పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపునకు సంబంధం లేదు

Ambati Rambabu On Polavaram Project Hight Badrachalam Flood - Sakshi

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

గోదావరి ఉధృతితోనే నదీ పరీవాహక ప్రాంతాల ముంపు

1986 వరదల సమయంలో కూడా భద్రాచలం మునిగింది

తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు సరికాదు

పోలవరం 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్రం క్లియరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలం ముంపునకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల వల్లనే తెలంగాణ, ఆంధ్రలోని నదీ పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలోనూ గోదావరికి వచ్చిన వరదల వల్ల తెలంగాణ, ఆంధ్రల్లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 1986లో గోదావరి వరదల వల్ల భద్రాచలం ముంపునకు గురయిందని అంబటి గుర్తు చేశారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల తెలంగాణలోని ప్రాంతాలు మునిగి పోతున్నాయని, భద్రాచలం మునగడానికి కూడా ఇదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.  

పూర్తిగా నిండినా నష్టం ఉండదన్న సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌
పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతు లు ఇచ్చిందని అంబటి గుర్తు చేశారు. ఈ ఎత్తులో రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండినా (ఎఫ్‌ఆర్‌ఎల్‌) నష్టం ఉండదని సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) పరిశోధించి తేల్చిందని చెప్పారు. అందుకే పోలవరం నిర్మాణం వల్ల ముం పునకు గురయ్యే ఏడు మండలాలను విభజన సమ యంలో ఏపీకి కేటాయించారన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం వల్ల ముంపునకు గురయ్యే ఏడు మండలాల వారికి పునరావాసం కల్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. 

కొత్త వివాదాలు సృష్టించవద్దు
‘రెండు రాష్ట్రాల్లో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్లం. వివాదాలన్నీ సెటిల్‌ అయ్యాయి. ఇప్పుడు మనకేం వివాదాలు లేవు. కొత్త వివాదాలను సృష్టించుకోవద్దు’అని అంబటి సూచించారు. జల వివాదాలకు సంబంధించి సెంట్ర ల్‌ వాటర్‌ కమిటీ , కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పారు.  విడిపోయి కలిసుందాం అన్న మాటలకు కట్టుబడి రెండు రాష్ట్రాల ప్రతినిధులు సోదరభావంతో ఉండాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు దశలవారీగా పూర్తవుతుందని,. వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామన్నారు.  

భద్రాచలం ఇవ్వమంటే ఇచ్చేస్తారా?
భద్రాచలం సమీపంలో ఉన్న ఏపీ పరిధిలోని ఐదు గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయాలంటూ మంత్రి పువ్వాడ అడిగిన విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘ఇచ్చేయమనగానే ఇస్తారా? అలా అంటే భద్రాచలం మాదే కదా.. ఏపీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా?’అని అంబటి ప్రశ్నించారు.  

వరదలపై ఈనాడు వక్రబుద్ధి
గోదావరి వరదల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలోను ఈనాడు తన కుటిలబుద్ధిని వద లడం లేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అనూహ్యంగా జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదలను ఆరు జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కొని సహాయ కార్య క్రమాలు చేపడితే.. ఈనాడు పత్రిక.. ‘పిల్లలకు పా లు లేవు.. పెద్దలకు తిండిలేదు..’ అని దుర్మార్గంగా తప్పుడు వార్త రాసిందని చెప్పారు. దీనిపై  తాను మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించింద న్నారు.

అనూహ్యంగా జూలై నెలలో ఈ వరదలు వచ్చాయని చెబితే.. ప్రకృతి వైపరీత్యాలు– మన మేం చేయలేం అని వారి తప్పుడు వార్తను తాను ఒప్పుకొన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావుకు వయసొచ్చిందిగానీ బుద్ధి రాలేద న్నారు. చంద్రబాబును అర్జెంటుగా సీఎంను చేయాలని, భుజాన పెట్టుకుని వెళ్లాలనుకుంటున్న రామోజీరావు తన వక్రమార్గాన్ని వీడాలని హితవు పలికారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతిలో ఉష్ణోగ్రతలను కంట్రోల్‌ చేయమని అధికారులను ఆదేశించాడు. తిత్లీ తుపాన్‌ను అధికారులు కంట్రోల్‌ చేస్తున్నారని చెప్పాడు. అలాంటి మాటలను రాయని రామోజీరావు నేను అనని మాటలను అన్నట్లు రాస్తున్నాడు..’ అని అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top