
కంప్యూటర్ కనిపెట్టింది ఎవరు?.. సెల్‌ఫోన్ కనిపెట్టింది ఎవరు?.. చార్లెస్ బబ్బేజ్, డాక్టర్ మార్టిన్ కూపర్‌లు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలను అడిగితే టక్కున చెప్పే పేరు.. నారా చంద్రబాబు నాయుడు. హా.. షాకయ్యారా!. సెటైరిక్‌గాలే లేండి. ప్రపంచంలో ఏమూల.. ఏం జరిగినా.. ఎవరు ఏం కనిపెట్టినా.. టెకనలాజియాకు ముడిపెట్టి ఆ క్రెడిట్ అంతా కొట్టేయాలని ఉవ్విళ్లూరుతుంటారు చంద్రబాబు. ఈసారి అలా క్రెడిట్‌ను తన కుమారుడు నారా లోకేష్‌కు కట్టబెట్టారు.
తల్లికి వందనంపై పథకంపై సెల్ఫ్ డబ్బా కొట్టుకునే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం అనే పథకం ఆలోచన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైండ్‌లోంచి పుట్టిందని, ఆ క్రెడిట్ అంతా లోకేష్ బాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారాయన. పుట్టపర్తి నియోజకవర్గంలో కొత్త చెరువు స్కూల్‌లో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు.. అక్కుడున్న విద్యార్థులనే కాదు, నెట్టింట విస్తుపోయేలా చేస్తున్నాయి.
దేశంలో.. పేద కుటుంబాలకు విద్యా సహయార్థం పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. నవరత్నాల్లో భాగంగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారాయన. అయితే.. ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చేసుకుంది.
పోనీ.. పథకం అయినా సక్రమంగా అమలు అవుతుందా? అంటే.. అదీ లేదు. అర్హతల పేరుతో మెలికలు పెట్టి చాలామందిని తొలగించింది. పైగా ఒక అకడమిక్ ఇయర్ సొమ్మును కాగితం మీద లెక్క పెట్టి.. తల్లుల అకౌంట్లలో జమ చేయకుండా ఎగ్గొట్టింది కూడా!. అలాంటిది జగన్ ప్రవేశపెట్టిన పథకాన్ని హైజాక్ చేసి.. తన తనయుడి ఆలోచనగా చంద్రబాబు ప్రమోట్ చేసుకోవడాన్ని కొందరు నెటిజన్లు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.