మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ ఆవేదన | Chairman of Council and Speaker of Assembly expressed concern over protocol | Sakshi
Sakshi News home page

మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్‌పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ ఆవేదన

Jul 12 2024 5:33 AM | Updated on Jul 12 2024 5:33 AM

గురువారం ఉన్నతాధికారులతో సమావేశమైన మండలి చైర్మన్‌ గుత్తా, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

గురువారం ఉన్నతాధికారులతో సమావేశమైన మండలి చైర్మన్‌ గుత్తా, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై అధికారులతో భేటీలో వ్యాఖ్యలు 

జిల్లాల్లో ప్రొటోకాల్‌ పాటించట్లేదు

అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానాలూ లేవు 

ఎయిర్‌పోర్టులో వీఐపీ లాంజ్‌లోకి రానివ్వడం లేదని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్‌ పాటించడం లేదని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్‌ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్‌ గుత్తా, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్‌ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. 

అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్‌ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్‌ చెప్పారు. 

చైర్మన్, స్పీకర్‌ అభ్యంతరాలు ఇవే.. 
తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్‌ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్‌ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. 

సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. 

పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్‌ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 

25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్‌? 
రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్‌ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్‌ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్‌ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్‌ సెక్రటేరియట్‌లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్‌ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్, లెజిస్లేచర్‌ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్‌ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు .   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement