ప్రక్షాళన.. సంక్షేమం.. | CM Revanth Reddy focus is on key issues: telangana | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన.. సంక్షేమం..

Jun 15 2024 4:58 AM | Updated on Jun 15 2024 4:58 AM

CM Revanth Reddy focus is on key issues: telangana

పాలన గాడిన పడేలా కీలక అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌లతో విడివిడిగా భేటీ 

అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలనే నిర్ణయం 

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు 

బడ్జెట్‌ రూపకల్పన, రుణమాఫీ, పరిమితులు,

ఆర్థిక అంశాలు, నామినేటెడ్‌ పోస్టులపై భట్టితో సమీక్ష 

స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఏఐసీసీ సమీక్షలపైనా మంత్రులతో మంతనాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసిన నేపథ్యంలో పాలన గాడినపడేలా కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. అధికార యంత్రాంగం ప్రక్షాళన, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఫోకస్‌ చేశారు. వచ్చే నెలలో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే నేపథ్యంలో అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో తన క్యాంపు కార్యాలయంలో విడివిడిగా సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పాలన వరకు.. నామినేటెడ్‌ పోస్టుల నుంచి ఏఐసీసీ సమీక్ష వరకు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు రుణమాఫీని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు యథాతథంగా అమలు చేయాలా? ఏవైనా పరిమితులు విధిస్తే ఎలా ఉంటుంది? రుణమాఫీ అమలుకు అవసరమైన ఆదాయ వనరుల సమీకరణ ఎలాగన్న అంశాలపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది.

ఈ అంశంపై ఇంతకుముందే రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌తో చర్చించిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇక ఆదాయ వనరులు పెంచుకునే అంశంపై ఇదివరకే కీలక శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున.. లక్ష్యం మేరకు ఆదాయం సమకూరేలా చూడాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా చూడాలన్న భావన వ్యక్తమైనట్టు సమాచారం. 

ఉదయం ఉత్తమ్‌తో అభివృద్ధిపై.. 
సీఎం రేవంత్‌ శుక్రవారం ఉదయం మంత్రి ఉత్తమ్‌తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు ఇద్దరూ మాట్లాడుకున్నట్టు తెలిసింది. మేడిగడ్డ బరాజ్, సీతారామ ప్రాజెక్టులను సందర్శించిన సందర్భంగా పరిశీలనకు వచ్చిన అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్‌ఏ నివేదిక, జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ విచారణ, సాగునీటి శాఖ సిబ్బందికి పదోన్నతులు తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం.

ఇప్పటివరకు ఎన్నికల కోడ్‌ కారణంగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని రేవంత్, ఉత్తమ్‌ల భేటీలో అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇక వీలైనంత త్వరగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని, తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు స్థిరీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికితోడు విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అమలు, ఇందుకు అవసరమైన బియ్యం సేకరణపై వారు చర్చించినట్టు సమాచారం. 

మధ్యాహ్నం భట్టితో ఆర్థిక అంశాలపై.. 
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో డిప్యూటీ సీఎం భట్టితో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ రూపకల్పనకు అనుసరించాల్సిన విధానం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుల రుణమాఫీ, దీని అమల్లో పరిమితులు, కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకం, ఆదాయం పెంపు, వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్షలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, కులగణన విషయంలో వ్యవహరించాల్సిన తీరు, విద్యుత్‌ అంశంపై వేసిన జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌ పనితీరు, ఐఏఎస్‌ల బదిలీలు, లోక్‌సభ ఎన్నికలపై వచ్చే వారంలో ఏఐసీసీ నిర్వహించనున్న సమీక్షలు తదిరత అంశాలపై ఈ ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది.

పంద్రాగస్టులోపు కచ్చితంగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని ఆర్థిక వెసులుబాట్లను పరిశీలించాలని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు కేబినెట్‌ భేటీ కంటే ముందు ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి రావాలనే చర్చ జరిగినట్టు తెలిసింది. ఇక నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో చర్యలు, చేయాలనుకుంటున్న మార్పు­లు, ఇప్పటికే ప్రకటించిన పోస్టుల ఉత్తర్వుల విడుదల, మిగతా పదవుల భర్తీ తదితర రాజకీయ అంశాలపైనా రేవంత్, భట్టి చర్చించారని సమాచారం.  

భౌతికదాడులను ఉపేక్షించేది లేదు
అరాచకాలు, హత్యలను సహించం : సీఎం రేవంత్‌ 
సాక్షి, హైదరాబాద్‌ : భౌతికదాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు, నారాయణపేట జిల్లా ఉట్కూర్‌ మండలంలో శుక్రవారం పట్టపగలు గువ్వల సంజీవ్‌ను కొట్టి చంపిన ఘటనపై సీఎం సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే, బాధ్యులైన పోలీసుపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.  

పోక్సో కేసు నమోదు చేయండి 
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఫోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.  

విద్యార్థినుల ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం హ్యాపీ  
ఆర్టీసీ బస్సులో ‘ఉచిత ప్రయాణ పథకం’వల్ల తాము ఉచితంగా బస్సెక్కి పాఠశాలలకు వెళ్లగలుగుతున్నామ ని సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మగ్దుంపూర్‌ కు చెందిన విద్యార్థినులు ఆధార్‌కార్డులు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఒక జర్న లిస్టు సీఎంకు ఫొటో పంపారు. ఆ ఫొటోను సీఎం తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు పెట్టి కామెంట్‌ చేశారు. ఊరికి కిలోమీటర్‌ దూరాన ఉన్న పాఠశాలకు ఖర్చు లే కుండా వెళుతున్నామని ఆ బాలికలు చెబుతుంటే అంతకంటే ఆనందం ఏముంటుందని సీఎం వ్యాఖ్యానించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement