
చంద్రబాబునాయుడు, లోకేశ్‌తో వెంకటేశ్‌నాయుడు
ఇదీ రెడ్‌బుక్ కుట్ర కపట నాటకం
తీగల విజయేందర్ రెడ్డి సహకారంతోనే రూ.11 కోట్ల జప్తు డ్రామా
ఈయన టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు
చంద్రబాబు, లోకేశ్‌లకు అత్యంత సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు
వారి డైరెక్షన్‌లోనే నోట్ల కట్టల డెన్ డ్రామా
లోకేశ్ బినామీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి
ఆయన్ను బెదిరించి అబద్ధపు వాంగ్మూలం కోసం సిట్ కుట్ర.. రెడ్‌బుక్ కుట్ర కేసులో ఆధారాల సేకరణలో సిట్ వైఫల్యం
అందుకే లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపే కుతంత్రం
సాక్షి, అమరావతి : ‘అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలే అన్నీ’ అని ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ పాపులర్ డైలాగ్ ఉంటుంది.. ‘స్వార్థం అన్నది నిజం.. నిస్వార్థం దాని కవచం’ అని కూడా చెబుతాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అక్రమ కేసు నాటకం అంతకు మించిన కుట్ర స్క్రిప్ట్‌తో సాగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు వివిధ పాత్రలు హఠాత్తుగా తెరపైకి వస్తున్నాయి. అన్నీనూ చంద్రబాబు తన అవసరాల కోసం ప్రవేశ పెడుతున్న పాత్రలే.
హఠాత్తుగా నోట్ల కట్టలు ప్రత్యక్షం అవుతున్నాయి.. ఆడియోలు, వీడియోలు ఎల్లో మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కానీ న్యాయస్థానం క్రియాశీలత, అదే ఆడియో వీడియో ఆధారాలతో ఆ కుట్రలు బెడిసి కొడుతున్నాయి. ఈ రెడ్‌బుక్ కుట్ర నాటకంలో విలన్ మాత్రం కచ్చితంగా చంద్రబాబేనన్నది అంతిమంగా నిగ్గు తేలుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు వేధింపులు బెడిసి కొడుతున్నాయి.
దాదాపు ఏడాదిగా సీఐడీ, సిట్‌లు దర్యాప్తు ముసుగులో వేధింపులకు పాల్పడుతున్నా, ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. దాంతో న్యాయస్థానాలు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సిట్ చేతులెత్తేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు తన రెడ్‌బుక్ కుట్ర నాటకంలో కొత్త పాత్రధారులను పక్కా పన్నాగంతో ప్రవేశ పెడుతున్నారు.
టీడీపీ మూలాలు ఉన్న వారు, సీనియర్ టీడీపీ నేతల కుటుంబ సభ్యులు, తమ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా లబ్ధి పొందిన వారిని ఏరికోరి తెరపైకి తెస్తున్నారు. వారందరినీ వైఎస్సార్‌సీపీ నేతలకు సన్నిహితులుగా ముద్ర వేస్తూ.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. అందుకోసం టీడీపీ వీర విధేయ సిట్ అధికారులే స్వయంగా నోట్ల కట్టల జప్తు డ్రామాకు పాల్పడుతున్నారు.
తద్వారా పాత్రధారులు టీడీపీ వర్గీయులే.. నోట్ల కట్టలు టీడీపీ వర్గీయులవే.. సిట్ అధికారులూ టీడీపీ వీర విధేయులే.. సూత్రధారి చంద్రబాబేనని స్పష్టమవుతోంది. అయితే ఇంత చేసినా, టీడీపీ కూటమి ప్రభుత్వ తాజా కుట్రలు కూడా బెడిసికొట్టాయి. సిట్ తాజాగా తెరపైకి తెచ్చిన వారందరూ చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలకు అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా బట్టబయలైన వైనం ఇలా ఉంది.
టీడీపీ కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా దగ్గరివారే.. టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ, ఏలూరు ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌తో వెంకటేశ్ నాయుడు (ఫైల్)
టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడే తీగల విజయేందర్‌రెడ్డి
⇒ మద్యం విధానంపై అక్రమ కేసులో ఏడాదిగా ఎలాంటి ఆధారాలు సేకరించని సీఐడీ, సిట్.. వారం రోజుల క్రితం ఒక్కసారిగా హడావుడి చేశాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్లు జప్తు చేసినట్టు కనికట్టు చేసింది. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఆ ఫామ్‌హౌస్‌లో 2024 జూన్‌లో ఆ నగదును దాచిపెట్టినట్టు చెప్పుకొచ్చింది. సిట్ అధికారులే ఆ రూ.11 కోట్లు తెప్పించి ఈ జప్తు కట్టుకథ వినిపించారు.
⇒ ఈ హైడ్రామాకు సిట్‌కు పూర్తిగా సహకరించింది వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజి యజమాని తీగల విజయేందర్ రెడ్డి. తమ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను అట్ట పెట్టెల్లో అదే కాలేజీకి ఎదురుగా ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో పెట్టించారు. అనంతరం ఆ నగదునే సిట్ జప్తు చేసినట్టు కథ నడిపించారు. ఇంతగా విజయేందర్ రెడ్డి ఈ కుట్రలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు సహకరించారని సందేహం రావచ్చు. ఎందుకంటే ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ తరఫున హైదరాబాద్ మేయర్‌గా, ఎమ్మెల్యేగా చేసిన తీగల కృష్ణా రెడ్డి సోదరుని కుమారుడు.
⇒ తీగల విజయేందర్ రెడ్డికి చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలతో, టీడీపీ అనుకూల మీడియా అధిపతులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ రెడ్‌బుక్ కుట్ర కేసు వీగిపోతోందన్న ప్రమాద ఘంటికలు మోగగానే చంద్రబాబు పక్కా పన్నాగంతో విజయేందర్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. ఆయన సహకారంతోనే రూ.11 కోట్ల నగదు జప్తు డ్రామాకు సిట్ పాల్పడింది.
⇒ కాగా, ఆ నగదును ఆర్‌బీఐతో తనిఖీ చేయించాలని రాజ్ కేసిరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటే ఆర్‌బీఐ అధికారులు వచ్చి తనిఖీ చేస్తే.. ఆ నోట్ల కట్టల మీద ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఏమిటన్నది వెల్లడవుతుంది. ఆ నోట్లను ఆర్‌బీఐ ఎప్పుడు ముద్రించింది.. వాటిని ఎవరు, ఎప్పుడు డ్రా చేశారు.. ఏ బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేశారన్న వివరాలు వెలుగులోకి వస్తాయి.
⇒ 2024 జూన్ తర్వాత ఆ నోట్ల కట్టలు అన్నీ గానీ, వాటిలో కొన్నిగానీ ముద్రించినట్టు వెల్లడైతే.. సిట్ చెప్పింది అంతా కట్టుకథేనని తేలి పోతుంది. ఆ నోట్లను 2024 జూన్ తర్వాత ఏదైనా బ్యాంకు నుంచి డ్రా చేశారని నిగ్గు తేలితే.. ఆ బ్యాంకు ఖాతాదారుడు ఎవరన్నది వెలుగులోకి వస్తుంది. దాంతో ఈ జప్తు కట్టుకథ వెనుక ఉన్న టీడీపీ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది.
⇒ అందుకే ఆ నోట్ల కట్టలను న్యాయస్థానం అనుమతి లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో డిపాజిట్ చేసేయాలని సిట్ అధికారులు యత్నించారు. కాగా రాజ్ కేసిరెడ్డి పిటిషన్‌పై సత్వరం న్యాయస్థానం స్పందించడంతో సిట్ కుట్ర విఫలమైంది. ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని.. బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని.. మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో రూ.11 కోట్ల జప్తు హైడ్రామాతో కనికట్టు చేయాలన్న చంద్రబాబు కుట్ర పూర్తిగా బెడిసి కొట్టింది.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకటేశ్ నాయుడు (ఫైల్)
లోకేశ్ బినామీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి
⇒ లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే ఈ భేతాళ కుట్ర కథకు చంద్రబాబు పక్కాగా స్క్రిప్ట్ రచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా కేవలం రెండేళ్లపాటు చేసిన రాజ్ కేసిరెడ్డికి ముడి పెడుతూ ఈ అక్రమ కేసు నమోదు చేశారు. తాము చెప్పమన్నట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. విచారణలో రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు కూడా చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించారు. కానీ ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి తిరస్కరించారు. ఆ విషయాన్ని సిట్ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికే వెల్లడించింది.
