రేవంత్‌ను ప్రజలపై రుద్దింది కాంగ్రెస్సే: కేటీఆర్‌ | BRS Leader KTR Fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ను ప్రజలపై రుద్దింది కాంగ్రెస్సే: కేటీఆర్‌

Jun 4 2026 12:45 AM | Updated on Jun 4 2026 12:45 AM

BRS Leader KTR Fires On CM Revanth Reddy

‘మీట్‌ ది ప్రెస్‌’లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ఫాలింగ్‌ జరుగుతోంది 

మోదీ– రేవంత్‌ భాగస్వామ్య ప్రభుత్వం

రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తోంది

మొదటి అర్ధభాగం అట్టర్‌ ఫ్లాప్‌.. మిగతా అర్ధభాగం మరింత అధ్వానం 

ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌కు 90కిపైగా అసెంబ్లీ స్థానాలు.. కొడంగల్‌లో రేవంత్‌ ఓడిపోతారు

2027లో పాదయాత్ర చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ వెల్లడి 

దేశభక్తి గురించి పవన్‌కల్యాణ్‌ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు 

ఆయన సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం.. పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం

ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టుపై హరీశ్‌రావు చేసిన విమర్శల్లో తప్పేమీ లేదు. రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఫ్యూచర్‌ సిటీపై తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాం. రేవంత్‌ సీఎం కాగానే తెలంగాణ తల్లి రూపం మార్చి, సెక్రటేరియట్‌ ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టాడు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ విగ్రహాలను గాందీభవన్‌కు పంపుతాం.  

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ రాష్ట్రానికి దశాబ్దాల తరబడి మొదటి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ కథలో నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన, తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ప్రజలపై రుద్దింది. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ ముప్పు వచ్చింది. రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని తిరిగి తిరోగమనంలోకి నెడుతోంది. మోదీ– రేవంత్‌ భాగస్వామ్య ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. మోదీ తానా అంటే కాంగ్రెస్‌ తందానా అంటోంది. పైన మోదీ ప్రభుత్వం ఇక్కడ జోడీ ప్రభుత్వం సాగుతోంది. మొదటి అర్ధభాగం ఇప్పటికే అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. రేవంత్‌ పాలనలో ట్రైలర్‌ కాదు, ఇంటర్వెల్‌ కూడా పూర్తయింది. మిగతా అర్ధభాగం మరింత అధ్వానంగా ఉంటుంది. ఆయన తెలంగాణను పాతాళంలోకి తొక్కుతున్నారు. మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి రాకుండా కాంగ్రెస్‌ పార్టీని రేవంత్‌ బొంద పెడతారు..’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా రవికాంత్‌రెడ్డి వ్యవహరించగా.. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.విజయ్‌కుమార్‌రెడ్డి, వరికుప్పల రమేష్‌ పాల్గొన్నారు. ముఖ్యాంశాలు కేటీఆర్‌ మాటల్లోనే.. 

పదేళ్లలో సాధించిన ప్రగతి క్షీణించింది.. 
తెలంగాణ రైజింగ్‌ నినాదం పేరుతో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ఫాలింగ్‌ జరుగుతోంది. పదేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో సాధించిన పురోగతి ప్రస్తుతం క్షీణించింది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు కాంగ్రెస్‌ హామీలతో మోసపోయారు. రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. ఉచిత విద్యుత్‌ రైతన్నలకు ఇవ్వకూడదు అన్నదే రేవంత్‌రెడ్డి సిద్ధాంతం. లేని అప్పులను ఉన్నదిగా చూపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ఆర్‌బీఐ తన నివేదికతో చెంపదెబ్బ కొట్టింది.  

తెలంగాణాకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్‌ 
మాకు పొలిటికల్‌ గేర్‌ ఎప్పుడు మార్చాలో తెలుసు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌కు 90కి పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఓడిపోతారు. దుమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్‌ ఉప ఎన్నికలకు రావాలి. 2027లో పాదయాత్ర చేద్దామనే ఆలోచనలో ఉన్నా.  బీజేపీతో పొత్తు ఉంటుందన్నది పూర్తిగా ఊహాజనిత ప్రచారం. బీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ ట్రంప్‌ కార్డు. ఆయన నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణకు అసలైన ‘ఓజీ’ కేసీఆర్‌. ఆయనే తెలంగాణను కాపాడుకుంటారు. 

పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? 
తెలంగాణ ఖచ్ఛితంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ భూమి పుత్రుల జాగీరు అనడంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదు. ఈ నేల.. పోరాటాలు, త్యాగాలు చేసిన వారి నెత్తురుతో తడిచింది. మీరు వచ్చి మీ కుటుంబాలతో ఉండండి. మీ భూములు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. గడిచిన దశాబ్దానికి పైగా కాలంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. ఉగ్రవాదం కంటే ప్రాంతీయ వాదం ప్రమాదం అని ఏపీ డిప్యూటీ సీఎం అంటున్నాడు. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయేందుకు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములుది కూడా ప్రాంతీయవాదమేనా? 

మోదీ ఆర్థిక ప్రాంతీయ వాదం సరైనదేనా? 
ప్రధాని మోదీ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌ మీద ఉన్న అభిమానంతో తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను తీసుకెళ్తున్నారు. జాతీయ వాదం ముసుగులో మోదీ చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదం, గుజరాత్‌కు ప్రధానమంత్రి మాదిరి వ్యహరిస్తున్న తీరు సరైనదేనా? పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలి. జనగణమన మాకు నేర్పాల్సిన అవసరం లేదు. దేశభక్తి గురించి పవన్‌ కళ్యాణ్‌ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల. మాకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్త కాదు. మాకు జాతీయ భావన, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. పవన్‌ కళ్యాణ్‌ను నటుడిగా అభిమానిస్తాం, సోదరుడిగా ఇంటికి వస్తే హైదరాబాద్‌ బిర్యానీ పెడతాం. కానీ మా సెక్రటేరియట్‌లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం.  

పవన్‌ వ్యాఖ్యల వెనుక రేవంత్‌ ఉన్నట్టు అనుమానం 
ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తెలంగాణలో 2018లో చంద్రబాబు టీడీపీ, 2023లో పవన్‌ కళ్యాణ్‌ జనసేన పోటీ చేసింది. తెలంగాణలో కొత్తగా జనసేన పోటీ చేసేదేం ఉంది? తెలంగాణ ఆషామాషీగా, అనాయాసంగా ఏర్పడిన రాష్ట్రం కాదు. ఇక్కడకి వచ్చి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుమార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం రోజు వచ్చి ఇక్కడ సభ పెట్టి విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. మరొకాయన ంతల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు. జనసేన సభకు అనుమతి నిరాకరించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారనే అనుమానం వస్తోంది. 

ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చట్టం చేయాలి 
ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డికి దమ్ముంటే.. ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వబోమని అసెంబ్లీలో చట్టం చేయాలి. ఒకవేళ అలాంటి చట్టం ఏదైనా తీసుకువచ్చేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తాం. రేవంత్‌రెడ్డి హయాంలో కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నుంచి మొదలుకొని అన్ని కాంట్రాక్టులు ఆంధ్రా వాళ్లకే దక్కుతున్నాయి. సుంకిశాల నిర్మాణం కూలిన ఘటనలో కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్టు చేయాలని జలమండలి కోరితే.. చేయలేని దమ్ములేని సీఎం రేవంత్‌. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు. సెక్షన్‌ 8ని అడ్డం పెట్టుకొని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న కుట్ర గతంలో కొంత జరిగింది. మరోసారి అలాంటి ప్రయోగాలు చేస్తే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నేతృత్వంలో మరో బలమైన ఉద్యమం వస్తుంది.   

Advertisement
 
Advertisement
Advertisement