బీఆర్‌ఎస్‌ టెంపరరీ పార్టీ | Bhatti Vikramarka Comments On BRS Party | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ టెంపరరీ పార్టీ

Published Sun, Mar 10 2024 4:09 AM | Last Updated on Sun, Mar 10 2024 4:09 AM

 Bhatti Vikramarka Comments On BRS Party - Sakshi

మళ్లీ వస్తుందో లేదో తెలియదు.. కాంగ్రెస్‌ ఎప్పటికీ ఉంటుంది: భట్టి

మా నిర్ణయాలు శాశ్వత ప్రాతిపదికన ఉంటాయి

కొండలు, గుట్టలకు రైతుబంధు ఇవ్వబోం

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఉద్దేశం లేదు

విద్యుత్‌ జీరో బిల్లులు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి

ఉద్యోగులకు కచ్చితంగా ఒకటో తేదీన జీతాలు ఇస్తాం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘బీఆర్‌ఎస్‌ టెంపరరీ పార్టీ. కొంతకాలం ఉంది. మళ్లీ వస్తుందో లేదో తెలియదు. ఆ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నికల కోసమే కరెంట్‌ ఇచ్చేది. కాంగ్రెస్‌ అలా కాదు. కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉంది. మరికొంతకాలం పాలిస్తుంది. ఎప్పటికీ ఉంటుంది. మాకు బాధ్యతలున్నాయి. ఎన్నికల కోసమే కరెంట్‌ ఇవ్వం. నిర్ణయాలన్నీ శాశ్వత ప్రాతిపదికతో ఉంటాయి..’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కరెంట్‌ కోతలు ఉంటాయన్న బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించారు. శనివారం భట్టి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

జీరో బిల్లు రాకుంటే మళ్లీ దరఖాస్తు..
నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడుతూ, తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఉండి,  ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు కరెంట్‌ బిల్లు వచ్చినా కట్టాల్సిన అవసరం లేదని భట్టి చెప్పారు. అలాంటి వారిని బిల్లు కట్టాల్సిందిగా సిబ్బంది ఏమీ వేధించబోరన్నారు. వారు మళ్లీ ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించాలని, తర్వాత ఈఆర్వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల)లో ఆ వివరాలు అందించాలని సూచించారు. ఈ వివరాలను పరిశీలించి, జీరో బిల్లులు జారీ చేస్తామని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 40,33,702 కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు. గృహజ్యోతి లబ్ధిదారుల ఎంపిక నిరంతరంగా జరుగుతుందని, కొత్త రేషన్‌కార్డుల జారీ తర్వాత అర్హులకు ఈ పథకం వర్తింపజేస్తామని తెలిపారు.

కచ్చితంగా ఒకటో తేదీన జీతాలు ఇస్తాం
భవిష్యత్తులో కూడా కచ్చితంగా ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ సర్కారు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి, రాష్ట్రాన్ని నిర్వీ ర్యం చేసిందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థను చక్క దిద్దుకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంగన్‌వాడీ లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఎన్‌ఎంలను ప్రాధాన్య జాబితాలో చేర్చి వేతనా లిస్తామన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను వదిలేసి పోయిందని.. అందులో తొలుత రూ.10 లక్షలలోపు ఉన్న బిల్లులను క్లియర్‌ చేస్తున్నామని తెలిపారు.

యాదాద్రి, భద్రాద్రి.. కాళేశ్వరం లాంటివే..
యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు కాళే శ్వరం పథకం వంటివేనని.. వాటిలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ తెలంగాణకు భారంగా మారుతుందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వేల కోట్లు ఖర్చుచేసినందున వాటిని వాడుకోవాలా, వదిలేయాలా అన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రిజర్వాయర్లు, కాల్వలపై సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని, దీనిపై అధ్యయనం చేయిస్తున్నామని చెప్పారు. త్వరలో సంప్రదాయేతర ఇంధన వనరుల పాలసీ తెస్తామన్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ ఏకంగా 16,500 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని.. ఆమేర సరఫరాకు సిద్ధంగా ఉన్నామని భట్టి తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి రాష్ట్ర విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు.

అక్రమ నియామకాలపై సమగ్ర నివేదిక కోరాం
జెన్‌కో, ట్రాన్స్‌కోలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నియామకాలపై సమగ్ర నివేదిక కోరామని భట్టి వెల్లడించారు. బాధ్యులైన అధికా రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సిరిసిల్ల విద్యుత్‌ సహకార సొసైటీ(సెస్‌)ని ఉత్తర డిస్కంలో విలీనం చేసే అంశంపై నివేదిక ఇవ్వాలని ఎన్పీడీసీ ఎల్‌ సీఎండీని కోరామని చెప్పారు. 

కొండలు, గుట్టలకు రైతుబంధు ఇవ్వలేం
సాగు చేయకపోయినా కొండలు, గుట్టలున్న భూములకు గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని, ఇకపై అలా ఇచ్చేది లేదని భట్టి విక్రమా ర్క స్పష్టం చేశారు. సాగు చేసే రైతులకే ఈ పథకం కింద సహాయం అందుతుందని, సాగు ను ప్రోత్సహించడమే రైతు భరోసా లక్ష్యమని వివరించారు. ఇందిరాక్రాంతి పథం కింద వచ్చే ఐదేళ్లలో పొదుపు సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నా మని చెప్పారు. ఈనెల 12న వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement