ఎడారిగా దక్షిణ తెలంగాణ 

Bhatti Vikramarka Fires On Telangana Government - Sakshi

సర్కారు నిర్లక్ష్యమే కారణం: భట్టి

పొరుగు రాష్ట్రం కడుతున్న ప్రాజెక్టులపై సీఎం స్పందనేది?

వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు 

ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రపతికి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో దక్షిణ తెలంగాణ ప్రాంతమంతా ఎడారిగా మారబోతోందని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆదివారం జూమ్‌ యాప్‌ ద్వారా సీఎల్పీ సమావేశం నిర్వహించారు. కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులు, కృష్ణా జలాలు, జిల్లా ఆస్పత్రుల సందర్శన, దళితులపై అత్యాచారాలు, చేనేత కార్మికుల సమస్యలు, బెల్ట్‌ షాపుల మూసివేత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు.

పొరుగురాష్ట్రం కడుతున్న ప్రాజెక్టుల వల్ల దక్షిణ తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదని, ఈ అంశంపై త్వరలో కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి సమస్యను వివరిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ఢిల్లీకి కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం వెళ్లనుందని తెలిపారు. రాష్ట్రంలో దళితులపై దాడులు తీవ్రమయ్యాయని, వీటిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించదని మండిపడ్డారు. ఈ ఆగడాలపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిని కలుస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రపతికి, జాతీయ ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుతో పాటు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలను కూడా ఆక్రమిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కొనసాగుతున్న బెల్ట్‌ షాపులను వెంటనే మూసేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం స్పందించకపోతే బెల్ట్‌ షాపులపై ఉద్యమం చేస్తామని ప్రకటించారు. కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యానికి సంబంధించిన రేట్లను ప్రభుత్వం పక్కాగా నిర్ణయించాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను సీఎల్పీ ఆధ్వర్యంలో త్వరలో సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top