తెలంగాణలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ | Amid Lok Sabha Elections Telangana BJP Eyed On These Party Leaders | Sakshi
Sakshi News home page

ఆ పార్టీ నేతలే టార్గెట్‌గా.. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌

Mar 8 2024 5:03 PM | Updated on Mar 8 2024 5:36 PM

Amid Lok Sabha Elections Telangana BJP Eyed On These Party Leaders - Sakshi

ఆ రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని సైతం ఖరారు చేసుకుని మరీ వాళ్లతో సంప్రదింపులు.. 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల కోసం.. తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ మిగతా చోట్ల బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలకు గాలం వేస్తోంది. ఆ పార్టీలోని కీలక నేతలను.. టికెట్‌ ఆశించి భంగపడ్డ వాళ్లను.. టికెట్‌ దక్కే ఆస్కారం లేనివాళ్లను తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తోంది. 

తాజాగా.. శుక్రవారంనాడు మహబూబాబాద్‌ మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత సీతారాం నాయక్ ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెళ్లారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ మహబూబాబాద్‌ పార్లమెంటరీ సన్నాహాక సమావేశంలో.. సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవితకే టికెట్‌ ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో అప్పటిదాకా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా కనిపించిన సీతారాం నాయక్‌ ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు.

ఇదీ చదవండి: తొమ్మిదిలో ముగ్గురు సిట్టింగ్‌లే!

కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ అయిన సీతారాం నాయక్‌.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి కేంద్రమంత్రి బలరాం నాయక్‌ను ఓడించారు. అయితే గత ఎన్నికల్లో కేసీఆర్‌ చెప్పడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఆ స్థానంలో రెడ్యా నాయక్‌ తనయ, మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే కవిత మాలోత్‌కు బీఆర్‌ఎస్‌కు టికెట్‌ ఇవ్వగా.. ఆమెనెగ్గారు. ఈసారి ఎలాగైనా టికెట్‌ దక్కుతుందనే  ఆశతో ఉన్న సీతారాం నాయక్‌కు అధిష్టానం ప్రకటన తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో తమ పార్టీలో చేర్చుకుని సీతారాం నాయక్‌కు ఎంపీ టికెట్‌ ఆఫర్‌ చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు స్పష్టమవుతోంది.   

‘‘సీతారాం నాయక్‌ లాంటి వాళ్లు బీజేపీలోకి వస్తే కాదంటామా?.. బీజేపీలో చేరాలన్నది ఇక ఆయనే నిర్ణయించుకోవాలి’.. సీతారాం నాయక్‌ను కలిసిన అనంతరం కిషన్‌రెడ్డి చెప్పిన మాటలివి. ‘‘బీఆర్‌ఎస్‌ కోసం అహర్నిశలు శ్రమించా. కానీ, అధిష్టానం పట్టించుకోలేదు. బీజేపీ నుంచి చేరాలనే ప్రతిపాదన వచ్చింది. కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా’’  అని మీడియాకు సీతారాం నాయక్‌ తెలిపారు. 

ఇక.. గులాబీ జెండా పట్టుకునే నాధుడే లేని రోజుల్లో ఆయన ఖమ్మంలో ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక  వ్యక్తి జలగం వెంకటరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఐదవ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు తనయుడే ఈయన. అయితే కాలక్రమేణ రాజకీయాలు ఆయన్ని బీఆర్‌ఎస్‌కు దూరం చేశాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ తరఫున పోటీ చేసినా.. రెండో స్థానానికే పరిమితం అయ్యారాయన.  దీంతో ఆయన్ని బీజేపీలోకి తీసుకుని ఖమ్మం ఎంపీ టికెట్‌ ఆఫర్‌ చేయాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జలగంను కలిసి బీజేపీలోకి ఆహ్వానించగా.. ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీళ్లతోపాటు.. మరికొందరు బీఆర్‌ఎస్‌ నేతలతోనూ బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement