భూసేకరణ పరిహారం చెల్లింపులో రాష్ట్ర అధికారులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
నిజాయితీ లేని ఆఫీసర్ల పనే ఇదంతా.. ఏదో ఆశించి ఫైళ్లను ఆపుతున్నారు
అసైన్డ్ భూములైనా సరే.. తీసుకున్న నాటి నుంచే పరిహారం ఇవ్వాల్సిందే
1989 జనవరి 2 నుంచి 15% వడ్డీతో కలిపి మొత్తం చెల్లించండి
తెలంగాణ ప్రభుత్వానికి 4 వారాల గడువు.. రైతులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో భూనిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారుల తీరుపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. రైతుల పొట్టకొట్టేలా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే హైకోర్టుకు కూడా విసుగొచ్చినట్లుందని వ్యాఖ్యానించింది. అధికారుల తీరును తప్పుబడుతూనే.. మూడున్నర దశాబ్దాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘మీ డిపార్ట్‌మెంట్‌లో కొంతమంది నిజాయితీ లేని అధికారులు ఉన్నారు. వారు ఏదో వ్యక్తిగత ప్రయోజనం ఆశించి, ఉద్దేశపూర్వకంగానే నిధులు విడుదల కాకుండా అడ్డుపడుతున్నారు. ఇది కచ్చితంగా దురుద్దేశంతో చేస్తున్న పనే. అధికారుల మోసపూరిత వైఖరి వల్లే పేదలకు అన్యాయం జరుగుతోంది’అంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేసు నేపథ్యం ఇదీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలో సాగునీటి కాలువ నిర్మాణం కోసం 1989 జనవరి 2న జొన్నలగడ్డ కృపమ్మ, ఇతర రైతుల నుంచి ప్రభుత్వం భూమిని స్వా«దీనం చేసుకుంది. అయితే, ఆ తర్వాత ఏళ్ల తరబడి జాప్యం చేసి 1997లో భూసేకరణ ప్రక్రియను రికార్డుల్లో చూపించారు. ఇవి అసైన్డ్ భూములని, రైతులు సాగు చేయడం లేదని సాకులు చెబుతూ అధికారులు పరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. వారికి పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ, పరిహారం చెల్లించకుండా ఉండేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగీ్చలతో కూడిన ధర్మాసనం విచారించింది.
భూమి లాక్కున్నాక సాకులు చెబితే కుదరదు: సుప్రీంకోర్టు
తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘మేము 1997లో భూములను వెనక్కి తీసుకున్నాం. అవి అసైన్డ్ భూములు కావడంతోపాటు, అప్పట్లో అవి సాగులో లేవు. అందుకే పరిహారం పెండింగ్‌లో ఉంది’అని వివరించే ప్రయత్నం చేశారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మీరు 1989లోనే భూమిని భౌతికంగా స్వాధీనం చేసుకున్నారు. భూసేకరణ చట్టం కింద ఒకసారి భూమిని తీసుకున్నాక.. అది సాగులో ఉందా? లేదా? అసైన్డ్ భూమా? అనేది అనవసరం. ‘యాజ్ ఈజ్ వేర్ ఈజ్’పద్ధతిలో పరిహారం చెల్లించాల్సిందే. భూమి తీసుకున్నాక.. ఇప్పుడు సాగులో లేదు కాబట్టి డబ్బులివ్వం అంటే కుదరదు’’అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
కోర్టులంటే లెక్కలేదా?
‘ఈ కేసులో హైకోర్టులో ఇప్పటికే రెండు రౌండ్ల విచారణ నడిచింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేసిన ప్రతిసారీ.. డబ్బు డిపాజిట్ చేస్తామని అధికారులు కోర్టులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ చిల్లిగవ్వ విదిల్చలేదు. కోర్టులంటే మీ అధికారులకు గౌరవం లేదు’అని ధర్మాసనం మండిపడింది. భూమిని స్వా«దీనం చేసుకున్న తేదీ (జనవరి 2, 1989) నుంచే పరిహారం లెక్కించాలని ఆదేశించింది. పాత చట్టం ప్రకారం నిర్ణయించిన పరిహారానికి సాంత్వన పరిహారంతోపాటు, ఏటా 15 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని స్పష్టం చేసింది. మొత్తం బకాయిలను 4 వారాల్లోగా సంబంధిత రిఫరెన్స్ కోర్టులో ప్రభుత్వం డిపాజిట్ చేయాలని గడువు విధించింది. డబ్బు డిపాజిట్ చేసిన వెంటనే రైతులు ఆ మొత్తాన్ని ఎలాంటి షరతులు లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ పరిహారం తీసుకున్నంత మాత్రాన రైతులు హక్కులు కోల్పోరని, మరింత పరిహారం కోసం చట్టపరంగా పోరాడే హక్కు వారికి ఉంటుందని తేల్చి చెప్పింది.


