పెద్దపల్లి: జిల్లాలోని కొత్త పింఛన్‌దారుల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. జిల్లాలోని ఎలిగేడు మండలం ధూళికట్టలో శుక్రవారం ఎలిగేడు, జూలపల్లి మండలాలకు చెందిన వారికి మంజూరు ఉత్తర్వుల (ప్రొసీడింగ్స్) కాపీలు అందజేయనున్నారు. ఇందు కోసం డీఆర్డీవో, అధికారులు ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో 11,804 మంది లబ్ధిదారులు
జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన 11,804 మందికి పింఛన్లు అందుతున్నాయి. అత్యధికంగా 6,919 మంది వితంతువులు ఉండగా, 2,330 మంది దివ్యాంగులు, 1,270 మంది ఒంటరి మహిళలు, 1,225 మంది కల్లుగీత కార్మికులు, 60 మంది నేత కార్మికులు ఉన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా 2,722 మంది లబ్ధిదారులు ఉండగా, పెద్దపల్లి మండలంలో 1,114 మంది, సుల్తానాబాద్‌లో 755 మంది, కాల్వశ్రీరాంపూర్‌లో 733 మంది, మంథనిలో 732 మంది లబ్ధి పొందుతున్నారు.
సదరం సర్టిఫికెట్ ఉంటేనే..
సదరం సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో 267 మంది దివ్యాంగుల ప్రొసీడింగ్స్ పంపి ణీ తాత్కాలికంగా నిలిపివేశారు. సర్టిఫికెట్ల ప్రక్రియ పూర్తయి ఆన్‌లైన్‌లో నమోదైన తర్వాత వారి ఖాతా ల్లో నేరుగా పింఛన్ సొమ్ము జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల కోసం డీఆర్డీవో, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలను సంప్రదించాలని సూచించారు.
వారసులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ
పింఛన్‌దారు భర్త లేదా భార్య మరణించినా అర్హులైన వారికి పింఛన్ బదిలీ చేసే ప్రక్రియ చేపట్టనున్నారు. ఇలాంటి వారికి ప్రత్యేకంగా ప్రొసీడింగ్స్ అందజేయకుండా ఈనెల 19న నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఫేజ్–2లోనూ అవకాశం
అర్హులు ఎవరైనా జాబితాలో పేరు లేకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదని, తదుపరి ఫేజ్–2లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అదనపు డీఆర్డీవో రవీందర్ తెలిపారు. అర్హులైన ప్రతీఒక్కరికి పింఛన్ అందిస్తామని పేర్కొన్నారు. ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని, దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు.
నేడు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్
19 నుంచి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ


