ 4450 బ్రాందీ ప్రమాణాల ప్రకారం పరీక్షించలేదని, శాంపిల్స్‌ ఇచ్చిన వ్యక్తులు ఈ స్టాండర్డ్స్‌ ప్రకారం పరీక్షలు చేయమని అడగలేదని ఎస్‌జీఎస్‌ చెప్పింది. పైగా వారిచ్చిన శాంపిల్స్‌లో ఉన్న పదార్థాలు హానికరమని తాము నిర్ధారించలేదని స్పష్టం చేశారు.
► వారిచ్చిన శాంపిల్స్‌ ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. వాటిని ట్యాంపర్‌ చేయడానికీ అవకాశాలున్నాయి. బాబుగారి పాలనలో అవే లైసెన్స్‌డ్‌ డిస్టిలరీల నుంచి బయటకు వచ్చిన లిక్కర్‌ తాగితే హెల్త్‌ డ్రింక్‌.. మన హయాంలో అయితే అదే లిక్కర్‌ విషం అట.

ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడూ వదల్లేదు
► హైదరాబాద్‌ బ్రాండ్‌ విస్కీలకు 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. వీరా, బ్లామ్‌డే వంటి బ్రాండ్లతో పాటు, బూమ్‌ బూమ్‌ బీర్‌ అట.. ఇవన్నీ శ్రీమాన్‌ మద్య మహాన్‌ చక్రవర్తి చంద్రబాబుగారి హయాంలోనే వచ్చాయి. 
► చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 ఏప్రిల్, మే నెలలో క్రేజీ డాల్, రాయల్‌ స్వీట్‌ డీలక్స్, 999 లెజెండ్‌ విస్కీ, న్యూకింగ్‌ లోయెస్ట్‌ 14, ప్రెసిడెంట్‌ మెడల్‌ ఫైన్‌ విస్కీ, ఏడీ 79 ట్రిపుల్‌ ఎక్స్‌ రమ్, బీరా 91, బ్లాండ్‌ సమ్మర్‌ లేజర్‌ బీర్, క్లిఫ్‌ హ్యాంగర్‌ బ్రాండ్లకు అనుమతిచ్చారు.
► 2019 మే 14న కూడా బూమ్‌ బూమ్‌ బీర్‌కు అనుమతి ఇచ్చాడు. హైవోల్టేజ్‌ గోల్డ్‌ బీర్, ఎస్‌ఎన్‌జె బీర్, బ్రిటిష్‌ ఎంపైర్‌ బీర్‌ ఇవన్నీ బాబుగారి హయాంలోనే రంగ ప్రవేశం చేశాయి. 
► 2018 నవంబర్‌లో రాయల్‌ ప్యాలెస్‌ బ్రాండ్లు, సైనౌట్‌లు వచ్చాయి. నిజానికి స్పెషల్‌ స్టేటస్, త్రీ క్యాపిటల్స్‌ అనే బ్రాండ్లు లేవు. మన ప్రభుత్వం మీద బురద చల్లడానికి సోషల్‌ మీడియాలో స్టిక్కర్స్‌ తగిలించి ఫేక్‌ ట్రోల్స్‌ చేశారు. ఇంత దుర్మార్గమైన మనుషులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. 
► 2016లో చంద్రబాబు ఉషోదయం పేరుతో సారాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ చేశారు. విచిత్రంగా ఇదే పెద్దమనిషి ఐదేళ్లల్లో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతిచ్చి లిక్కర్‌ విక్రయాలను ప్రమోట్‌ చేశారు.

ఆ కంపెనీలన్నీ టీడీపీ వారివే 
► ఈ డిస్టిలరీలు, బేవరేజెస్‌లు అన్నీ టీడీపీకి చెందిన వారివే. ఎస్‌పీవై బ్రాండ్‌ ఎవరిది? ఎస్‌పీవై రెడ్డి టీడీపీ నాయకుడు కాదా! విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతిచ్చారు. అది టీడీపీకి చెందిన అయ్యన్నపాత్రుడి కంపెనీ. దాన్ని గత ఏడాది అమ్మేశానని చెప్పారు. అంటే ఏడాది క్రితం వరకు ఆయనదే కదా! ఎన్నికల ముందు అనుమతి ఇచ్చారా? లేదా? పీఎంకే డిస్టిలరీ యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా? శ్రీకృష్ణా డిస్టిలరీ ఆదికేశవులునాయుడిది కాదా? ఆయన టీడీపీ నాయకుడే కదా!
► దత్తపుత్రుడు పేరు మీద, బావమరిది పేరుతో లెజెండ్, ట్రిపుల్‌ 9 పవర్‌ స్టార్‌ బ్రాండ్లు తీసుకొచ్చారు. కాకపోతే రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 గుర్తుకు రాలేదేమో.. వారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. ఇవన్నీ చంద్రబాబు స్వయంగా అనుమతి ఇచ్చినవే. అలాంటప్పుడు వాటిని చీప్‌ లిక్కర్‌ అంటూ మనపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు?

ఆ బ్రాండ్లు బాబు తెచ్చినవే 

► బాబు హయాంలో 254 బ్రాండ్స్‌ వచ్చాయి. ఇవేకాకుండా ఆయన దత్తపుత్రుడు పేరుతో పవర్‌స్టార్‌ 999, బావమరిది పేరుతో లెజెండ్‌ కూడా తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న జె బ్రాండ్స్‌ను నిజానికి బాబు బ్రాండ్స్‌ అనో ఆయన కుమారుడు లోకేశ్‌ పేరుతో ‘ఎల్‌’ బ్రాండ్స్‌ అనో ఎందుకు పిలవకూడదు? ఎందుకంటే వాటికి మనం అనుమతివ్వలేదు. కానీ మన హయాంలో వచ్చాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. 
► రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే వాటికి అనుమతులన్నీ మన ప్రభుత్వం రాక ముందే ఇచ్చారు. 1982కు ముందు ఐదు మాత్రమే ఉంటే.. మిగతావన్నీ ఆ తర్వాత వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో 14 డిస్టిలరీలకు అనుమతిలిచ్చారు. 
► ఇందులో 2014– 2019 మధ్య సీఎంగా చంద్రబాబు ఏకంగా ఏడు డిస్టిలరీలకు అనుమతులిచ్చారు. మనం 16 కొత్త మెడికల్‌ కాలేజీలు, కొత్త జిల్లాలకు అనుమతులు ఇస్తుంటే.. బాబు మాత్రం 14 డిస్టలరీలకు అనుమతి ఇచ్చారు. అందుకే ఆయన ఇంటి పేరు నారా బదులు సారా అని మార్చుకోవాలి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top