రామగుండం: పెద్దంపేట–గోదావరినది వంతెనకు ఇరువైపులా ప్రధాన రైల్వే ట్రాక్ బలోపేతం చేసేందుకు సపోర్టింగ్ ర్యాంపు నిర్మాణ పనులు శరవేగంగా కొ నసాగుతున్నాయి. అంతర్గాంకు చెందిన ఓ రైతు భూ ముల నుంచి రైల్వే కాంట్రాక్టర్ జేసీబీతో మట్టి తవ్వి టిప్పర్లలో రైల్వే ట్రాక్ పక్కన ర్యాంపు నిర్మాణానికి తరలిస్తున్నారు. కాగా మట్టి తవ్వకాల్లో రాయదండి–పెద్దంపేట ఎత్తిపోతల పథకం పైపులైన్లు ధ్వంసం కాగా, సదరు కాంట్రాక్టరు ఆనవాళ్లు లేకుండా పైపులను గోదావరినదిలో పడేశాడు. ఈ ఎత్తిపోతలను ప్రారంభిస్తే 70 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే బొట్లకుంట, అక్కడి నుంచి 60 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఊరకుంటకు సాగునీటి సరఫరా జరుగుతుంది. తవ్వకాల్లో సుమారు 15 పైపులు (8 ఫీట్ల పొడవు) పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాగా ప్రస్తుతం వరి కోతలు పూర్తయిన తర్వాత ఎత్తిపోతలను ప్రారంభించి ఆరుతడి పంటలకు నీరందించాలని నిర్ణయించినట్లు సొసైటీ ప్రతినిధులు పేర్కొనగా, ఇంతలోనే పైపులైన్లు ధ్వంసం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎత్తిపోతల సొసైటీ చైర్మన్ ఎనగంటి సత్యనారాయణరావు, ప్రధాన కార్యదర్శి కరివేద శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ధ్వంసమైన పైపులను సంబంధిత అధికారులు పరిశీలించి సంబంధిత కాంట్రాక్టరును బాధ్యుడిగా నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు.


