‘భారత్‌ జోడో’యాత్రను చూసి బీజేపీ భయపడుతోంది.. అందుకే దాడులు

Bjp Afraid Of Rahul Gandhi Bharat Jodo Yatra Says Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో’యాత్రను చూసి బీజేపీ భయపడుతోందని.. ఆ యాత్రను విచ్ఛిన్నం చేసేందుకే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే 2015లో మోదీ ప్రభుత్వమే మూసివేసిన నేషనల్‌ హెరాల్డ్‌ కేసును తిరగదోడారన్నారు. రాహుల్‌ యాత్ర విజయవంతం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన నేతలకూ ఈడీ నోటీసులు ఇచ్చారని చెప్పారు.

రేవంత్‌రెడ్డి సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక సజావుగా నడవడానికి కాంగ్రెస్‌ నేతలు విరాళం ఇవ్వడమే నేరమా అని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లలో రూ.4,847 కోట్లు విరాళాలు వచ్చాయని ఎన్నికల సంఘానికి బీజేపీ అధికారిక సమాచారం ఇచి్చందని, మరి వారిలో ఎవరికైనా నోటీసులిచ్చారా అని నిలదీశారు. 

టీఆర్‌ఎస్‌ నేతలకు నోటీసులు ఇవ్వలేదేం? 
కేంద్ర మంత్రులు తెలంగాణలో అవినీతి జరుగుతోందని తరచూ చెప్తున్నారని.. మరి టీఆర్‌ఎస్‌ నేతలకు, కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని రేవంత్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ వద్ద రూ.865 కోట్లు ఉన్నాయని ఆ పారీ్టనే చెప్పిందని, ఆ డబ్బులన్నీ ఎలా వచ్చాయో, విరాళంగా ఎవరిచ్చారో ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు ఎందుకు విచారించడం లేదన్నారు. రేవంత్‌రెడ్డిని కూడా ఈడీ కేసులో ఇరికించి లోపల వేస్తామని కాంగ్రెస్‌లో చేరాలనుకున్న ఓ నాయకుడికి బీజేపీ నేతలు చెప్పారని, ఆ నేత ఈ విషయాన్ని తనకు చెప్పాడని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీలు తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. గత ఎనిమిదేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనపై 120 కేసులు పెట్టిందని, ఎవరెన్ని కుయుక్తులు చేసినా కాంగ్రెస్‌ కోసం తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. 

మునుగోడులో కొనుగోళ్ల పోటీ 
మునుగోడు ఉప ఎన్నికల్లో అభివృద్ధి, ఆలోచన కోసం పోటీ జరగడం లేదని, రాజకీయ నాయకుల కొనుగోళ్ల పోటీ జరుగుతోందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. అచ్చోసిన ఆంబోతులను కొన్నట్టు పార్టీ నాయకులను కొంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇటీవల నాలుగు ఉప ఎన్నికలు జరిగాయని.. అందులో దుబ్బాక, హుజూరాబాద్‌లలో బీజేపీ, సాగర్, హుజూర్‌నగర్‌లలో టీఆర్‌ఎస్‌ గెలిచాయని.. ఈ రెండు పార్టీల గెలుపుతో తెలంగాణ ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశమిస్తే తెలంగాణ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామని రేవంత్‌ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలను ప్రస్తావిస్తూ.. మల్లికార్జున ఖర్గే తెలంగాణ బిడ్డ అని, హైదరాబాద్‌ రాష్ట్రంలో పుట్టారని గుర్తు చేశారు. తెలంగాణ బిడ్డ ఏఐసీసీ అధ్యక్షుడయ్యే అవకాశం వచి్చనప్పుడు కావాలనే కోరుకుంటామన్నారు. అయితే పార్టీ అధ్యక్ష ఎన్నికలో ఎవరికి ఓటేయాలన్నది పీసీసీ ప్రతినిధుల ఇష్టమని, ఫలానా వారికి ఓటేయాలని తాము చెప్పబోమని వివరించారు. 

అప్పటి నుంచే మొదలైంది! 
టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా ఆవిర్భవించే అంశాన్ని మీడియా ప్రస్తావించగా.. మోదీ, కేసీఆర్‌ మధ్య ఈ విషయంలో 2017లోనే ఒప్పందం కుదిరిందని రేవంత్‌ పేర్కొన్నారు. 2024 ఎన్నికల ముందు పార్టీ పెట్టి యూపీఏ భాగస్వామ్య పక్షాలను విడదీసి, కాంగ్రెస్‌ను బలహీనపర్చాలనే కుట్ర ఇది అని ఆరోపించారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌కు అర ఎకరం స్థలం ఇచ్చినప్పటి నుంచే ఈ ఆట మొదలైందని.. అప్పటి నుంచే కేసీఆర్‌ యూపీఏను చీల్చి కాంగ్రెస్‌ను బలహీన పరిచే కుట్రకు తెరతీశారని చెప్పారు.  కేసీఆర్‌ పెట్టబోయే బీఆర్‌ఎస్‌ అంటే బిహార్‌ రాష్ట్ర సమితి అని ఎద్దేవా చేశారు.
చదవండి: కాంగ్రెస్‌ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top