
గుంటూరు, సాక్షి: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ప్రకటించారు.
తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. పలువురి పేర్లు పరిశీలించి.. చర్చించిన తర్వాత బొత్స పేరును ప్రకటించారాయన. ఈ భేటీలో వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు.
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం.. ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన.. ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక జరుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
వైఎస్సార్‌సీపీదే బలం
విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్‌సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రలోభాల పర్వం మొదలుపెట్టింది. జీవీఎంసీలో 12 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. అయితే.. కార్పొరేటర్లతో మాట్లాడిన వైఎస్ జగన్, రాబోయే రోజులు వైఎస్సార్‌సీపీవేనని.. అధైర్యపడొద్దని చెప్పారు.
ఇక.. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ఆయన ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్లింది. దీంతో.. బాబ్జీకి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది.
