పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్‌ | CM Revanth Comments On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్‌

May 22 2025 1:58 AM | Updated on May 22 2025 1:58 AM

CM Revanth Comments On PM Narendra Modi

సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రేవంత్‌రెడ్డి

ఇందిరాగాంధీ హయాంలో పాక్‌కు గట్టి గుణపాఠం 

చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రాహుల్‌పై విమర్శలు 

దేశ భద్రత, సమగ్రత విషయంలో జవాన్లకు అండగా ఉంటాం

రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్‌ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్‌ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. 

దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్‌లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. 

నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్‌ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. 

కశ్మీర్‌ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. 

దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్‌ గాందీ, బీఆర్‌ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్‌ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. 

ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement