
టీటీడీలో అన్యమతస్తుల అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది శ్రీవారి ఆలయంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని అన్నారాయన. టీటీడీ సభ్యుడి సమక్షంలోనే బండి సంజయ్ అలా ఎలా ప్రకటించారని.. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ఉందని భూమన డిమాండ్ చేస్తున్నారు.
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులైన ఉద్యోగుల వ్యవహారం తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఇంత పెద్ద నింద వేసినా.. కూటమి ప్రభుత్వం, టీటీడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణమని అన్నారాయన.
టీటీడీలో 1,000 మంది అన్య మతస్తులు ఉన్నారని, వాళ్లను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే ఆయన వద్ద ఏమైనా నివేదిక ఉందా?. ఆయన అలా ప్రకటన చేసిన టైంలో పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు దీనిపై వివరణ ఇవ్వాల్సిన భాద్యత కూటమి ప్రభుత్వం, టీటీడీపైన కచ్చితంగా ఉంది
టీటీడీ బోర్డులో 22 మంది అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు గతంలో ఈవో, చైర్మన్‌లు ప్రకటించారు. అలాంటప్పుడు బండి సంజయ్ 1,000 మంది అని ఎలా అంటారు?. రెండింటిలో ఏది నిజం? ఆయన(బండి సంజయ్) లెక్క ప్రకారం.. 20 శాతం మంది అన్యమతస్తులే ఉన్నట్లా?. అసలు తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు?. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే. కచ్చితంగా టీటీడీని, ఉద్యోగస్తులను అవమానించడమే.
అధికారంలోకి రాగానే.. తిరుమలను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాంటప్పుడు తిరుపతి ప్రజలను నొప్పించిన బండి సంజయ్ ప్రకటన పట్ల ఎందుకు స్పందించరు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు, టీటీడీలు కనీసం స్పందించలేదు.. ఖండించలేదు అని భూమన అన్నారు.