పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అకడమిక్ ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ బృందాలతో ఉన్నత పాఠశాలల విద్యా ప్రగతిపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ (మౌఖిక పఠన నైపుణ్యం) అభివృద్ధి కోసం అమలు చేస్తున్న రెమెడియేషన్ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు చదవడం, రాయడంతో పాటు ప్రాథమిక సంఖ్యాజ్ఞాన స్థాయిల్లో మెరుగుదల సాధించేలా బోధన సాగాలని సూచించారు. డీఈవో శారద, ఏఎంవో పీఎం షేక్, అకడమిక్ ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ టీం లీడర్స్ సీహెచ్ ఆగయ్య, ఆర్.సుదర్శనం, సబ్జెక్టు నిపుణులు, ప్యానెల్ సభ్యులు ఎ.జ్యోతి, కె.మంజుల, జి.జగదీశ్వర్, పి.హరిప్రసాద్, జె.శ్రీనివాస్, ఎస్.కృష్ణ మోహన్, ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పోషక విలువలతో కూడిన
భోజనం అందించాలి
గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రంగంపల్లి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యాభ్యాసం, వసతి, భోజన నాణ్యత, విద్యార్థుల సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు వసతులు ఇతర అవసరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ మణిదీప్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


