‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’ | Sakshi
Sakshi News home page

‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’

Published Tue, May 21 2024 2:28 PM

Alleti Maheshwar Reddy Allegations On Minister Uttam Kumar Reddy

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి. తేమ పేరుతో క్వింటాల్‌కు పది నుంచి 12 కిలోల తరుగు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లై డైరెక్టర్ చౌహాన్‌కు వ్యవసాయ శాఖ గురించి తెలియదని, ధాన్యం కొనుగోళ్ళలో 10 నుంచి 12 కిలోల తరుగు ఎ వరి జేబులోకి వెళ్తోందని ప్రశ్నించారు. ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. అందులో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరుగు పేరుతో తీస్తున్నారని మండిపడ్డారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా యూ (U) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై  శాఖలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసి డిల్లి పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడి పోతానేమో అనే భయంతో ఇలా చేశారని అన్నారు.

రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన CMR రైస్ ఎంత మేరకు ఇచ్చారని ప్రశ్నించారు. డిఫాల్టర్లుగా ఉన్న రైస్ మిల్లర్లకు మళ్ళీ ఎందుకు ధాన్యం ఇస్తున్నారని నిలదీశారు. రైతుల దగ్గర ధాన్యం దోచుకుంటున్నారని, రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే.. ప్రభుత్వం ఎందుకు వడ్డీ కడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా? అని అడిగారు. తన ప్రశ్నలకు  మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement