మౌన ప్రేక్షకుల్లా ఉండొద్దు | Sakshi
Sakshi News home page

మౌన ప్రేక్షకుల్లా ఉండొద్దు

Published Mon, Sep 18 2023 3:42 AM

AICC President Mallikarjunakharge with CLP leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పదేళ్ల బీజేపీ ­పాలనలో సామా­న్య ప్రజల సమస్య­లు రెట్టింపయ్యాయి. పేద­లు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఎదు­ర్కొం­టున్న సమస్యలు పరిష్కరించేందుకు మోదీ అంగీకరించరు. తానేం చేస్తున్నారో వెనక్కి తిరిగి చూసుకోరు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తు­న్నారని హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇలాంటి సమ­యంలో మనం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవద్దు. నియంతృత్వాన్ని పారదోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరం ఏకమై పోరాడాలి.’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపుని­చ్చారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ సమస్యల నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడంతోపాటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకోవాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కనపెట్టి కాంగ్రెస్‌ నేతలందరూ అవిశ్రాంతంగా పనిచేయాలని, వ్యక్తిగత విభేదాల కన్నా పార్టీ ప్రయో­జనాలే ముఖ్యంగా ముందుకెళ్లాలని చెప్పా­రు.

సామాజికన్యాయం, సంక్షేమమే ధ్యేయంగా ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్  రాష్ట్రాల్లో ప్రజారంజక పాలన అందించామని, ఈ రెండు రాష్ట్రాల మోడల్‌ను దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచా­రం చేయాలని పిలుపు­ని­చ్చారు. రెండు, మూడు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ­బోతున్నాయని, ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు వస్తాయని, వీటితో పాటు జమ్మూ­కశ్మీర్‌లో కూడా ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాలని ఖర్గే కోరారు.

అదే గాంధీకి నిజమైన నివాళి
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకె­ళ్లాలని కాంగ్రెస్‌ నేతలకు ఖర్గే పిలుపు­నిచ్చారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన శతాబ్దం పూర్తవుతున్న తరుణంలో ఈ దేశంలో ప్రత్యామ్నాయ ప్రభు­త్వాన్ని ఏర్పాటు చేసేందుకుగాను బీజేపీని గద్దె దింపడమే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ నుంచి స్పష్టమైన సందేశం, పునరు­త్తేజంతో వెళదాం. తెలంగాణతోపాటు భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో విజయం సాధించాలనే కృతనిశ్చయంతో అందరూ హైదరాబాద్‌ వదిలి­వెళ్లాలి. బీజేపీ దుష్పరిపాలన కారణంగా ఎదు­రవుతున్న కష్టాల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగించాలి.’ అని ఖర్గే దిశానిర్దేశం చేశారు. 

అన్ని కమిటీలు పూర్తయ్యాయా?
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఖర్గే మాట్లాడుతూ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే రాజకీయ ప్రత్యర్థులను ఓడించగలమని చెప్పారు. కలసికట్టుగా ప్రత్యర్థిపై ఐక్య పోరాటాలు చేసినప్పుడు విజయం సాధిస్తామని కర్ణాటక ఫలితాలే చెబుతున్నాయన్నారు. మండల, బ్లాక్, జిల్లాల స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయిందా? స్థానిక నేతలకు కార్యాచరణ ఇస్తున్నామా? గట్టి నాయకులను గుర్తిస్తున్నామా? అనే విషయాల్లో ఆత్మవిమర్శ చేసుకోవాలని పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలకు ఖర్గే సూచించారు.   

Advertisement
Advertisement