
సాక్షి, చెన్నై: తమిళ నటి, బీజేపీ నేత ఖుష్బూ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మెల్వార్‌వతూర్ సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. కారును ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒకవైపు డోర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, సమయానికి ఎయిర్‌బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. మరికొంతమందితో కలిసి కడలూర్‌లో బీజేపీ నిర్వహిస్తున్న వేల్ యాత్రలో పాల్గొనేందుకు కుష్బూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వివరాలన్నీ ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. తమ దారిన తాము వెళ్తుంటే ట్యాంకర్ ఢీకొట్టిందని అన్నారు.
ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఖుష్బూ పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులు, దేవుడి దయ వల్ల తాను క్షేమంగా బయటడ్డానని ఖుష్బూ ట్వీట్ చేశారు. మురుగన్ దేవుడే తమను కాపాడాడని తెలిపిన ఖుష్బూ... తన భర్త దేవుడిపై పెట్టుకున్న నమ్మకం రక్షణగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఏదేమైనా తన ప్రయాణం ఆగదని ఆమె వేరే వాహనంలో కడలూర్‌కు పయనమయ్యారు. ఖుష్బూ కారుకు ప్రమాదం వెనుక కాంగ్రెస్, డీఎంకే పార్టీల హస్తం కూడా అవకాశం ఉందని బీజేపీ మహిళా నేత శోభనన్ గణేషన్ అనుమానం వ్యక్తం చేశారు.