‘నెల్లికల్లు’పై లొల్లి 

Clash of BJP and BRS activist - Sakshi

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఘర్షణ  

తిరుమలగిరి (నాగార్జునసాగర్‌), సాక్షి, హైదరాబాద్‌: నందికొండ నుంచి హాలియా, హైదరాబాద్‌ వెళ్లే రహదారిపై నెల్లికల్లు స్టేజీవద్ద మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్‌ హాలియా సభకు వస్తుండటంతో.. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులను సకాలంలో పూర్తి చేయలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన శిలాఫలకం వద్ద ఆ పార్టీ నాయకులతో కలిసి ఖాళీ కుర్చితో నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం బీజేపీ నాగార్జునసాగర్‌ అభ్యర్థి కంకణాల నివేదితరెడ్డితోపాటు కార్యకర్తలు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాలియాలో సభ జరపడం అన్యాయమంటూ నెల్లికల్లు స్టేజీ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

ఆ సమయంలోనే మండలంలోని నెల్లికల్లు, జాల్‌తండా, ఎర్రచెరువు తండాలకు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు హాలియాలో సీఎం ప్రజా ఆశీర్వాద సభకు వెళ్తూ.. దారి ఇవ్వాలని కోరగా అందుకు బీజేపీ నాయకులు వెళ్లనివ్వబోమంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు కంకణాల శ్రీధర్‌రెడ్డిని చితకబాదారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌ దాడులు: కిషన్‌రెడ్డి  
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానని కేసీఆర్‌ ఇచ్చిన వాగ్ధానం నేటికీ నెరవేరలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. మంగళవారం ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌ హాలియాకు వచ్చిన నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి శాంతియుతంగా ధర్నా చేస్తుండగా ఆయనపై బీఆర్‌ఎస్‌      గూండాలు దాడి చేశారని అన్నారు.

ప్రజల విశ్వాసం కోల్పోయామన్న అసహనంతో బీజేపీ కార్యకర్తలపై బీఆర్‌ఎస్‌ దాడులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top