అవన్నీ అసత్యాలే.. తేల్చి చెప్పేసిన మాయావతి | Sakshi
Sakshi News home page

అవన్నీ అసత్యాలే.. తేల్చి చెప్పేసిన మాయావతి

Published Sat, Mar 9 2024 3:39 PM

BSP fighting Lok Sabha elections 2024 on its own says Mayawati - Sakshi

BSP Mayawati : రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుంది. ఈ మేరకు ఆ పార్టీ  అధినేత్రి మాయావతి తేల్చి చెప్పేశారు. తమ పార్టీ పొత్తుతో వెళ్తుందని వస్తున్న వదంతులన్నీ అబద్ధమని స్పష్టం చేశారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌)లో ఈ మేరకు మాయావతి పోస్ట్‌ చేశారు. ‘రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో బీఎస్పీ తన సొంత బలంతో పోటీ చేస్తుంది. ఇందుకోసం పార్టీ పూర్తి సన్నద్ధత, బలంతో ఉంది. ఇటువంటి పరిస్థితిలో పొత్తులు, మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వస్తున్నవి తప్పుడు వార్తలు. ఇలాంటి వార్తలతో మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా గమనించాలి’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రణాళికల గురించి మాయావతి పేర్కొంటూ.. “ముఖ్యంగా యూపీలో బీఎస్పీ ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేస్తుండటంతో ఇతర పక్షాలు అసహనానికి గురవుతున్నాయి. అందుకే రోజూ రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే బీఎ‍స్పీ నిర్ణయం దృఢమైనది" అన్నారు.

 
Advertisement
 
Advertisement