నేడు బిహార్‌లో రెండో దశ ఎన్నికలు

2nd phase of Bihar assembly elections 2020 - Sakshi

పట్నా: బిహార్‌ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మహామహులు బరిలో నిలిచిన ఈ రెండో దశను బిహార్‌ ఎన్నికల్లో కీలక దశగా భావిస్తున్నారు. అధికార ఎన్డీయే అభ్యర్థుల కోసం ప్రధాని మోదీ, సీఎం నితీశ్‌సహా కీలక నేతలు, విపక్ష మహా కూటమి కోసం కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ రాహుల్‌గాంధీ, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వీ సహా ముఖ్యమైన నాయకులు ప్రచారం నిర్వహించారు. 17 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 94 అసెంబ్లీ స్థానాలకు నేడు(మంగళవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 1.35 కోట్ల మహిళా ఓటర్లు సహా మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు సుమారు 1500 అభ్యర్థుల భవితను నిర్దేశించనున్నారు.

ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఉన్నవారిలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఉన్నారు. శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్‌ సిన్హా కాంగ్రెస్‌ తరఫున బంకీపూర్‌ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ జిల్లా నలందలోని ఏడు స్థానాలకు కూడా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. నలంద జిల్లాలో జేడీయూ బలంగా ఉంది. రెండోదశ ఎన్నికలు జరుగుతున్న 94 సీట్లలో విపక్ష కూటమి తరఫున 56 స్థానాల్లో ఆర్జేడీ, 24 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాలుగు స్థానాల చొప్పున, సీపీఐఎంఎల్‌ మరికొన్ని స్థానాల్లో పోటీలో ఉన్నాయి. అధికార ఎన్డీయే నుంచి బీజేపీ 46 స్థానాల్లో, జేడీయూ 43 సీట్లలో, వీఐపీ 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎల్జేపీ 52 సీట్లలో అభ్యర్థులను నిలిపింది.

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికలు కీలకం
నేడు 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. సీఎం  చౌహాన్‌కు సవాలుగా మారిన ఎన్నికలివి. కాంగ్రెస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కమల్‌ సర్కారు కూలడం తెల్సిందే. ఆ 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.  గుజరాత్‌(8), కర్నాటక(2), చత్తీస్‌గఢ్‌(1), ఉత్తర ప్రదేశ్‌(7), జార్ఖండ్‌(2), నాగాలాండ్‌(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ(1)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top