⇒ అసలు రాజ్ కేసిరెడ్డిని ఈ కపట నాటకంలో ప్రధాన పాత్రధారిగా చేసుకోవాలని చంద్రబాబు ఎందుకు భావించారంటే.. రాజ్ కేసిరెడ్డి.. మంత్రి నారా లోకేశ్ బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి కనుక. కేశినేని చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే.
⇒ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని ప్రస్తుతం సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామా(జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి.
⇒ ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ ( accounts@wshanviinfraprojects. com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. లోకేశ్ తన బినామీ అయినందునే కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు.
⇒ కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. కేశినేని చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్‌కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది.
పారని బాబు తాజా పాచిక
⇒ అయినా సరే పట్టు వదలని చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా మరో కట్టుకథను వ్యాప్తిలోకి తెచ్చారు. వెంకటేశ్ నాయుడు చార్టెడ్ విమానాల్లో ప్రయాణిస్తున్న ఫొటోలు, వీడియోలు, హీరోయిన్ తమన్నా పక్క సీట్లోనే కూర్చున్న ఫొటోలు ఎల్లో మీడియాకు విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడిన డబ్బుతోనే వెంకటేశ్ నాయుడు ఇంతటి జల్సాలు చేశారని.. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారని రకరకాల కట్టు కథలను టీడీపీ సోషల్ మీడియాతోపాటు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా వినిపించింది.
⇒ కానీ ఈ కుట్ర పాచిక కూడా విఫలమైంది. ఎందుకంటే వెంకటేశ్ నాయుడు చంద్రబాబు, లోకేశ్‌లకు అత్యంత సన్నిహితుడన్నది ఫొటో ఆధారాలతోసహా బట్టబయలైంది. వారిద్దరికి ఆయన అత్యంత సన్నిహితుడనే నిజాన్ని ఆ ఫొటోలు బయటపెట్టాయి. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ తరఫున కేంద్ర మంత్రులుగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతోపాటు పలువురితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో మొత్తం కుట్ర డ్రామా బట్టబయలైంది.
⇒ వెంకటేశ్ నాయుడు ప్రయాణించిన చార్టెడ్ ఫ్లైట్ ఎవరిదో తెలుసా.. చంద్రబాబు బీజేపీలోకి పంపిన నేత, ప్రస్తుత ఎంపీ సీఎం రమేశ్ కంపెనీది. టీడీపీ నేతలతో కలిసే వెంకటేశ్‌నాయుడు ఆ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి చెన్నై, కోయంబత్తూరు తదితర నగరాలకు వెళ్లారు. హీరోయిన్ తమన్నా కూడా అదే ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. కానీ టీడీపీ నేతలతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు కాకుండా తమన్నా పక్క సీట్లో కూర్చున్న ఫొటోనే సిట్ విడుదల చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కానీ పూర్తి ఫొటోలు బయట పడటంతో సిట్ కుట్ర బెడిసి కొట్టింది.
చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితుడే వెంకటేశ్ నాయుడు
⇒ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్ల జప్తు హైడ్రామా విఫలమవడంతో చంద్రబాబు మరో దుష్ప్రచార కుతంత్రం రచించారు. ఈ కుట్ర కేసులో మరో పాత్రధారిగా వెంకటేశ్ నాయుడు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన హైదరాబాద్‌లో రూ.5 కోట్ల నగదును పరిశీలిస్తున్న వీడియోలను టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేశారు. ఆ రూ.5 కోట్లు నగదు అంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం డబ్బులేనని... 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకే హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధం చేసినవని ప్రజల్ని నమ్మించేందుకు యత్నించారు.
⇒ కాగా, ఆ రూ.5 కోట్లలో 2023 మే లోనే ఆర్‌బీఐ ఉపసంహరించిన రూ.2 వేల నోట్ల కట్టలు ఉండటాన్ని పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ఆ వీడియో 2023 మే కంటే ముందు తీసిందేనని స్పష్టమైంది. తద్వారా 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకు వైఎస్సార్‌సీపీ ఆ నోట్లను తరలించడం అంతా కనికట్టేనని తేటతెల్లమైంది. మరోవైపు వెంకటేశ్ నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాపార వ్యవహారాలకు చెందిన నగదును వైఎస్సార్‌సీపీకి ఆపాదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడిందన్నది బట్టబయలైంది.