తెలంగాణలో కమలం... కమిటీలు

BJP President Bandi Sanjay Establishes Joining And Coordination Committee - Sakshi

చేరికలు, సమన్వయం కోసం 3 కమిటీలు వేసిన రాష్ట్ర బీజేపీ

నల్లు ఇంద్రసేనారెడ్డి సారథ్యంలో కోఆర్డినేషన్‌ కమిటీ

ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ చైర్మన్‌గా జితేందర్‌రెడ్డి

గరికపాటి మోహన్‌రావుకు ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధం కావడంలో భాగంగా పార్టీలో చేరికలు, సమన్వయం, ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ మూడు కమిటీలను నియమించారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి చైర్మన్‌గా కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో సభ్యులుగా శాసనమండలి మాజీ చైర్మన్‌ కె.స్వామిగౌడ్, మాజీ మంత్రులు డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్, డి.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు, మహిళా మోర్చా నాయకురాలు బండారి రాధిక ఉన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు తదితరులను చేర్చుకొనేటప్పుడు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేసే వారిని, ప్రజాదరణ ఉన్న వారిని గుర్తించి చేర్చుకొనే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.  

‘ముందస్తు’ఉండొచ్చనే... 
శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది చివర్లో జరగాల్సి ఉన్నా అంతకంటే ముందుగానే ఇక్కడ ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాల మధ్య 119 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న, బలమైన పార్టీ ముఖ్య నేతలు పోటీకి అవకాశమున్న స్థానాలను మినహాయించి మిగతా సీట్లలో ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. 

ఆ 31 సీట్లపై ప్రత్యేక దృష్టి... 
రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆయా స్థానాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ అంచనా వేస్తోంది. ఈ స్థానాల్లో కనీసం 20–25 సీట్లు గెలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎస్సీ నియోజకవర్గాల్లోని బలాబలాలు, సమస్యలపై ఎస్సీ ముఖ్యనేతలతో బండి సంజయ్‌ అధ్యక్షతన ఇటీవలే రాష్ట్ర స్థాయి సమీక్ష జరిగింది.

ఈ స్థానాల్లో విశ్లేషణ నిమిత్తం తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని సంజయ్‌ నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరు జైపాల్, ఎం.ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యుడు సీహేచ్‌ విఠల్, ఎస్సీ మోర్చా నాయకురాలు కాంచన కృష్ణ ఉన్నారు.

అలాగే ఎస్టీ స్థానాల్లో బలబలాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల అంశాల పరిశీలనకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు చైర్మన్‌గా ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని సంజయ్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, కూన శ్రీశైలంగౌడ్, సీనియర్‌ నేత చింతా సాంబమూర్తి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి ఉన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top