20 నెలలైనా పీఆర్సీ, ఐఆర్‌పై స్పందన లేదు
గత సంక్రాంతికి పోలీసులకు రెండు సరెండర్ లీవ్‌లు ఇస్తానన్నారు
మళ్లీ సంక్రాంతి వచ్చినా ఇవ్వలేదు
10–11 తేదీలొచ్చినా జీతం రావట్లేదు
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం స్పష్టంగా కనపడుతోందని,. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా ఇంతవరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, ఐఆర్‌పై కనీసం స్పందించడం లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా చేయలేదని, పీఆర్సీ వేయలేదని విమర్శించారు.
గత సంక్రాంతికి ఇస్తారని చూసినా ఉద్యోగులకు నిరాశే మిగిలిందని, మళ్లీ సంక్రాంతి వచ్చినా ప్రభుత్వంలో చలనం లేదని, ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచే ప్రభుత్వమని వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గత సంక్రాంతికి పోలీసులకు 2 సరెండర్ లీవ్‌ల బిల్లులు చెల్లిస్తామని స్వయంగా ఆరి్ధక మంత్రి హామీ ఇచ్చారని, మళ్లీ సంక్రాంతి వచ్చినా అవి పూర్తిగా చెల్లించలేదని విమర్శించారు. దీపావళి సందర్భంగా సీఎం ఉద్యోగ సంఘాల నాయకులందరి సమక్షంలో పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బిల్లు రూ.210 కోట్ల రూపాయలను సగం సగం చేసి రెండు విడతలుగా నవంబర్, డిసెంబర్ నెలలలో చెల్లిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు సగం చెల్లించలేదని దుయ్యబట్టారు. ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉంటే అందులో రూ.210 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి అవి కూడా చెల్లించకపోవడం దారుణమన్నారు.
ఉద్యోగులంటే ఇంత నిర్లక్ష్యమా?
పోలీసులకు రికార్డు స్థాయిలో 6 సరెండర్ లీవ్‌ల బిల్లులు పెండింగ్ పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. రిటైరయిన వారికి 18 నెలలుగా గ్రాట్యుటీ చెల్లించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలవుతున్నా ఇంతవరకు ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. సీపీఎస్, జీపీఎస్‌ను సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే హడావుడిగా గత ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిందని, 20 నెలలు అవుతున్నా ఇంతవరకు సీపీఎస్ గురించి మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు.
ఇక ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీకి తిలోదకాలు వదిలిందని, గతంలో 4 – 5 తేదీల్లో జీతం వచ్చేదని, ఇపుడు కొన్ని నెలల్లో ఉద్యోగులకు 10, 11 తేదీలొచ్చినా జీతాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఉద్యోగులను ఈ సర్కారు తీవ్రంగా వేధిస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచే స్థాయికి కూటమి సర్కారు దిగజార్చిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని, ఈ సంక్రాంతికైనా పీఆర్సీ వేయడంతోపాటు ఐఆర్ ఇవ్వాలని వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.


