సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యం

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

ఎలిగేడు: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేస్తే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని మండల ప్రత్యేక అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి నరేశ్‌కుమార్‌ నాయుడు అన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. సూపర్‌ ఎల్‌నినో కారణంగా లోటు వర్షపాతం ఉన్నందున యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా రైతులకు సూచించాలని ఏవో ఉమాపతి సభాలో ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. మొక్కజొన్న విత్తనాలు మండలకేంద్రాల్లో అందుబాటులో లేవని, వాటిని సబ్సిడీపై ప్రభుత్వం అందించాలని రాములపల్లి సర్పంచ్‌ సిద్ది తిరుపతియాదవ్‌ కోరారు. ర్యాకల్‌దేవుపల్లిలో వైకుంఠధామానికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదని, మరమ్మతుకు గురైన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని గత సభలో విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు స్పందించడంలేదని ర్యాకల్‌దేవుపల్లి సర్పంచ్‌ మద్దెల రమాదేవి–సంపత్‌ విద్యుత్‌ ఏఈ సంపత్‌కుమార్‌ను ప్రశ్నించారు. రాములపల్లిలోని గంగిరెద్దుల కాలనీలో అక్కడి ప్రజలు సంచార జీవులుగా జీవిస్తున్నారని, అక్కడి పిల్లలకు బర్త్‌ సర్టిఫికెట్లు లేక ఆధార్‌ కార్డు నమోదుకు ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్‌ తిరుపతియాదవ్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రాములపల్లిలో అసైన్డ్‌ పట్టా భూములు ఇచ్చిన చోట వారిని కాదని, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలకు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఎలా అనుమతులు ఇస్తారని, అక్కడే ఉన్న 3ఎకరాల పల్లె ప్రకృతివనం ఎలా తొలగిస్తారని సర్పంచ్‌ తిరుపతియాదవ్‌ అధికారులను ప్రశ్నించగా, అది ప్రభుత్వం పరిధిలోనిదే అని అధికారులు పేర్కొన్నారు. నర్సాపూర్‌లోని పెరుమాండ్లకుంట మత్తడికి మట్టిని అడ్డంగా పోయడంతో కుంటలోకి నీరు రావడంలేదని, దాన్ని తొలగించాలని సర్పంచ్‌ పల్లెర్ల వెంకటేశ్‌గౌడ్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ యాకన్న, ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో కిరణ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ సామ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొట్యాల రమేశ్‌, సర్పంచ్‌లు ప్రవీణ్‌, కొమురయ్య, వెంకటేశ్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి, బాపయ్య, రజిత–లక్ష్మారెడ్డి, లత–శ్రీనివాస్‌గౌడ్‌, రమాదేవి–సంపత్‌, శైలజ–వెంకట్రామ్‌రెడ్డి, వాణి–గోపాల్‌రావు, రాధ గంగా జమున–వేణుమాధవరావు, తిరుపతియాదవ్‌, ఎంఈవో నరేంద్రచారి, ఏవో ఉమాపతి, మెడికల్‌ ఆఫీసర్‌ నిస్సీక్రిస్టీనా, విద్యుత్‌ ఏఈ సంపత్‌కుమార్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement