కన్విన్స్‌ చేస్తే కేసీఆర్‌కు బరాజ్‌లు అప్పగిస్తాం | CM Revanth Reddy Comments On KCR About Kaleshwaram project | Sakshi
Sakshi News home page

కన్విన్స్‌ చేస్తే కేసీఆర్‌కు బరాజ్‌లు అప్పగిస్తాం

Jul 8 2026 2:13 AM | Updated on Jul 8 2026 2:13 AM

CM Revanth Reddy Comments On KCR About Kaleshwaram project

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి

వారం రోజులు బరాజ్‌లను కేసీఆర్‌కు అప్పగించాలన్న కేటీఆర్‌ సవాలుకు ఘాటుగా సమాధానం 

ఒప్పిస్తే వచ్చే మూడేళ్లు ఆయనకే అప్పగిస్తాం,ఏం చేస్తడో చేయనీ... కాంట్రాక్టర్లను తొలగించి ఆయననే హెడ్‌ ఆఫ్‌ ది కాంట్రాక్టర్‌ను చేస్తం 

చేసిన నేరం ఘోరం తెలిసే కేసీఆర్‌ ముఖం చాటేస్తున్నారు 

కప్పిపుచ్చుకోడానికి అబద్ధాలు చెప్పేవారిని ఊరిమీదకు వదిలారు 

ఆయన స్పీకర్‌కు లేఖ రాస్తే అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ 

పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ‘కేసీఆర్‌ స్పీకర్‌కు లేఖ రాస్తే ఆయన కోరిన తారీఖున, కోరుకున్నన్ని రోజులు శాసనసభ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చిద్దాం. ప్రత్యేక అనుమతితో శాసనసభ, మండలి జాయింట్‌ సెషన్‌ పెట్టి కేసీఆర్‌కు ఎందుకు ఇవ్వాలో కన్విన్స్‌ చేస్తే మూడు బరాజ్‌లను 100 శాతం వచ్చే మూడేళ్లు అప్పగిస్తాం. ఏం చేస్తడో చేయనీ. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ, ఇతర కాంట్రాక్టర్లను తొలగించి ఈయననే హెడ్‌ ఆఫ్‌ ది కాంట్రాక్టర్‌గా చేసి అప్పగిద్దాం. తనకు కావాల్సినోళ్లందరినీ పెట్టుకుని ఎలా పునరుద్ధరిస్తడో చేయనీయండి..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విపక్షనేత కేసీఆర్‌కు సవాలు విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. 

అనంతరం రేవంత్‌ రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ‘సబ్జెక్ట్‌ నిపుణులు, అడ్వొకేట్‌ జనరల్‌ను స్పీకర్‌ అనుమతితో మాట్లాడిద్దాం. ఏమాత్రం మీ(కేసీఆర్‌) గౌరవానికి, మర్యాదకు భంగం కలగకుండా సజావుగా జరి గే బాధ్యత శ్రీధర్‌బాబు తీసుకుంటారు. మేధావిగా ఆయన సూచన చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుంది. మీకు ప్రతిపక్ష నేత హోదా లేదా? జీతభత్యాలు తీసుకుంటున్నారు. సభకు వచ్చి మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు చేసిన నేరం ఘోరం మీకు తెలుసు. అందుకే ముఖం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోడానికి బేషరంగా అబద్ధాలు చెప్పేవారిని ఊరిమీద వదిలి మమ్మల్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నరు’అని బీఆర్‌ఎస్‌ నేతలపై రేవంత్‌ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు కేసీఆర్‌కు అప్పగిస్తే నీళ్లను ఎత్తిపోసి చూపిస్తామని కేటీఆర్‌ చేసిన సవాలుకు ప్రతిస్పందనగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.  

కమీషన్ల కోసం పేరు, ఊరు మార్చి... 
‘దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రూ.38వేల కోట్ల అంచనాలతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. తెలంగాణ వచ్చిన ఏడాదిన్నర వరకు రూ.11,670 కోట్ల ఖర్చు చేశాక కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల వసూలుకు ప్రాజెక్టు రీడిజైనింగ్‌ పేరుతో కేసీఆర్‌ ఆలోచనలు మారాయి. ఊరు, పేరు మార్చి, అంచనాలు పెంచి నిధులను కొల్లగొట్టాలని కేసీఆర్‌ స్కీమ్‌ వేస్తే ఆయన ఆలోచన తప్పని రిటైర్డ్‌ ఇంజనీర్ల కమిటీ 2015లో స్పష్టంగా చెప్పింది. మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మిస్తే ఉండదు, వేమలపల్లి వద్ద నిర్మిస్తే పర్వాలేదు అని చెప్పింది. ఈ నివేదికను కేసీఆర్‌ తొక్కిపెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌లు, పంపులు, లిఫ్టులు కట్టదలిచినా అని ఆర్డర్‌ ఇచ్చారు. వాళ్లు నిపుణులు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ కాదు. వాళ్లు రాజకీయాల్లో తిమ్మినిబమ్మి చేయడంలో నిపుణులు కావచ్చు. 

అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి ఎలక్షన్‌ కలెక్షన్లలో నిపుణులు. ఇందులో ముగ్గురికీ ఫస్ట్‌ ర్యాంక్‌ పంచాల్సి వస్తుంది. ఊరు, పేరు మార్చి రూ.38వేల కోట్ల ప్రాజెక్టు అంచనాలను రూ.81వేల కోట్లకు పెంచారు. అంచనా రూ.1.47 లక్షల కోట్లకు పెరగనుందని కాగ్‌ నివేదిక ఇచ్చింది. ఇంత తిన్నా డిజైన్, ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణలో నాణ్యత పాటించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తన మెదడును రంగరించి, 80వేల పుస్తకాలు చదివి కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్‌ చేసిన, ఇది నా బ్రెయిన్‌చైల్డ్‌ అని కేసీఆర్‌ స్వయంగా చెప్పుకున్నారు. నాటి గవర్నర్‌ నరసింహన్‌ అబద్ధాల రావుల మాటలు నమ్మి హరీశ్‌రావుకు కాళేశ్వరం రావు అని బిరుదు ఇచ్చారు’అని సీఎం ఎద్దేవా చేశారు.  

రెండు మూడేళ్లలో వేల కోట్ల కోసం ... 
‘కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ 2019 జూన్‌ 21న ప్రారంభించాడు. యజ్ఞాలు యాగాలు చేసిండు. ఎన్ని చేసినా చిత్తం శువుడి మీద భక్తి చెప్పులపై ఉన్నట్టు ఆయన ఆలోచనలు ఎంత సేపు ఎట్ల కొల్లగొట్టాలనే ఆలోచనతో హడావిడిగా ప్రారంభించాడు. ఏడాది తిరిగే లోపే మేడిగడ్డలో లోపాలన్నీ బయటపడ్డాయి. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమీషన్లు ఇచ్చాం. ఇంకా రిపేర్లు ఎవరు చేసుకుంట కూర్చుంటడు అని ఎల్‌అండ్‌టీ పట్టించుకోలేదు. రోజురోజుకి సమస్య పెద్దదై కుప్పకూలే పరిస్థితి వచ్చింది. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ సర్వే చేసి బరాజ్‌లు కట్టడానికి ఇది సరైన ప్రాంతం కాదని ఆ రోజుల్లోనే నివేదిక ఇచ్చాడు. రెండు మూడేళ్లలో రూ.వేల కోట్లను సంపాదించుకోవాలని కేసీఆర్‌ హడావుడి చేశారు. భూపరీక్షలు చేయకుండానే ఇసుకలో బరాజ్‌లు కట్టారు. కట్టిన వెంటనే 100 శాతం సామర్థ్యంతో నీళ్లను నిల్వ చేయడంతో బరువు తట్టుకోలేక మేడిగడ్డ కుంగిపోయింది’అని సీఎం పేర్కొన్నారు. రేవంత్‌ మాటలు ఆయన మాటల్లోనే.. 

భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది.. 
‘నాలుగు పిల్లర్లు పోతే ఏమవుతుందని కేసీఆర్‌ అంటాడు. వెన్నుపూసలో నాలుగు పూసలు దెబ్బతింటే మంచానికి పరిమితమై ఉండాల్సిందే. గోదావరి ప్రాజెక్టులకు వెన్నుపూస ‘మేడిగడ్డ’దెబ్బతింది. 80వేల పుస్తకాలు చదివిన మేధావి తొమ్మిదిన్నరేళ్లు కష్టపడి మూడేళ్లలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమై కుప్పకూలింది. మళ్లీ ఇప్పుడు వారం రోజులు మాకు ఇవ్వండి.. తడాఖా చూపిస్తాం అంటుండు(కేటీఆర్‌). పోనీ ఆయనైనా(కేసీఆర్‌) వచ్చి అడిగిండా? ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్లందరినీ తోలుతుండు. ప్లానింగ్‌ డిజైనింగ్‌ నాణ్యత, నిర్వహణ లోపాలతోనే కుంగిందని ఎన్డీఎస్‌ఏ కమిటీ కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. మొత్తం బరాజ్‌ దెబ్బతిన్నది, నీళ్లు నింపితే కుప్పకూలుతుంది. ఖాళీ చేయమని చెప్పింది. లేకుంటే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయి. యథాతథంగా బరాజ్‌ల గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోయాలని ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్‌ చెప్పలేదు. మేడిగడ్డ తరహా టెక్నాలజీతోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. అక్కడా బుంగలు ఏర్పడ్డాయి. నీళ్లు ఆపితే బరాజ్‌లు కూలి కింద ఉన్న భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది. 

