పట్టు బిగించండి.. రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం

BJP national leadership Mandate to Telangana Leaders - Sakshi

జాతీయ భేటీ, సభతో సానుకూల వాతావరణం... ముందు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాలి

అర్ధరాత్రి దాకా సాగిన అంతర్గత భేటీ

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో పార్టీ కార్యక్రమాల వేగం పెంచి, అసెంబ్లీ ఎన్నికల దాకా పార్టీ మొత్తం ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పార్టీ నాయకులను బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పార్టీపరంగా రాజకీయ కార్యకలా పాలను మరింత విస్తృతం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలు, హామీలను నిలుపుకోకపోవడం, అవినీతి, నియంత, అప్రజాస్వామిక పాలనను ఎండగట్టాలని చెప్పింది.

ఈ అంశాలన్నీ ప్రజల్లో నిరంతరం చర్చనీయాంశంగా ఉండేలా చూడాలని సూచించింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు రూపొందించుకోవాలని, లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున మొదట అసెంబ్లీ స్థానాల పరిధిలో విస్తృత కార్యాచరణ చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో సంస్థాగత బలోపేతం, పోలింగ్‌ బూత్‌ల పటిష్టం, ఇతర పార్టీల నుంచి బలమైన నేతల చేరికల ద్వారా పార్టీ బలాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకుని ఎన్నికల్లో విజయాన్ని ఖాయం చేసుకోవాలని సూచించారు.

సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఆదివారం బహిరంగసభ ముగిశాక నోవాటెల్‌లో అర్ధరాత్రి వరకు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు బండి సంజయ్, జి.కిషన్‌రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్‌ తదితరులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్‌షా, సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ తదితరులు భేటీ నిర్వహించారు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో పార్టీ విస్తరణకు, ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు జాతీయ సమావేశాలు, సభ ఫలితాలు ఉపకరించనున్నందున, ఈ సువర్ణావకాశాన్ని చేజార్చుకోకుండా జాతీయ నాయకత్వం ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు.

కష్టపడి పనిచేసి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే చిరకాల స్వప్నాన్ని నిజం చేయాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని, జాతీయ సమావేశాలు, విజయ సంకల్ప సభ విజయవంతం కావడం రాష్ట్రంలో ప్రజల మూడ్‌ను స్పష్టం చేస్తోందని జాతీయ నేతలు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల్లో పార్టీపై ఏర్పడిన సానుకూల దృక్పథాన్ని విస్తృత పరుచుకునేలా పార్టీ కేడర్, నాయకులు నిరంతరం జనంలోనే ఉంటూ కార్యక్రమాలు కొనసాగించాలని ఆదేశించారు. పార్టీ బలపడిందని, సమావేశాలు, సభ విజయవంతమయ్యాయని సంతృప్తి చెందకుండా, రాష్ట్రంలో అధికారం లక్ష్య సాధన కోసం అవిశ్రాంత పోరాటం చేయాలని చెప్పారు.

బేగంపేటలో మోదీకి వీడ్కోలు
జాతీయ సమావేశాలు, బహిరంగ సభ అనంతరం సోమవారం ఉదయం విజయవాడ వెళ్లిన ప్రధాని మోదీకి బేగంపేట విమానాశ్రమంలో రాష్ట్ర ముఖ్య నేతలు పలువురు వీడ్కోలు పలికారు. అలాగే ఢిల్లీ బయలుదేరిన జేపీ నడ్డాకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికారు. అంతకు ముందు నోవాటెల్‌లో నడ్డాతో ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. సమావేశాలు, సభ విజయవంతం కావడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను బీఎల్‌ సంతోష్‌ అభినందించారు. సంజయ్‌తో పాటు నల్లు ఇంద్రసేనారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top