క్యాడర్‌ను కాపాడుకోవడానికే చంద్రబాబు చిల్లర డ్రామా

Ambati Rambabu Comments On Chandrababu Naidu - Sakshi

కోవిడ్, కోడ్‌ ఉన్నప్పుడు ధర్నా ఎలా చేస్తావ్‌?

ఏదీ లేనప్పుడే వైఎస్‌ జగన్‌ను అడ్డుకున్నావ్‌

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: జారిపోతున్న తెలుగుదేశం క్యాడర్‌లో భ్రమలు కల్పించేందుకే చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలో హైడ్రామా చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో నిలబెట్టేందుకు అభ్యర్థులే లేని టీడీపీని చూసి సీఎం జగన్‌ ఎందుకు భయపడతారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. కోవిడ్, ఎన్నికల కోడ్‌ ఉన్నపుడు నిరసన ప్రదర్శన చేయకూడదని 14 ఏళ్లు పాలించిన ఆయనకు తెలియపోవడం శోచనీయమన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. ఓడిపోయే ప్రతీసారీ వీరంగం సృష్టించడం చంద్రబాబుకు మామూలే అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఎలక్షన్‌ కమిషన్‌పై వీరంగం వేశారని, ఇప్పుడు జారిపోయే క్యాడర్‌లో భ్రమలు కల్పించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పారు.

21 నెలలుగా పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్న జగన్‌ ప్రభుత్వం.. చేవ చచ్చిన టీడీపీకి భయపడుతుందా? అసలీ పరిస్థితి ఉందా? అంటూ ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘ఎన్నికల కోడ్, కోవిడ్‌ ఉన్న సమయంలో నిరసన చేయడం సరికాదని పోలీసులు ముందు రోజే చంద్రబాబుకు అనుమతి నిరాకరించారు. దయచేసి రావద్దని ఎయిర్‌పోర్టులో వినమ్రంగా వేడుకున్నారు. కానీ చంద్రబాబు పోలీసులపైనే గర్జించారు. ఎల్లో మీడియా వ్యక్తి సలహా ఇవ్వగానే బాబు నేల మీద కూర్చుని హైడ్రామా చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసుపై కావాలనుకుంటే చంద్రబాబు కోర్టుకెళ్లాలి. చట్టాన్ని అతిక్రమించిన చంద్రబాబును కానిస్టేబులైనా అరెస్టు చేసే అధికారం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఇన్ని నీతులు చెప్పే చంద్రబాబు, ఆయన తాబేదారులు.. 2017లో వైఎస్‌ జగన్‌ పట్ల వ్యవహరించిన తీరేంటి? అప్పుడు కోవిడ్‌ లేదు. ఎన్నికల కోడ్‌ లేదు. హోదా కోసం వైజాగ్‌లో విద్యార్థులు ప్రదర్శన చేస్తుంటే ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ వెళ్లారు. రన్‌వే మీదనే ఆయనను ఆపేసినప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అప్పుడు బాబు చేసింది కక్షసాధింపు చర్య. ఈ రోజు ప్రభుత్వం చేసేది చట్టం కాపాడే చర్య. ఎస్‌ఈసీని దైవాంశ సంభూతుడన్న టీడీపీ నేతలు.. ఇప్పుడు వ్యతిరేకంగా రచ్చ చేయడం మరో నాటకం’’ అని అన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top