అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను రిట్ పిటిషన్ కింద విచారించలేం
సాక్ష్యాధారాల పరిశీలన అవసరం.. అందుకు సివిల్ సూట్ దాఖలే పరిష్కారం
ఏపీతో గోదావరి జలాల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ప్రస్తుత పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామన్న సీజేఐ ధర్మాసనం
సున్నిత అంశమైనందున ‘డిస్మిస్’ పదం వాడొద్దని కోరిన రాష్ట్రం
పిటిషన్ ఉపసంహరించుకుంటామని వినతి.. అనుమతిచ్చిన కోర్టు
ఏపీ ప్రాజెక్టులపై అంతకుముందు విచారణ సందర్భంగా తెలంగాణ
అభ్యంతరం.. బచావత్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ తీరు ఉందని ఆక్షేపణ
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరిపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం–నల్లమలసాగర్ సహా ఇతర ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను ఆర్టీకల్ 32 (రిట్ పిటిషన్) కింద విచారించలేమని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటే అన్ని సాక్ష్యాధారాలతో కూడిన ‘సివిల్ సూట్’దాఖలు చేసుకోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కొత్తగా దావా వేసుకోవడానికి స్వేచ్ఛనిస్తూ ప్రస్తుత పిటిషన్‌పై విచారణను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముగించింది. దీంతో తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
ఏపీ వాటా 484 టీఎంసీలే.. అంతకు మించి వాడకూడదు: సింఘ్వీ
అంతకుముందు సాగిన విచారణలో ఆద్యంతం తెలంగాణ తరఫు న్యాయవాది సింఘ్వీ ఏపీ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో ఏపీకి కేటాయించింది 484 టీఎంసీలే. అది వరద నీరైనా సరే అంతకుమించి వాడుకునే హక్కు ఆ రాష్ట్రానికి లేదు. కానీ ఏపీ ప్రభుత్వం 484 టీఎంసీలకు మించి నీటిని మళ్లించుకోవడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు నిర్మిస్తోంది. బచావత్ అవార్డు 1979–80 ప్రకారం వరద జలాల పేరుతోనైనా సరే దీనికి మించి ఒక్క చుక్క నీటిని మళ్లించినా అది చట్టవిరుద్ధమే. ఇది ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు, గోదావరి బోర్డు మార్గదర్శకాలకు విరుద్ధం’అని సింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు.
వాస్తవాలు తేలాల్సిందే: సీజేఐ
సింఘ్వీ వాదనలను విన్న ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అంతర్రాష్ట్ర జల వివాదాల్లో ఆర్టీకల్ 32 కింద నేరుగా రిట్ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘ఇది కేవలం చట్టపరమైన అంశం కాదు. క్షేత్రస్థాయి వాస్తవాలతో ముడిపడి ఉంది. ఎవరు ఎంత నీటిని వాడుతున్నారు? ప్రాజెక్టుల సామర్థ్యం ఎంత? అన్నది తేలాలి. సాక్షులను విచారించాలి. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక ప్రమేయం కూడా ఉంటుంది కాబట్టి రిట్ పిటిషన్ ద్వారా ఇది సాధ్యం కాదు. మీరు సివిల్ సూట్ దాఖలు చేయడమే సరైన మార్గం’అని ధర్మాసనం సూచించింది. అందుకు వీలుగా ప్రస్తుత పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని పేర్కొంది. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ ‘ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అత్యంత సున్నితమైన రాజకీయ, జల వివాదం.
డిస్మిస్ అనే పదం వాడితే మా వాదనలో పస లేకనే కోర్టు కొట్టేసిందన్నట్లుగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. దయచేసి ఆ పదాన్ని వాడొద్దు. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటాం.. ‘డిస్పోజ్’చేసినట్లు ఉత్తర్వులివ్వండి’అని కోరారు. తెలంగాణ విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం.. పిటిషన్‌ను డిస్మిస్ చేయకుండా ఉపసంహరణకు అనుమతిస్తూ ‘డిస్పోజ్’చేసింది. చట్టప్రకారం తగిన పరిష్కారం కోసం, లేవనెత్తిన అన్ని అభ్యంతరాలతో ‘సివిల్ సూట్’వేసుకునేందుకు తెలంగాణకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను సివిల్ సూట్‌లోనూ ప్రస్తావించవచ్చని స్పష్టం చేసింది.


