కరోనా కట్టడిలో విఫలం 

Bhatti Vikramarka Inspects Medak Hospitals - Sakshi

కోవిడ్‌ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే 

సీఎల్పీ నేత భట్టి ధ్వజం 

మెదక్‌ ఆస్పత్రి సందర్శన

సాక్షి, మెదక్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల ప్రాణాలను గాలికొదిలి తన ఫాంహౌస్‌లో పడుకున్నారని దుయ్యబట్టారు. శనివారం మెదక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆయన సందర్శించారు. కోవిడ్‌ బాధితులకు వైద్యం ఎలా అందుతుందని ఆరా తీశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు, వైద్యుల పోస్టుల ఖాళీలను సూపరింటెండెంట్‌ పీసీ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కారణంగా జరుగుతున్న మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. కరోనా పరీక్షలు అధికంగా జరపాలన్నందుకు గవర్నర్‌నే విమర్శించిన ఘనుడు కేసీఆర్‌ అని విమర్శించారు.

ప్రతిపక్షాలతో పాటు కోర్టులపై సైతం మాటలతో ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఎవరు ప్రశ్నించినా సీఎం జీర్ణించుకునే స్థితిలో లేరన్నారు. ఆరున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, ఆయన కుటుంబం మాత్రం దోచుకుని దాచుకోవటంలో విజయం సాధించిందని విమర్శించారు. రోగం వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సలు అందించాల్సింది పోయి వారి ఇళ్లకు పంపటం ఎంత వరకు సమంజసమన్నారు. కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్‌ 2న సీఎం అపాయింట్‌మెంట్‌ కోరానని, ఆయన తనను కలిసేందుకు అనుమతిస్తే రాష్ట్ర అభివృద్ధిపై, గతంలో ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడతానని, లేనిచో ప్రగతి భవన్‌ ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top