బాంబులతో పేలిస్తే భూమిలోకి పోతదా? 
బాంబులతో పేలిస్తే బరాజ్‌ గాల్లోకి లేస్తదా? భూమిలోకి పోతదా? మన మీద వేస్తడేమిటి? మీ నాన్న అవినీతికి బలైపోయింది. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పు అయితే, కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్, రూ.లక్ష కోట్ల ఆస్తులు; కేటీఆర్‌కు జన్వాడ, హరీశ్‌రావుకి మొయినాబాద్‌లో 50 ఎకరాల్లో, కవితకు శంకరపల్లిల్లో 25 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఎలా వచ్చాయి? కేసీఆర్‌ ఆగర్భ శ్రీమంతుడు ఎలా అవుతాడు? పత్రికలు, చానళ్లు, వ్యాపారాలు, బెంజీకార్లు ఎలా వస్తాయి? ఆ సూత్రం ఏదో చెప్తే మొత్తం తెలంగాణ బాగుపడ్తది. రూ.లక్ష కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టును నిలబెట్టుకోవాలని తాపత్రయం పడుతున్నం. కరువు వచ్చినప్పుడు పనికి వస్తుందని దూరదృష్టితో కేసీఆర్‌ కాళేశ్వరం కట్టిండని ఒకాయన అంటాడు. ఎల్‌నినోతో నీళ్లే లేవు. వరద ఉధృతంగా వచ్చినప్పుడు 90 రోజుల్లో తరలించుకోవడానికి కట్టింది. వర్షాలు రానప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయాలని అల్లుడు (హరీశ్‌) అంటున్నడు. కనీస పరిజ్ఞానం ఉన్నోడు మాట్లాడే మాటలేనా? వర్షమే లేదు. 
 
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌..ఆర్థిక ఆగ్రవాదులు 
తొమ్మిదిన్నేర ఏళ్లు మీకు అప్పగిస్తే రూ.8.21లక్షల కోట్ల అప్పులు చేశారు. రూ.38వేల కోట్ల అంచనాలను రూ.1.47లక్షల కోట్లకు పెంచి, రూ.1.02 లక్షల కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించాక కట్టిన రెండేళ్లకే కాళేశ్వరం కూలిపోయి కూలేశ్వరమైంది. దీనిని నిర్వాకం కాదు విధ్వంసం అంటారు. ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్‌ కుటుంబం. ఆర్థిక ఉగ్రవాదులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌. తెలంగాణ ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేశారు. అప్పుడే నేరాలన్నీ మాఫీ అయినట్టు వ్యవహరిస్తున్నారు. 15 ఆగస్టు, 26 జనవరికి తీవ్రమైన నేరాలు చేసిన వారికీ మార్పు వచ్చిందని క్షమాభిక్ష పెడుతుంటాం. వీళ్లు మారేటోళ్లు కాదు. తెలంగాణ ఉద్యమంలో ముసుగుతొడుక్కుని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి దోపిడీకే ప్రాధాన్యతనిచ్చారు. అని రేవంత్‌ పేర్కొన్నారు. 

ఉరివేయాలంటే నిబంధనలు అడ్డు 
బరాజ్‌లు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే రాత్రింబవళ్లు కూర్చుని చేపించేవాళ్లం. ఏం చేయలేని నిస్సాహాయస్థితిలో ఉన్నం. బాధ, కోపం ఉన్నాయి. రూ.లక్ష కోట్లుపెట్టింది ఇలా అయింది. నేరగాళ్లను శిక్షించ లేకపోతున్నాం. ప్రజలందరూ వీరిని ఉరితీయాలని కోరుకుంటే నియమనిబంధనలు అడ్డువస్తున్నాయి. కేంద్ర మంత్రి చెప్పినట్టు విచారణను సీబీఐకు అప్పగిస్తూ 2025 సెపె్టంబర్‌ 1న జీవో ఇస్తే ఇంకా చేపట్టలేదు అని సీఎం మండిపడ్డారు.  
 
మీరేందుకు మాట్లాడడం లేదు?  
‘మీరేందుకు ధైర్యంగా మాట్లాడం లేదు. ఎందుకు ఘాటుగా తిప్పికొట్టలేకపోతున్నరు. 30 నెలల్లో చేయని పని ఏదైనా ఉందా? 15 నెలల్లో 67వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. హామీలన్నీ అమలు చేశాం. తెలంగాణలోని అన్ని కుటుంబాలకు రూ.5లక్షల ప్రమాద బీమా అమలు చేయబోతున్నాం’అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 10న మధిర నియోజకవర్గంలో రైతుభరోసా సభకు అందరూ రావాలని ఆహా్వనించారు. మరో రూ.1000 కోట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement