ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ | Sakshi
Sakshi News home page

ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ

Published Fri, May 24 2024 4:16 AM

AP High Court protection for those candidates Until June 6th 2024

జూన్‌ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్టు చెయ్యొద్దని పోలీసులకు ఆదేశం

కౌంటింగ్‌ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్‌రెడ్డికి ఆదేశం

నలుగురి కంటే ఎక్కువ మందితో తిరగరాదు

ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదు

సాక్షులను ప్రభావితం చేయరాదు.. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదు

హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు స్పష్టీకరణ

వీరిపై నిఘా పెట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్‌ 6వ తేదీ వరకు అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్‌ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని..  తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. 

నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదని.. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్‌రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ తదితరులనూ ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టంచేసింది. 

అంతేకాక..  ఆయా కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయడంగానీ.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడంగానీ చేయరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదన్న హైకోర్టు, ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

అరెస్టుకు అవకాశం ఉంది.. మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండి..
ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టుచేసే అవకాశముందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌లతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 

వీటిపై జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు టి. నిరంజన్‌రెడ్డి, పి.వీరారెడ్డి, ఓ.మనోహర్‌రెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎస్‌.రామలక్ష్మణరెడ్డి, చుక్కపల్లి భానుప్రకాశ్‌.. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి తమ తమ వాదనలను వినిపించారు.

సుప్రీంకోర్టుకన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది..
పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులని, అందువల్ల వారికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టుచేయడానికి వీల్లేదన్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్‌ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. 

వాస్తవాలు విచారించకుండా ఇలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయన్నారు. తాము కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నామని సీనియర్‌ న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు అరెస్టుచేస్తే కౌంటింగ్‌ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. 

ఈ సమయంలో పీపీ నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. మధ్యంతర బెయిల్‌ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి ఘటనలు జరిగినా వారినే బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌  జ్యోతిర్మయి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను జూన్‌ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించారు.

ఆ పిటిషన్ల విచారణ 30కి వాయిదా..
ఇదిలా ఉంటే, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement