నువ్వా నేనా.. అనంత అసెంబ్లీ టికెట్‌ దక్కేదెవరికో..?.. జేసీ ఎత్తులకు ప్రభాకర్‌ చెక్‌ పెడ్తాడా?

Clash Between JC Diwakar Reddy Vs Prabhakar Chowdary Groups Anantapur - Sakshi

టీడీపీలో ఇద్దరు సీనియర్‌ల మధ్య ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీయబోతోంది?. పట్టు నిలుపుకునేందుకు ఒకరు.. వేరే చోట పట్టు పెంచుకునేందుకు మరొకరు నానా తంటాలు పడుతున్నారు. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. ఒకరిమీద ఒకరు బాదుడే బాదుడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటంటూ నలుగురు జేసీ వర్గీయులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ అనంతపురం అసెంబ్లీ పార్టీ ఇంచార్జ్‌ ప్రభాకర్‌ చౌదరి పార్టీ నాయకత్వానికి సిఫారసు చేశారు. దీంతో నువ్వు మమ్మల్ని సస్పెండ్‌ చేసేదేంటంటూ జేసీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. పైగా వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్‌ చౌదరికి అర్బన్‌ టికెట్‌ ఇవ్వొద్దంటూ తీర్మానం కూడా చేశారు. ఈ విధంగా తెలుగు తమ్ముళ్లలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. 

2014లో అనంతపురం టౌన్‌ నుంచి గెలిచిన ప్రభాకర్‌ చౌదరి అంతకు ముందు ఒకసారి మున్సిపల్‌ చైర్మన్‌గా కూడా పనిచేశారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి అర్బన్‌ నియోజకవర్గంపై కన్నుపడింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న జేసీ ఫ్యామిలీ 2014 ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చింది. 2014 నుంచి 2019 దాకా అనంతపురం పార్లమెంట్‌ సభ్యుడిగా జేసీ దివాకర్‌ రెడ్డి పనిచేశారు. 2019లో పోటీ నుంచి తాను తప్పుకుని కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని పోటీ చేయించి, ఘోర పరాభవాన్ని చవిచూశారు. కొడుకు రాజకీయ భవిష్యుత్తపై బెంగపెట్టుకున్న జేసీ ఇప్పుడు మరో ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్‌ నుంచి తన కొడుకు పవన్‌ను పోటీ చేయించే ఆలోచనలో జేసీ ఉన్నట్లు సమాచారం. అందుకే అనంతపురం పార్లమెంట్‌ ఇంచార్జి బాధ్యతలు చూస్తున్న పవన్‌రెడ్డికి అనంతపురం అసెంబ్లీ బాధ్యతలు వచ్చేలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

చదవండి: (లోకేష్‌ పోటీ చేసేది అక్కడినుంచేనా.. ఆ నియోజకవర్గ సర్వేల్లో తేలిందేంటి?)

ఈ నేపథ్యంలోనే జేసీ వర్గం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దూకుడు పెంచింది. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ప్రభాకర్‌ చౌదరికి తెలియకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాజానగర్‌లో జేసీ వర్గం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక ఇంచార్జి ప్రభాకర్‌ చౌదరి అనుమతి లేకుండానే మీరెలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ చౌదరి వర్గీయులు జేసీ వర్గం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో జేసీ, ప్రభాకర్‌ చౌదరి వర్గీయుల మధ్య పరస్పరం వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎవరికి అనుకూలంగా వారు నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. 

వాస్తవానికి 2014లో జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరినప్పటి నుంచే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరితో విభేదాలు మొదలయ్యాయి. అనంతపురం నియోజకవర్గంలో పట్టుకోసం జేసీ అప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జేసీ దివాకర్‌ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభాకర్‌ చౌదరి అడ్డుకుంటూ వచ్చారు. ఎన్నికలయిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న వీరి గొడవలు ఇప్పుడు మళ్లీ మొదలైనట్లే కనిపిస్తున్నాయి.

అనంత అసెంబ్లీ టికెట్‌ ముచ్చటగా మూడోసారి తనకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పట్టుబడుతుండగా, ఈసారి ఎలాగైనా తన కొడుక్కు ఇప్పించుకోవాలని జేసీ దివాకర్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఎవరికివారు నారా లోకేష్‌, చంద్రబాబు వద్ద లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. జేసీ, ప్రభాకర్‌ చౌదరి గ్రూపు రాజకీయాలతో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌ రెండుగా చీలిపోయింది. అసలే పరిస్థితులు బాగాలేవు. మళ్లీ పార్టీలో రెండు గ్రూపుల మధ్య కొట్లాట ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని టీడీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top