మత విద్వేషాలే లక్ష్యంగా బాబు ఎల్లో వైరస్‌

Chandrababu yellow virus targeting religious hatred in AP - Sakshi

అంతర్వేది ఘటన తర్వాత చంద్రబాబు ఫోకస్‌ మొత్తం మతంపైనే

కావాలని సృష్టించే ఘటనలపై... తానే ట్వీట్లు చేస్తూ హడావిడి

తరవాత బాబు అనయాయుల సందర్శన.. ఆపై జూమ్‌ మీటింగ్‌

విచారణకు డిమాండ్లు చేస్తూ విద్వేషపూరిత విమర్శలు

తిరుమల డిక్లరేషన్‌ సహా దాదాపు ప్రతి అంశంలోనూ ఇంతే...

రాజుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న పట్టువస్త్రాల సమర్పణ

గతంలో ఐదేళ్లు సీఎంగా పట్టువస్త్రాలు సమర్పించిన వైఎస్సార్‌

సీఎంగా గత ఏడాది పట్టువస్త్రాలు సమర్పించిన జగన్‌మోహన్‌రెడ్డి

అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడు లేవనెత్తడంపై అనుమానాలు

ఆలయాల వద్ద వరుస ఘటనలు, డిక్లరేషన్‌ వెనుక టీడీపీ కుట్ర!!

పార్టీని బ్రతికించుకునేందుకు మత రాజకీయాలకు తెరతీస్తున్న బాబు  

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడికి తన స్క్రీన్‌ప్లేపై గొప్ప నమ్మకం. కానీ తానలా సమర్పించుకున్న సినిమాలన్నీ ఎల్లో స్క్రీన్లపై పదేపదే అరగదీయటం వల్ల జనంలోకి వెళ్లాయి తప్ప అది తన గొప్పతనం కాదని మొన్నటి ఎన్నికల్లో బాగానే తెలిసొచ్చింది. ఆ స్క్రీన్ల సీను అయిపోయిందని కూడా అర్థమయింది. తరవాత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలెన్ని చేసినా కలిసి రాకపోవటంతో ఇపుడు పెద్ద కుట్రకే తెరతీసినట్లు కనిపిస్తోంది. మత సామరస్యానికి ప్రతీకలా ఉండే రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే తప్ప తన పాచికలు పారవనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికోసం ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉండే కొందరిని అవసరార్థం తెరమీదికి తెస్తున్నట్లు కనిపిస్తోంది. జన సంచారం లేనిచోట్ల తన మనుషులతో తరచు ఏదో ఒకటి చేయించటం... దానిపై తనే ట్వీట్‌ చేయటం... దానికి ఎల్లో మీడియా చిలవలు పలవలు జోడించటం... టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగటం... ఇదే బాబు వ్యూహమని స్పష్టంగా తెలిసిపోతోంది. 

అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమయినప్పటి నుంచీ బాబు మరింత చురుగ్గా ఈ విద్వేష రాజకీయాలకు ప్రాణం పోస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ఘటనపై ప్రభుత్వం వెనువెంటనే స్పందించి.. ఈవోను సస్పెండ్‌ చేసి, కొత్త రథానికి నిధులు మంజూరు చేసి... విచారణకు ఆదేశించినా బాబు రాద్ధాంతం మాత్రం ఆగలేదు. టీడీపీతో పాటు జనసేన, బీజేపీల్లోని తమ వారిని ఉపయోగించుకుని స్థానికంగా ఉన్న చర్చిపై రాళ్లు వేయించారు. అద్దాలు పగలగొట్టారు. బాబు సేన హద్దులు మీరటంతో కుట్రను బయటపెట్టడానికి కేంద్రం పరిధిలోని సీబీఐ దర్యాప్తునకూ రాష్ట్రం సరేనంది. దీంతో బీజేపీ మిన్నకున్నా చంద్రబాబు, బీజేపీలోని ఆయన అనుచర గణాలు మాత్రం నిత్యం ఏదో ఒక కుట్రకు తెరతీస్తూనే వస్తున్నారు.

నిత్యం ఏదో ఒక మూల ఆలయాలు, చర్చిల వద్ద చిన్నపాటి ఘటనలు జరుగుతుండటం... జనసంచారం లేని ప్రాంతాల్లో దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం, మసిపూయడం వంటి ఘటనలకు వరసగా తెగబడుతున్న ముఠాల వెనక ఎవరున్నారన్నది రాజకీయంగా విశ్లేషిస్తే ఇట్టే అర్థమవుతుంది. ఘటనలు జరిగిన కాసేపటికే టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లి పరిశీలించడం, చంద్రబాబు వెంటనే దాన్ని హైదరాబాద్‌ నుంచి జూమ్‌ ఆన్‌లైన్‌ సమావేశంలోనో, ట్విట్టర్‌లోనో ఖండించడం, రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతింటోందని, హిందూ మతాన్ని రక్షించాలని కోరడం, ఎల్లో మీడియా దానిపై చర్చలు సైతం నిర్వహిస్తూ ఆజ్యం పోయటం ఇవన్నీ వారి ఉద్దేశాల్ని చెప్పకనే చెబుతున్నాయి. 

– విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయమైన ఘటనలోనూ మత రాజకీయాలు రాజేసేందుకు చంద్రబాబు, టీడీపీ నాయకులు విశ్వప్రయత్నం చేశారు. 
– కర్నూలు జిల్లా పత్తికొండలోనూ ఇదే వరస. ఇలా వరుస ఘటనలు జరగటం... ఎక్కడ ఏమైనా ముందుగా చంద్రబాబుకు అనుకూలంగా ఉండే వ్యక్తులు, టీడీపీ నేతలే ఆగమేఘాలపై వెళ్ళి హడావుడి చేయటం కుట్రల్ని తేటతెల్లం చేసేదే. వీటిపై చంద్రబాబు వెనువెంటనే స్పందించడం, విచారణ కోరడం, ప్రతిరోజూ అదే అంశంపై మాట్లాడడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నది నిపుణుల మాట.

డిక్లరేషన్‌పై ఇప్పుడెందుకు రాద్ధాంతం
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లిన సందర్భంలోనూ చంద్రబాబు ఇలాంటి విద్వేషాలకే ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. డిక్లరేషన్‌ పేరిట రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నిజానికీ సంప్రదాయం అనాదిగా రాజుల కాలం నుంచీ కొనసాగుతున్నదే. అదిప్పుడు ముఖ్యమంత్రులకూ వర్తిస్తోంది. అత్యున్నత స్థాయిలోని వ్యక్తులు ఆలయానికి వెళితే దానివల్ల మరింత మంది ముఖ్యులు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారని... రాజులు, ముఖ్యమంత్రులు ఇలా పూజలు చేయటం రాజ్యాలకు, రాష్ట్రాలకు... అక్కడి ప్రజలకు మంచిదని ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నానేది ఆధ్యాత్మిక వేత్తల మాట. “్ఙఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది కూడా ఇది చేశారు. మరి అప్పుడెప్పుడూ మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు లేవనెత్తారంటే ఆయన లక్ష్యం మత విద్వేషాలు రెచ్చగొట్టడం, రాజకీయయం చేయటమేనని తెలియటం లేదా?’’ అన్నది వారి ప్రశ్న.

జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు కూడా ప్రతిపక్ష నేతగా పలుమార్లు తిరుమల వెళ్లి శాస్త్రోక్తంగా స్వామిని దర్శించుకున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు, పాదయాత్ర ముగిశాక కూడా తిరుమల వెళ్లారు. అప్పుడెప్పుడూ లేని డిక్లరేషన్‌ అంశాన్ని ఈ బ్రహ్మోత్సవాల ముందు తెచ్చారని కూడా వారు గుర్తుచేస్తున్నారు. ఇక మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల విషయంలో కూడా ఆయన ఏ సందర్భంలో అన్నారనేది ఏమాత్రం పట్టించుకోకుండా కొంత భాగానే పట్టుకుని రాద్ధాంతం చేయటం వెనక బీజేపీ– వైసీపీ మధ్య అర్జెంటుగా చిచ్చు రేపాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేమీ కనిపించటం లేదని వారు పేర్కొంటున్నారు. దీనికి బీజేపీలోని బాబు మనుషులుగా ముద్రపడ్డవారు మాత్రమే స్పందించటం... ఆధ్యాత్మిక వేత్తల పేరిట కొందరిని అర్జెంటుగా తెరపైకి తెచ్చి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయించటం ఇవన్నీ బాబు స్కెచ్‌లో భాగమనేది జనం కూడా గ్రహిస్తున్నారనేది విశ్లేషకుల భావన. 
     
► తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని మద్యం సేవించిన కొందరు వ్యక్తులు కూలదోశారు. కళాశాలలో తమను ఉండనివ్వలేదన్న కోపంతో మద్యం మత్తులో వారు ఈ పనిచేసినట్లు తేలింది. కానీ టీడీపీ నాయకులు అక్కడికెళ్లి మతం రంగు పులిమి నానా రాద్ధాంతం చేశారు.
► రాజమండ్రి రూరల్‌ మండలం హుకుంపేటలో ఓ వ్యక్తి ఇంటి ముందున్న విఘ్నేశ్వరుడి ప్రతిమను మలినం చేశారని టీడీపీ నాయకులు అక్కడికెళ్లి గొడవ చేశారు. కానీ ఆ ఇల్లు టీడీపీ మద్దతుదారుడిదే. దీన్నిబట్టి కుట్ర ఎవరిదో తెలియకమానదు. 
► గుంటూరులో టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓ కుటుంబం తమ ఇంట్లోని హనుమాన్‌ విగ్రహాన్ని కావాలని బయటపడవేసి ఎవరో చేసినట్లు హడావుడి చేశారనేది సోషల్‌ మీడియా వేదికగా బయటపడింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top