నలందా కిషోర్‌ మృతికి చంద్రబాబే కారణం..

Avanthi Srinivasa Rao Fires On Raghurama Krishnam Raju - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును హెచ్చరించారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మీరు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భిక్షతో లోక్‌సభలో అడుగుపెట్టారనే విషయం గుర్తుంచుకోవాలి. జగన్‌ చరిష్మాతో మాత్రమే మీరు నాగబాబుపై గెలుపొందారు. మీకు భిక్ష పెట్టిన సీఎంపై విమర్శలు చేయడం తగదు. వైఎస్సార్‌సీపీ జెండాపై గెలిచిన మీరు టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. మీరు నర్సాపురం వరకు పరిమితం కండి. అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు.

విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామ కృష్ణంరాజు ఎవరు..? ఇలా వద్దని మాట్లాడినందుకే చంద్రబాబు నాయుడ్ని వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు రాకుండా ప్రజలు అడ్డుకున్నారని తెలుసుకోండి. ఢిల్లీలో నాలుగు పార్టీల నాయకులు మీకు తెలుసుండొచ్చు. అలా అని అదేపనిగా పార్టీని విమర్శించడం తగదు. మీ పంథా మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు క్షమించరు. పార్టీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయండి. రఘరామకృష్ణంరాజుకి నోటి దురుసుతనం ఎక్కువ. ఆ దురుసుతనంతోనే అనుకున​ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. (అభివృద్ధికి టీడీపీ అవరోధం: అవంతి)

నలందా కిషోర్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ మరణాన్ని కూడా చంద్రబాబు, లోకేష్‌ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిషోర్‌ టీడీపీ అభిమాని. ఆయన మరణానికి మేము కూడా సంతాపం తెలియజేస్తున్నాము. కరోనా ఎవరికైనా వస్తుంది. పార్టీలతో సంబంధం లేదు. నలందా కిషోర్‌ను పోలీసులు కర్నూలు తీసుకువెళ్లడంతో మరణించారని చంద్రబాబు, లోకేష్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నలందా కిషోర్‌పై అభిమానం ఉంటే అచ్చన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్‌ ఇప్పుడు కిషోర్‌ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు మీకు నలందా కిషోర్ ఎవరో తెలుసా ? నలందా కిషోర్  మాజీ డిప్యూటీ మేయర్  దొరబాబుతో కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్ళారు. అలా చంద్రబాబు దగ్గరకు వెళ్లిన అయిదుగురిలో ముగ్గురికి కరోనా వచ్చింది. ఆ కరోనాతోనే నలందా కిషోర్ మృతి చెందారు. అలా ఆయన మృతికి చంద్రబాబు నాయుడే కారణమంటూ వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top