హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అత్యుత్తమ హోదా పొందటానికి అందరికంటే ఎక్కువ అర్హత ఉన్న నాయకుడు భట్టి విక్రమార్క అని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. అంతటి అనుభవం ఉన్న భట్టి.. రేవంత్‌రెడ్డి కళ్లలో ఆనందం కోసం పనిచేయడం బాధాకరమన్నారు. సింగరేణి స్కాంలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈరోజు(ఆదివారం, జనవరం 25వ తేదీ) మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. సింగరేణి స్కాంలో లబ్ధిదారుడు రేవంత్‌రెడ్డేనన్నారు. అయితే భట్టి లబ్ధిదారుడా లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు.
‘అవినీతి ఆరోపణలు వచ్చినప్పడు గతంలో మంత్రులు రాజీనామా చేసేవారు. సింగరేణి ఓబీ వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తెచ్చిందే కాంగ్రెస్. తనకు లేఖ రాస్తే.. భట్టి ముఖ్యమంత్రితో మాట్లాడుతాననటం హాస్యాస్పదం. రేపో మాపో నాకు మరో లేఖ(సిట్ నోటీసులు) వస్తుంది.
మే 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీ వర్క్స్ కోసం సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చింది.
ఓబీ వర్క్స్ లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి. నైమీ బ్లాక్ టెండర్లు కాదు.. సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద జరిగిన అన్ని టెండర్లను రద్దు చేయాలి. 2025 మే నుంచి ఎంత మందికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ముఖ్యమంత్రిని బొగ్గు స్కాం నుంచి బయట పడేయటానికి ప్రయత్నం చేసి భట్టి విఫలమయ్యారు. భట్టి మాటల గారడితో మసిపూడి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. సింగరేణి స్కాంలో లబ్ధిదారులు ఎరరు? నష్టం ఎంత? ఎవరు బాధ్యడు.. భట్టి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.


