వెలుగులు పంచిన కుటుంబం! ● భర్తను కోల్పోయిన దుఃఖంలోనూ నేత్రదానానికి అంగీకారం కోల్‌సిటీ: ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఓ కుటుంబం ముందుకొచ్చింది. చూపులేని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి కలిసి మృతుడి నేత్రాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గోదావరిఖని బాపూజీనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కోండ్ర సతీష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ నెల 2న స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సతీష్ నివాసంలో నేత్రదాత సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం మగువ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షురాలు, సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి అట్లూరి శశికళ, ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు మాట్లాడుతూ.. సతీష్ తల్లి కొమురమ్మ, భార్య లావణ్య, పిల్లలు లోకేశ్, సహస్ర తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భర్త దూరమై.. రెట్టింపైన కష్టం
ఏడాది క్రితం తలకు తీవ్ర గాయం కావడంతో లావణ్య రెండు కళ్ల చూపును కోల్పోయింది. అప్పటి నుంచి భర్త, ఇద్దరు పిల్లలే ఆమెకు ఆధారంగా ఉన్నారు. ఇప్పుడు భర్త కూడా మరణించడంతో ఆమె కష్టాలు మరింత పెరిగాయి. ఇలాంటి విషాద సమయంలోనూ నేత్రదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు.
● భర్తను కోల్పోయిన దుఃఖంలోనూ నేత్రదానానికి అంగీకారం
మరణంలో
మరొకరికి చూపు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధి బొమ్మకల్‌కు చెందిన ర్యాకం సంపత్(48) అనారోగ్యంతో గురువారం మృతిచెందగా అతడి నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. సంపత్ ఊపిరితిత్తుల సమస్యతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరణించాడు. పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ మరొకరికి కంటిచూపు ఇవ్వాలనే ఉద్దేశంతో తండ్రి రాములు, భార్య సబిత నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చారు. రామాయమ్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు, మృతుడు సంపత్ నేత్రాలను సేకరించారు. కార్పొరేటర్లు మేకల వెంకటేశ్, గాదె రూపాశ్రీనివాస్, చిందం సాయిచరణ్, అనిల్‌కుమార్, దశరథం, ర్యాకం శ్రీనివాస్, మోహన్, సాయికృష్ణ, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.