● ముగిసిన సింగరేణి క్రికెట్ లీగ్ మ్యాచ్లు ● నేడు తుదిపోరు
రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్ చాంపియన్షిప్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. లీగ్ మ్యాచ్లు గురువారం ముగిశాయి. మణుగూరు– ఇల్లెందు సంయుక్త జట్టు, శ్రీరాంపూర్ జట్టు మధ్య శుక్రవారం తుదిపోరు జరగనుంది.
లీగ్ మ్యాచ్లో హోరాహోరీ
గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో మందమర్రి–బెల్లంపల్లి సంయుక్త జట్టు, కొత్తగూడెం కార్పొరేట్ జట్లు తలపడగా కొత్తగూడెం కార్పొరేట్ జట్టు విజయం సాధించింది. అనంతరం ఆర్జీ 1, ఆర్జీ 2 సంయుక్త జట్టు మణుగూరు–ఇల్లెందు సంయుక్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మణుగూరు– ఇల్లెందు జట్టు విజయం సాధించింది. మరో ఆసక్తికర లీగ్లో కొత్తగూడెం కార్పొరేట్, శ్రీరాంపూర్ జట్లు తలపడగా శ్రీరాంపూర్ జట్టు గెలుపొందింది. పాయింట్ల ఆధారంగా మణుగూరు–ఇల్లెందు సంయుక్త జట్టు, శ్రీరాంపూర్ జట్టు ఫైనల్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు జరుగనున్న ఫైనల్ మ్యాచ్లో మణుగూరు– ఇల్లెంల్లందు, శ్రీరాంపూర్ జట్లు బరిలోకి దిగనున్నాయి.
కోలిండియా పోటీలకు ఎంపిక
కంపెనీ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను కోలిండియా పోటీలకు ఎంపిక చేయనున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్, తదితర విభాగాల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుల స్కోర్షీట్లను సింగరేణి కార్పొరేట్ కార్యాలయానికి పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోలిండియా పోటీల తేదీలు ఖరారైన అనంతరం కార్పొరేట్ అధికారులు ఆయా స్కోర్షీట్లను పరిశీలించి, ఎంపికై న సింగరేణి క్రీడాకారుల జాబితాను ప్రకటించనున్నారు.


