గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులాల టీచర్లకు అందని వేతనాలు
రెగ్యులర్ వారికి రెండు నెలలు, ఔట్‌సోర్సింగ్ వారికి ఒక నెల వేతనం ఇవ్వలేదు
ఏకలవ్య స్కూల్స్‌లో జీతం తగ్గించినా మూడు నెలలుగా పెండింగ్.. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో రెండు నెలల వేతనాలు కట్
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పెల్లుబుకుతున్న ఆగ్రహం
సాక్షి, అమరావతి: అసలే భద్రతలేని ఉద్యోగాలు.. ఆపై ఇచ్చే అరకొర జీతాలు నెలల తరబడి చెల్లించరు.. ఇలా అయితే ఎలా.. పండుగనాడు పస్తులేనా.. అంటూ గిరిజన, ఏకలవ్య, సాంఘిక సంక్షేమ గురుకులాల టీచర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతి వచ్చినా తమకు వేతనాలు అందకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి బిడ్డలకు, అట్టడుగు వర్గాల పిల్లలకు అక్షరాలు దిద్దించే తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులపాలవుతున్నామని బాధపడుతున్నారు.
రాష్ట్రంలోని 199 గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేసే సుమారు 1,600 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులకు రెండు నెలల (నవంబర్, డిసెంబర్) జీతాలు ఇవ్వలేదు. వారిలో గతం నుంచి పనిచేçస్తున్న వారితోపాటు డీఎస్సీ–2025 ద్వారా భర్తీ అయిన రెగ్యులర్ టీచర్లు కూడా ఉన్నారు. వారితోపాటు అవే గురుకులాల్లో పనిచేస్తున్న 1,659 మంది ఔట్‌సోర్సింగ్ టీచర్లకు డిసెంబర్ నెల వేతనం ఇవ్వలేదు. రెగ్యులర్ టీచర్లతో పోస్టులు భర్తీ కావడంతో అవుట్సోర్సింగ్ వారిని సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేయడంతోపాటు ఆరునెలలుగా సకాలంలో వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
ఏకలవ్య గెస్ట్ టీచర్లను దగా చేశారు
రాష్ట్రంలో 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో (గురుకులాల్లో) పనిచేస్తున్న 200 మంది గెస్ట్ టీచర్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది. వారికి ఇచ్చే జీతానికి సైతం ఈ ఏడాది జూన్ నుంచి దారుణంగా కోతపెట్టింది. ఆ తగ్గించిన జీతాన్ని కూడా సకాలంలో ఇవ్వడం లేదు. ఏకలవ్య గురుకులాల్లో పనిచేసే టీచర్లలో నెలకు రూ.45 వేలు ఉన్న జీతాన్ని రూ.35 వేలకు, రూ.42 వేలు ఉన్న జీతాన్ని రూ.33 వేలకు తగ్గించారు. తగ్గించిన జీతాలను కూడా రెండు నెలలుగా ఇవ్వలేదు.
అంబేడ్కర్ గురుకులాల్లోనూ వేతన వెతలే..
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ రెనిడెన్షియల్ స్కూల్స్‌లో (గురుకులాల్లో) పనిచేసే సుమారు 2,300 మందికీ వేతన వెతలు తప్పలేదు. మూడునెలలుగా జీతాలు రాక వీరు పడుతున్న అవస్థలను గతేడాది నవంబర్‌లో సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో అప్పటికప్పుడు రెండునెలల వేతనాలిచ్చిన ప్రభుత్వం తరువాత పట్టించుకోలేదు. వీరికి గత నవంబర్, డిసెంబర్ నెలల జీతాలు ఇంకా ఇవ్వలేదు. ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న సుమారు 800 కాంట్రాక్ట్ టీచర్లు (సీఆర్‌టీలు), 1,700 మంది పార్ట్‌టైమ్, అడ్‌హాక్, ఔట్‌సోర్సింగ్ టీచర్లకు రెండునెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గురుకులాల్లో పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ పేరుకు పార్ట్‌టైమ్ అని చిన్న జీతాలు పొందుతున్న టీచర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శనీయంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు సక్రమంగా జీతాలు వచ్చేవని, ఇప్పుడు నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారని ఆయా టీచర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు విడుదల చేయాలని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.


