ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు

Minister Avanthi Srinivas Comments On Chandrababu - Sakshi

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన గురువారం ఆంధ్రా యూనివర్సిటీ సమత బ్లాక్ ప్రాంగణంలో వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ కన్జర్వేటర్‌ రామ్మోహన్‌రావు, ఏయూ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, జేసీ గోవిందరావు, ఆర్డీవో కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. తమకు అన్ని ప్రాంతాలు,వర్గాలు సమానమని తెలిపారు.

అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
‘‘అవినీతి లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంకల్పం. వివక్ష, అవినీతి లేకుండా గడిచిన ఏడాది కాలంలో రూ.45 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశాం. ప్రాంతాలు,కులాల మధ్య ప్రతిపక్ష నేత చంద్రబాబు చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అవరోధంగా మారింది. కుట్రతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రోజుకో ప్రచారంతో విశాఖపై విషం చిమ్ముతున్నారు. విశాఖకు తుఫానుల ముప్పు ఉందని, రెండుగా చీలిక అంటూ పలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరానికి రాజధాని‌ మారుతుందంటూ అసత్యాలను వ్యాపింప చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పదేపదే కావాలని ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని’’ మంత్రి అవంతి నిప్పులు చెరిగారు

13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తాం..
రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండాలనేది చంద్రబాబు కుట్ర అని అవంతి ధ్వజమెత్తారు. మూడు రాజధానుల వెనుక ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేవని ఆయన స్పష్టం చేశారు. విశాఖపై ప్రేమతోనో, అమరావతిపై కోపంతోనో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురాలేదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాన్నలదే సీఎం వైఎస్ జగన్‌ ఉద్దేశ్యమని మంత్రి వివరించారు. ఏర్పాటు వాద ఉద్యమాలు భవిష్యత్తులో రాకూడదని సీఎం జగన్‌ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కొందరు రాజకీయ నిరుద్యోగులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు..
‘‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. అక్కడే అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తారు. విశాఖ జిల్లాలో 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. జిల్లాలో రెండు లక్షల మంది లబ్ధిదారులకి ఆగస్టు 15కల్లా ఇళ్ల పట్టాలు అందేలా చూస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. నగరాన్ని రాబోయే రోజుల్లో హరిత విశాఖగా తీర్చిదిద్దుతాం. ప్రజలంతా ఇంటికో మొక్క నాటి ప్రకృతి పరిరక్షణ లో భాగస్వాములు కావాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పిలపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top