ఇంగితంలేని మాటలు.. అయ్యన్నా.. ఇక ఆపన్నా! టీడీపీ నేతల హితవు

Chintakayala Ayyanna Patrudu Controversial Comments Loss For TDP - Sakshi

తాగి వాగే అయ్యన్న మాటలు సొంత పార్టీ నేతలకు కూడా రుచించడం లేదా..? అయ్యన్న రోజూ చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారా..? అయ్యన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోందా? ఇంతకీ టీడీపీలో అయ్యన్న పాత్ర ఎలా ఉంది?. కొంతకాలం నుంచి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోరు ఉంది కదా అని ఏది బడితే అది వాగడం వల్ల పార్టీకి నష్టం జరుతుందని ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యమంత్రిని, మహిళలను, ఉద్యోగులను, పోలీసులను పట్టుకొని ఏది బడితే అది మాట్లాడటం వల్ల పార్టీకి డామేజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నేత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటంపై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా అయ్యన్న తీరును కొందరు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం, పార్టీ ఎజెండాను పక్కనపెట్టి సొంత ఎజెండాతో వ్యవహరించే నాయకులు పార్టీకి మేలు చేస్తున్నారో కీడు చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని టీడీపీ నేత బండారు అప్పలనాయుడు ట్విట్టర్ వేదికగా అయ్యన్నను ప్రశ్నించారు.

అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు సహనం కోల్పోయి మాట్లాడడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. సీఎంను విమర్శించడం ద్వారా అయ్యన్న తన ఉనికిని చాటుకోవాలని ఇష్టానుసారంగా మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. సీఎంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే తన కుమారుడికి పార్టీ అధినేత అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారనే ఆశతోనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనే  అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల పోలీసులపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. షూట్ ఎట్ సైట్ ద్వారా పోలీసులను కాల్చి పారేస్తానంటు బహిరంగ వేదిక పైనుంచి మాట్లాడారు. హోం మంత్రి పదవితో పాటు లా అండ్ ఆర్డర్ పదవి కట్టబెడితే పోలీసుల సంగతి తేలుస్తానంటూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించారు. అయ్యన్న వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది.

అయ్యన్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించింది. అయ్యన్న వ్యాఖ్యలపై న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది. ఉద్యోగుల మనోభావాలు కించిపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని సూచించింది. గతంలో కూడా ఒక మహిళా అధికారిని పట్టుకొని బట్టలూడదీసి కొడతానంటూ దుర్భాషలాడి విమర్శల పాలయ్యారు.. 
చదవండి: ఆ సందర్భాల్లో చంద్రబాబు ఇంగ్లీష్‌ స్పీచ్‌ విసుగు తెప్పించేదా?

గ్రాఫిక్స్ చరిత్రలు సైకిల్‌ పార్టీవే
నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణమంతా గ్రాఫిక్స్ అంటూ అయ్యన్న చేసిన విమర్శలపై అనకాపల్లి జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గ్రాఫిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబునాయుడని స్థానిక ప్రజలు అయ్యన్నకు గుర్తు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడుతో సహా టిడిపి నేతలు వస్తే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో దగ్గరుండి చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అయ్యన్న నోటికి తాళం వేయకపోతే రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి మరింతగా దిగజారడం ఖాయమంటునన్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top