గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–2 పరిధిలోని వకీల్‌పల్లి గనిని రీజియన్ సేఫ్టీ జీఎం మల్లయ్య గురువారం తనిఖీ చేశారు. మ్యాప్‌ద్వారా పనిస్థలాలను పరిశీలించారు. అనంతరం గనిలోకి వెళ్లి రక్షణ చర్యలను తనిఖీ చేశారు. రూఫ్ సపోర్ట్, వెంటిలేషన్, గ్యాస్ పరీక్షలు, డస్ట్ నియంత్రణ, మ్యాన్ రైడింగ్ సిస్టమ్, విద్యుత్ భద్రత, ఫైర్ ఫైటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, గనిలో ఉత్పత్తి ఎంత ముఖ్యమో, కార్మికుల భద్రత అంతకంటే ముఖ్యమన్నారు. భద్రతా నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఏ చిన్న అలక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు. ప్రమాద రహిత గనిగా వీకేపీని తీర్చిదిద్దేందుకు అధికారులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట గని మేనేజర్ మల్లేశం తదితరులున్నారు.


