హైదరాబాద్‌ వేదికగా మరో క్యాంపు రాజకీయం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ చేరుకున్న బిహార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Published Sun, Feb 4 2024 7:33 PM

Bihar Congress MLAs Camp Politics In Hyderabad Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం)క్యాంపు రాజకీయం ముగియటంతో జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రం జార్ఖండ్‌కు బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్‌ మరో రా‍ష్ట్ర క్యాంపు రాజకీయాలకు వేదికైంది. తాజాగా బిహార్‌ క్యాంపు రాజకీయం తెలంగాణలోని హైదరాబాద్‌కు చేరుకుంది. బిహార్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లోని ఇబ్రహింపట్నం పార్క్‌ అవెన్యూ రిసార్ట్స్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ క్యాంపు బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి తెలంగాణ పీసీసీ అప్పగించింది.   

ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాఘట్ బంధన్‌ కూటమి నుంచి వైదొలగడంతో బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి గుడ్‌బై చెప్పిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఎన్డీయే కూటమిలో చేరి.. నితీష్ కుమార్ బిహార్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

బిహార్‌కు 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్‌ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనుంది. అయితే  ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు గురి కావొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ అప్రమత్తమై ఎమ్మెల్యేను హైదరాబాద్‌కు తరలించటం గమనార్హం.

Advertisement
 
Advertisement